ap7am logo

తలపై తుపాకులు పెట్టినా జ‌న‌సేన పార్టీని ఏ పార్టీతో క‌ల‌పం: పవన్ కల్యాణ్

Sat, Aug 17, 2019, 09:57 AM
Related Image
  • భావ‌జాలాన్ని అర్థం చేసుకున్నవారితో పార్టీ న‌డుపుతా
  • అధికారం కోసం కాదు ప్రజ‌ల కోసం ప‌ట్టుప‌డ‌తా
  • రాజ‌కీయాల్లో మాట నియంత్రణ అవ‌స‌రం
  • సోష‌ల్ మీడియా అనే అద్భుత‌మైన వ్యవ‌స్థని దుర్వినియోగం చేయొద్దు
  • జ‌న‌ సైనికులు సంయ‌మ‌నంతో మాట్లాడాలి
  • మీ ప్రేమ‌తో న‌న్ను బందీని చేయొద్దు.. ప్రజా స‌మ‌స్యలు తెలుసుకోనివ్వండి
  • విజ‌య‌వాడ పార్లమెంట్ నాయ‌కులు, జ‌న‌ సైనికుల‌తో ప‌వ‌న్‌

జ‌న‌సేన పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీల్లాంటిది కాద‌ని, పేరుకి ప్రాంతీయ పార్టీ అయిన‌ప్ప‌టికీ ప్ర‌తి భార‌త పౌరుడిని సమంగా చూడాల‌న్న ల‌క్ష్యంతో, జాతీయ స‌మ‌గ్ర‌త‌ను కాపాడాల‌న్న ల‌క్ష్యంతో, స్వ‌తంత్ర ఫ‌లాలు అంద‌రికీ అందాల‌న్న ల‌క్ష్యం ఉన్న పార్టీ అని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ స్పష్టం చేశారు. టీడీపీ తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వ నినాదంతో, టిఆర్ఎస్ తెలంగాణ ప్ర‌జ‌ల కోసం, మ‌రో పార్టీ తండ్రి వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని ముఖ్య‌మంత్రి అవ్వాల‌న్న ల‌క్ష్యాల‌తో ఆవిర్భ‌విస్తే, జ‌న‌సేన పార్టీ జాతి కోసం ఆవిర్భ‌వించింద‌న్నారు. ఏ జాతీయ పార్టీ అయినా...తల మీద తుపాకులు పెట్టినా జ‌న‌సేన పార్టీని క‌లిపే ప్ర‌స‌క్తే లేద‌ని తెలిపారు. దీన్ని పార్టీ మాట‌గా ముందుకు తీసుకువెళ్లాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. శుక్ర‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ “పార్టీ నిర్మాణంలో భావ‌జాలాన్ని అర్ధం చేసుకున్న వారికి ఇంఛార్జీలు అవ‌కాశం ఇస్తున్నాం. రాజ‌కీయం అంటే ఏది ప‌డితే అది మాట్లాడ‌డం కాదు. కొంద‌రికి భావోద్వేగాలు ఎక్కువ‌గా ఉంటాయి. రాజ‌కీయాల్లో ఉండాలి అంటే మాట మీద నియంత్ర‌ణ ఉండాలి. నోటికి వ‌చ్చింది మాట్లాడి సోష‌ల్ మీడియా అనే అద్భుత‌మైన వ్య‌వ‌స్థ‌ని దుర్వినియోగం చేయవద్దు. ఎవ‌రో కొద్ది మందిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే అవేమీ న‌న్ను ఆప‌లేవు. ఎవ‌రికైనా అభిప్రాయాలు చెప్పే హ‌క్కు ఉంది.

•అలా చేస్తే మరింత ఇబ్బందిపడతారు

రోడ్ల మీద‌కి వెళ్లి సోష‌ల్ మీడియాలో మాట్లాడితే పిల‌వ‌డానికి నేను కాంగ్రెస్ పార్టీలాగా భ‌య‌ప‌డ‌ను. మీకొచ్చిన బ‌లం నేను, నాకు అండ‌గా నిల‌బ‌డిన జ‌న‌ సైనికుల వ‌ల్ల వచ్చినదే. అది మీ సొంత బ‌లం అనుకోవ‌ద్దు. మీరు బ‌య‌టికి వెళ్లి మాట్లాడితే పిలిచేస్తాను అనుకుంటే మ‌రింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సోష‌ల్ మీడియాలో మాట్లాడే జ‌న‌సైనికులు సంయ‌మ‌నంతో మాట్లాడాలి.

