జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ సూచనలు!

Related image

  • జీహెచ్ఎంసీ చట్టం, 1955 లోని సెక్షన్ 63 ప్రకారం ఓట్ల లెక్కింపు  పూర్తిగా రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో జరుగుతుంది .
  • లెక్కింపు జరిగే ప్రదేశం పూర్తిగా రిటర్నింగ్ అధికారి నియంత్రణలో ఉంటుంది.
  • ఇట్టి లెక్కింపు ప్రక్రియను, ప్రతి లెక్కింపు కేంద్రానికి రాష్ట్ర ఎన్నికల సంఘం చేత నియమించబడిన పరిశీలకులు పర్యవేక్షిస్తారు.
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచనల ప్రకారం కమిషనర్ & ఎన్నికల అథారిటీ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 30 లెక్కింపు కేంద్రాల్లో లెక్కింపుకు పూర్తి ఏర్పాట్లు చేయబడినాయి.
  • ప్రతి వార్డుకు 14 లెక్కింపు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది.
  • పోటీ చేయు అభ్యర్ధులు ప్రతి కౌంటింగ్ టేబుల్ కు ఒకరిని చొప్పున కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవచ్చును. 
  • పోటీ చేయు అభ్యర్ధులు మరియు వారి కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ప్రారంభ సమయము కంటే ఒక గంట ముందుగానే కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకోవాలి.
  • అభ్యర్ధులు/వారి ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూము ఉదయం గం.7.45ని.లకు తెరవబడుతుంది. 
  • కౌంటింగ్ హాల్ లోనికి రిటర్నింగ్ అధికారి ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేయబడిన వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
  • ప్రతి కౌంటింగ్ ఏజెంట్ కు ఇవ్వబడిన గుర్తింపు కార్డుపై అతనికి కేటాయించిన కౌంటింగ్ హాలు, కౌంటింగ్ టేబుల్ నంబరు, సర్కిల్ మరియు వార్డు వివరాల ప్రకారం ఆ ఏజెంట్, తనకు కేటాయించిన టేబుల్ కే పరిమితమవ్వాలి. 
  • కౌంటింగు (లెక్కింపు) హాలులోపల ఉన్నట్టి ప్రతి వ్యక్తి, చట్టపరంగా, ఓటింగు రహస్యాన్ని కాపాడి, అందుకు సహకరించవలసిన అవసరం ఉంది. అట్టి రహస్యాన్ని ఉల్లంఘించి, ఎవరు కూడా ఏ సమాచారాన్ని ఇతరులకు అందించకూడదు. ఉల్లంఘించిన వారు 1955, జీహెచ్ఎంసీ చట్టం,1955 లోని సెక్షన్ 602 ప్రకారం శిక్షార్హులు.
  • కౌంటింగ్ హాలులో మొబైల్ ఫోన్ లు అనుమతించబడవు.  
  • కౌంటింగ్ హాల్ లోకి ఇంక్ పెన్నులు, వాటర్ బాటిల్స్ అనుమతించబడవు.
  • తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ల (ఎన్నికల నియమావళి) నిబంధనలు, 2005 లోని నిబంధన 49 ప్రకారం  పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపును ను మొదటగా ప్రారంభిస్తారు.
  • ఓట్ల లెక్కింపు ప్రారంభానికి నిర్ణయించిన సమయం (8A)తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లను లెక్కించరు.
  • ఓట్ల లెక్కింపు రెండు దశలలో జరుగుతుంది. మొదటగా ప్రాథమిక లెక్కింపు. ఇది పోలింగ్ కేంద్రాల వారీగా జరుగుతుంది, తదుపరి తుది/వివరణాత్మక  లెక్కింపు జరుగుతుంది. 
  • ప్రాథమిక లెక్కింపు మధ్యాహ్నం 12 లోపు మరియు వివరణాత్మక లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 3 గంటలలోపు (ఎక్కువ ఓటర్లు ఉన్న వార్డులు మినహా) పూర్తి అయ్యే విధముగా ఏర్పాట్లు చేయబడినవి.
  • మొదటి విడతలో లెక్కింపు పోలింగ్ స్టేషన్ వారీగా జరుగుతుంది. ఇందులో బ్యాలెట్ పేపర్ల  మడతలు విప్పకుండానే 25 ఓట్ల చొప్పున కట్టలుగా చేసి రబ్బర్ బ్యాండు వేసి, బ్యాలెట్ పేపర్ అకౌంట్ తో సరిచూసి కట్టలను రిటర్నింగ్ అధికారి వద్ద గల డ్రమ్ములో జమ చేస్తారు. 
  •  రెండవ విడతలో బ్యాలెట్ బండిళ్ళు ఉన్న డ్రమ్ములోని బండిళ్ళను జాగ్రత్తగా బాగా కలిపి ఆ హాలులో ఉన్న అన్ని కౌంటింగ్ టేబుళ్ళ వద్దకు డ్రమ్ములో నుండి 40 బండిళ్ళను (1000 బ్యాలెట్ పేపర్లను)  వివరణాత్మక లెక్కింపు కోసం ఇస్తారు.
  • లెక్కింపు సహాయకులు ఒక్కొక్క ఓటును "చెల్లుబాటు " మరియు "ఎంపిక" విషయమై లెక్కింపు ఏజెంట్లు మరియు లెక్కింపు సూపర్వైజర్ల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్దులవారీగా కేటాయించబడిన తగు కంపార్టుమెంట్ లలో వేస్తారు.. 
  • సందేహాత్మక బ్యాలెట్ పేపర్లను రిటర్నింగ్ అధికారి స్వయంగా పరిశీలించి  తగిన నిర్ణయము తీసుకుంటారు.  
  • సందేహాత్మక బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారి నిర్ణయమే తుది నిర్ణయం.
  • ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే, రిటర్నింగు