నేను నా స్వార్ధం కోసం పార్టీ పెట్ట‌లేదు. అట్ట‌డుగు స్థాయి నుంచి రాజ‌కీయాల్లో ఎద‌గ‌డానికి వ‌చ్చాను. దొడ్డి దారిన ఎద‌గ‌డానికి రాలేదు. తెలుగువారు ఎక్క‌డ ఉన్నా వారికి అండ‌గా ఉండాల‌న్న ఆలోచ‌న‌తో పెట్టాను. ఓటమిగానీ, ఇలాంటి విమ‌ర్శ‌లు గానీ న‌న్ను భ‌య‌పెట్ట‌లేవు. ప‌ని తీరు ఆధారంగా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తాం.

• కృష్ణా వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోండి

100 రోజుల త‌ర్వాత ప్ర‌భుత్వ ప‌ని తీరు ఎలా ఉంది.? ప్రజా స‌మ‌స్య‌లను ఎలా ముందుకు తీసుకువెళ్తాం? అనే అంశాల‌ను మీ ముందు ఉంచుతాం. ప్ర‌స్తుతం క‌ష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వం సరిగా స్పందించ‌డం లేద‌న్న అంశం నా దృష్టికి వ‌చ్చింది. చాలా ప్రాంతాల్లో ఇళ్ల‌లోకి నీరు వ‌చ్చి చేరుతోంది. పంట‌లు న‌ష్ట‌పోతున్నారు. బాధితుల‌కు ప్ర‌భుత్వం స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. జ‌న‌సైనికులు వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో బాధితుల‌కి మీ వంతు స‌హ‌కారం అందించండి.

•ఓట‌మి ఎవ‌రికీ ఆనందాన్నివ్వదు

ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి వంద రోజులు కూడా కాలేదు. మ‌నం ధైర్యంగా బ‌య‌ట తిరుగుతున్నాం. అలా అని ఓట‌మి ఎవ‌రికీ అనందాన్నివ్వ‌దు. నాకు బాధ క‌లిగించ‌డం లేద‌ని ఎవ‌రూ అనుకోవ‌ద్దు. ఆ బాధ‌ని దాటి అప‌జ‌యాన్ని విజ‌యంగా ఎలా మ‌ల‌చాలన్న ఆలోచ‌న చేస్తున్నాను త‌ప్ప‌, ఇక్క‌డే నిల‌చిపోవాల‌ని అనుకోవ‌డం లేదు. నా మీద మీకున్న ప్రేమ‌తో న‌న్ను బందీని చేసేయ‌వ‌ద్దు. బ‌య‌టికి రాడు అంటున్నారు. రోడ్ల మీద‌కి వ‌స్తే మీరు తిర‌గ‌నిస్తారా?  స‌మ‌స్య‌లు విన‌డానికి వెళ్తే మీద ప‌డిపోతే నేను ఏం చేయ‌లేను. మిగిలిన నాయ‌కుల‌కి అలాంటి స‌మ‌స్య లేదు. ద‌య‌ చేసి అర్థం చేసుకోండి. మీ ప్రేమ‌తో న‌న్ను బందీని చేయ‌వ‌ద్దు. కుదిరిన‌ప్పుడు ఫోటోలు ఇవ్వ‌డానికి నేను సిద్ధంగా ఉన్నాను.

రాజ‌కీయ పార్టీని ఎలా న‌డుపుతావు అంటున్నారు. నాకు వేల కోట్లు అవ‌స‌రం లేదు. పార్టీ భావ‌జాలాన్ని అర్ధం చేసుకున్న కొద్ది మంది వ్య‌క్తుల‌తో పార్టీని న‌డిపించేస్తాను. ప్ర‌తి చోటా ఆఫీస్ పెట్ట‌డానికి మిగిలిన పార్టీల్లా నాకు వేల కోట్లు లేవు. నేను ముఖ్య‌మంత్రి కొడుకును కాబ‌ట్టి ముఖ్య‌మంత్రిని చేయండి, సినిమా న‌టుడ్ని కాబ‌ట్టి ముఖ్య‌మంత్రిని చేయండి అని అడ‌గ‌ను. సినిమాల్లో పెద్ద స్టార్‌డ‌మ్ ఉన్న వ్య‌క్తినేగాని, రాజ‌కీయాల్లో నాకు కొత్త. ఆచితూచి అడుగులు వేయాలి. అట్ట‌డుగు స్థాయి నుంచి ఎద‌గ‌డానికి సిద్ధ‌ప‌డే వ‌చ్చాను. 2014లో పార్టీ స్థాపించిన‌ప్పుడు ఇలాంటి ఆఫీస్ పెట్టే శ‌క్తి లేదు. సినిమాలు చేశాను. స్థ‌లం కొని ఇప్ప‌టికి ఆఫీస్ పెట్టా. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆఫీస్‌లు పెట్టే శ‌క్తి లేదు కానీ, పార్టీని న‌డిపించే ఆర్ధిక స‌త్తా మాత్రం ఉంది. అవ‌స‌రం అయితే టెంట్ వేసుకుని అయినా న‌డుపుతా. పార్టీ న‌డ‌ప‌డానికి కార్యాల‌యాలే అవ‌స‌రం లేదు. గ్రామాల్లో ఉన్న చెట్ల కింద‌, అరుగుల మీద స‌మావేశాలు ఏర్పాటు చేయండి. తెలంగాణ ఉద్య‌మంలో భావ‌జాలాన్ని ఇష్ట‌ప‌డే వ్య‌క్తులంతా ఒక కూర త‌గ్గించుకుని ఆ డ‌బ్బు మొత్తం ఉద్య‌మ నిర్మాణానికి విరాళంగా ఇచ్చేవారు. జ‌న‌ సైనికులు అలా అనుకుంటే జ‌న‌సేన‌కు ఆర్ధిక ఇబ్బందులు ఉండ‌వు. నా ప‌ది రూపాయలు వాడు తినేస్తాడు అనుకుంటే మాత్రం ముందుకు వెళ్ల‌లేం. ప్ర‌తి ఊరిలో బ‌ల‌మైన వ్య‌క్తులు ప‌దుల సంఖ్య‌లో ఉన్నారు. శ్రీకాకుళం లాంటి చోట టిఫిన్ బండ్లు న‌డుపుకునే వ్య‌క్తి రూ. 20 వేలు పార్టీకి ఖ‌ర్చు చేస్తున్నాడంటే, ఒక్కొక్క‌రు రూపాయి తీసినా చాలా అవ‌స‌రాలు తీరుతాయి. అలా అని అదేదో నాకు ఇవ్వ‌మ‌ని అడ‌గ‌డం లేదు. ఆఫీస్‌లు అన్న అంశం పార్టీ నిర్మాణానికి అడ్డంకి కాకూడ‌దు.

•నన్ను విమర్శించే హక్కు వాళ్ళకుందా?

ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద మాట్లాడ‌డానికి ఎవ‌రినైనా క‌ల‌సి న‌మ‌స్కారంపెడితే వారికి అమ్ముడైపోయిన‌ట్లు కాదు. అది సంస్కారం. అలా అనుకుంటే అంద‌రూ అమ్ముడుపోయిన‌ట్టే. న‌న్ను చాలా మంది విమ‌ర్శిస్తూ ఉంటారు. అస‌లు న‌న్ను విమ‌ర్శించే హ‌క్కు వాళ్ల‌కు ఉందా. కోటి రూపాయలు సంపాదించి  కోట రూపాయలు వ‌దులుకునే ప‌నులు ఎవ‌రైనా చేశారా?  నేను వంద‌ల‌సార్లు  చేశాను. రూపాయి సంపాద‌న లేని స‌మ‌యంలో కూడా స్నేహితుల‌కు స‌హాయం చేయ‌డానికి ప‌ది ల‌క్ష‌లు అప్పు చేసి మ‌రీ ఇచ్చిన వాడిని. అది నా నైజం. అలాంటి న‌న్ను కూర్చోబెట్టి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. మీరు న‌న్ను ఏదైనా ప్ర‌శ్నించండి. నా వ్య‌క్తిత్వాన్ని ప్ర‌శ్నిస్తే మాత్రం నాలో మ‌రో వ్య‌క్తిని చూస్తారు. మీకు కెపాసిటీ లేక‌పోతే మూల‌న కూర్చో. అంతే కానీ నా క‌ళ్ల‌లోకి చూసి న‌న్ను ప్ర‌శ్నించాల‌ని చూడ‌కండి. నేను మీ జీవితాల గురించి మాట్లాడితే ముఖం కూడా చూప‌లేరు. డ‌బ్బు ప‌రంగా న‌న్ను ప్ర‌శ్నించాల‌నుకునే వారు ఎవ‌రైనా ఒక‌టి గుర్తుంచుకోండి. నేను కోట్ల సంపాద‌న వ‌దులుకుని వ‌చ్చినవాడిని. ఇర‌వై వేల టాక్స్ క‌ట్ట‌లేని వారు ఉన్న ప‌ళంగా కోట్లు టాక్స్ క‌ట్టిన‌ట్టు నేను దోపిడి చేసి సంపాదించ‌లేదు. సినిమాలు చేసి మీతో తిట్టించుకున్నా, మెప్పు పొందా, డ‌బ్బు సంపాదించా. ఇక్క‌డ స్థలాలు కొంటే వేల కోట్లు వ‌స్తాయని తెలిసి కూడా నేను అలాంటి ప‌నులు చేయ‌లేదు. నా ల‌క్ష్యం వ్యాపారం కాదు. మాన‌వ‌త్వం.

పోరాటంలో ఒక అడుగు ముందుకు వేశాం త‌ప్ప నాకు ఓట‌మి బాధ లేదు. రాజ‌కీయంగా నేను ఎవ‌ర్నీ విమ‌ర్శించ‌ను. స‌త్యాన్ని మాట్లాడుతాను. 2014లో పార్టీ పెట్టిన‌ప్పుడు అంతా మాట్లాడేందుకు భ‌య‌ప‌డే ప‌రిస్థితుల్లో నేను గొంతెత్తాను. జ‌న‌సేన పార్టీ అలా పుట్టిన పార్టీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు. ప్ర‌జ‌ల‌కి అన్యాయం జ‌ర‌గ‌కూడ‌ద‌ని పెట్టాను. ప్ర‌యాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అప‌జ‌యాలు ఉంటాయి. ఒక రోజు విజ‌యం దక్క‌వ‌చ్చు, దక్కకపోవ‌చ్చు. అయినా చివ‌రి శ్వాస వ‌ర‌కు పార్టీని నిల‌బెడ‌తాను. ఓ పార్టీతో అల‌యెన్స్ పెట్టుకోవాలంటే చెప్పి చేస్తాను. నేను పార్టీ పెట్టిన‌ప్పుడు అంచెలంచెలుగా ఎద‌గాలి అనుకున్నా. రాత్రికి రాత్రి ఎద‌గాలి అనుకోలేదు. అధికారం కోసం వెంపర్లాడ‌లేదు. ఎక్క‌డో మారుమూల ప్రాంతాల్లో, ట‌ర్కీ దేశానికి వెళ్లిపోయిన వ్య‌క్తికి నేను అర్థమ‌య్యాను. నిత్యం నా ప‌క్కన  ఉండే వారికి నేను అర్ధం కాలేదు. కొంద‌రు వ్య‌క్తిగ‌త అజెండాల‌తో మాట్లాడుతారు. ఓట‌మి త‌ర్వాత కూడా నేను ధైర్యం కోల్పోలేదు. నెల రోజుల త‌ర్వాత కొంద‌రు చేసిన వ్యాఖ్య‌ల‌కు పార్టీ న‌డ‌ప‌గ‌ల‌నా అనిపించింది. స్వ‌తంత్రం కోసం త్యాగాలు చేసిన వారు ఎంపిలు, ఎమ్మెల్యేలు అయిపోవాల‌ని పోరాటం చేయ‌లేదు. దేశం కోసం చేశారు. అదే స్ఫూర్తితో నేను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. మేనిఫెస్టోలో ఒక‌టి చెప్పి అలా చెప్ప‌లేదు అనే వంక‌ర‌టింక‌ర రాజ‌కీయాలు నేను చేయ‌ను, ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయాల‌నే ప‌ట్టు ప‌డ‌తాను. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా ఆ ప‌ట్టు వీడ‌ను. నేను అధికారం రావాల‌న్న ప‌ట్టు ప‌ట్ట‌ను. ప్ర‌జ‌లు గెల‌వాల‌న్న ప‌ట్టు ప‌డ‌తాను.

•చిరంజీవి గారు చెప్పిన మాటలు నడిపించాయి

నేను చిన్న‌నాటి నుండి చూసిన ప‌రిస్థితులు, న‌మ్మిన విలువ‌లు న‌న్ను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేలా చేశాయి. 2014లో ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టేలా చేశాయి. 2019లో రెండు చోట్ల ఓడిపోయేలా చేసింది. అలా అని నాకేమీ బాధ లేదు. నేను ప‌దే ప‌దే చెప్పిన విష‌యాలు మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్ప‌డానికి కార‌ణం ముందు మీరంతా న‌న్ను అర్ధం చేసుకోవాల‌ని, నేను ఓ సాధార‌ణ జీవితం కోరుకునే వ్య‌క్తిని. వేల కోట్ల సంపాద‌న ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్య‌క్తిని కాదు. సామాన్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవితం నుంచి వ‌చ్చిన వాడిని. మా అన్న‌య్య చిరంజీవి గారు అన్న మాట‌లు న‌న్ను ఇలా న‌డిపించాయి. 22-23 ఏళ్ల వ‌య‌సులోనే యోగ సాధ‌న‌లోకి వెళ్లిపోయా. సినిమాల్లో న‌టించాల‌ని ఉండేది కాదు. ప్ర‌జా క్షేత్రంలో ప‌ది మంది దృష్టిలోకి వెళ్లే వాడిని కాదు. ‘నీకు చిరంజీవి లాంటి అన్న‌య్య ఉన్నాడు. నీకు ఒక‌రికి జీతం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. నీ కుటుంబాన్ని నువ్వు పోషించాల్సిన అవ‌స‌రం లేదు’ అన్న ఆయ‌న మాట‌లు న‌న్ను న‌టుడ్ని చేశాయి. పార్టీని పెట్టేలా చేశాయి. రాజ‌కీయాల్లోకి ఏదో ఆశించి చేయ‌ను. ఎక్క‌డో రాజ‌కీయ మూలాల్లో లోపాలు ఉన్నాయి. వ్య‌క్తిగ‌త లబ్ధి కోసం చేసే రాజ‌కీయాలు స‌మాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఎవ‌రో ఒక‌రు మాట్లాడాలి అనిపించింది. పార్టీ పెట్టిన‌ప్పుడు పెద్ద నాయ‌కులు ఎవ‌రూ లేకున్నా, ఎక్క‌డికి వెళ్లినా నన్ను అభిమానించే వారు ఉన్నారు అన్న ధైర్యంతో పెట్టా. వారిని అడ్డు పెట్టుకుని సంపాదించుకోవాల‌ని ఏనాడు అనుకోలేద‌ని అన్నారు.

• ప్రభుత్వం వెళ్లాల్సింది గ‌డ‌ప ద‌గ్గర‌కు కాదు ప్రజ‌ల మ‌న‌సుల్లోకి - నాదెండ్ల మనోహర్

పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ “రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం, వాటి ప‌రిష్కారానికి, పార్టీ బ‌లోపేతానికి చేయాల్సిన కృషికి సంబంధించి అధ్య‌క్షుల వారు స్వ‌యంగా కార్యాచ‌ర‌ణ ఇచ్చే ల‌క్ష్యంతో  అన్ని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. దీన్ని ఒక గొప్ప అవ‌కాశంగా భావించి ప్ర‌తి ఒక్క‌రు ఈ ప్ర‌యాణంలో భాగ‌స్వాములు కావాలి. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క్షేత్ర స్థాయిలో ప‌ని చేసే తీరు, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పార్టీని ముందుకు తీసుకువెళ్లే విధానం ఆధారంగా గుర్తింపు ఇవ్వాల‌ని ప‌వ‌న్‌ నిర్ణ‌యించారు. రాజ‌కీయాల్లో ఎద‌గాలంటే ఫోటోలు, వాట్స‌ప్‌ల‌కి ప‌రిమితం అయితే కుద‌ర‌దు. అధ్య‌క్షుల వారు ఇచ్చిన కార్యా‌చ‌ర‌ణ తు.చ. త‌ప్ప‌కుండా పాటించి గ్రామ స్థాయి వ‌ర‌కు తీసుకువెళ్ల‌గ‌లిగితేనే రానున్న ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వ‌గ‌లుగుతాం. రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు రావాలంటే అది ఇక్క‌డి నుంచే మొద‌లు కావాలి. విజ‌య‌వాడ నియోజ‌క‌వ‌ర్గం అంటే ఎంతో చైత‌న్యం ఉన్న ప్రాంతం. రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు తీసుకురావాలి అంటే, ఆ మార్పు ఇక్క‌డి నుంచే మొద‌లు కావాలి.

ఈ రోజుల్లో ఒక రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌డం అంటే మామూలు విష‌యం కాదు. మీ ద‌గ్గ‌ర నుంచి త్యాగాలు అవ‌స‌రం. కార్య‌క‌ర్త‌లు నాయ‌కుడు లేడు అని భావిస్తే అది నాయ‌క‌త్వం లోపం కింద‌కే వ‌స్తుంది. నాయ‌కుల‌కి ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోక‌పోతే అధ్య‌క్షుల వారు ఎలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునేందుకైనా వెనుకాడ‌రు. నాయ‌క‌త్వం అంటే ఎలాంటి స‌మ‌స్య‌కైనా ఎదురు నిల‌బ‌డాలి, క‌ష్ట‌ప‌డాలి, స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసి బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డాలి. మీకు పార్టీ అండ‌గా ఉంటుంది. ప్ర‌భుత్వం నుంచి, అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీ మీకు అండ‌గా ఉంటుంద‌ని ఇప్పటికే ప‌వ‌న్‌ చెప్ప‌డం జ‌రిగింది.  రాజోలు వ్య‌వ‌హారంలో చిన్న విష‌యాన్ని పెద్ద‌ది చేసి మ‌న ఎమ్మెల్యేని ఇబ్బందిపెట్టాల‌ని చూసిన‌ప్పుడు, అధ్య‌క్షుల వారు రెండు రోజుల పాటు గంట గంట‌కీ ప‌రిస్థితిని స‌మీక్షిస్తూనే ఉన్నారు. అవ‌స‌రం అయితే రోడ్డు మార్గం ద్వారా రాజోలు వెళ్లి అక్క‌డ ధ‌ర్నాకు దిగాల‌ని నిర్ణ‌యించారు. వాట్స‌ప్‌ల‌లో స్పందిస్తేనే స్పందించిన‌ట్టు కాదు. ఎక్క‌డ ఏం జ‌రిగినా ఆయ‌న దృష్టికి వ‌స్తే, అవ‌స‌రం అయితే మీ ప్రాంతానికి ఓ నాయ‌కుడిని పంపి స‌మీక్ష‌లు జ‌రుపుతారు. వంద రోజుల వ‌ర‌కు ప్ర‌భుత్వ ప‌ని తీరుపై మాట్లాడ‌వ‌ద్ద‌నుకున్నాం. ఈ కొంత స‌మ‌యంలోనే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వం వెళ్లాల్సింది గ‌డ‌ప‌ల ద‌గ్గ‌ర‌కు కాదు.. ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లోకి వెళ్లాలి. ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నించాలి అని అన్నారు.

•పార్టీ నిర్ణయాన్ని కలసికట్టుగా అనుసరించాలి: పి.రామ్మోహన్ రావు
 
పార్టీ పోలిట్‌బ్యూరో స‌భ్యులు పి. రామ్మోహ‌న్‌రావు మాట్లాడుతూ “మ‌నం ముందుగా క‌ల‌సిక‌ట్టుగా పార్టీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా దాన్ని అనుస‌రించాలి. మ‌న‌లో మ‌న‌కే స్ప‌ర్ధలు ఉంటే ఎన్న‌టికీ గెల‌వ‌లేం. మ‌నకి మీడియా స‌పోర్ట్ లేదు. సోష‌ల్ మీడియా బ‌లం ఉంది అనుకుంటే ఆ సోష‌ల్ మీడియానే మ‌న కొంప ముంచింది. మీరు పార్టీ నిర్ణ‌యాన్ని అర్ధం చేసుకోకుండా కేవ‌లం న‌చ్చిన వ్య‌క్తికి టిక్కెట్ ఇవ్వ‌లేదు అని లేనిపోని దుష్ర్ప‌చారం చేసి పార్టీ ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాం.  మ‌న ఓట‌మికి క్షేత్ర స్థాయిలో జ‌న‌సైనికుల‌కి రాజ‌కీయంగా అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే కార‌ణం. బ‌లం లేక‌పోవ‌డం వల్ల కాదు. ఈ అవ‌గాహ‌న స‌ద‌స్సుల ద్వారా రానున్న ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే అవ‌గాహ‌న పెంచుకుందామ‌”ని తెలిపారు. ఈ సమావేశంలో ముత్తంశెట్టి ప్రసాదబాబు, పోతిన మహేశ్, బత్తిన రాము, అక్కల రామ్మోహనరావు పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)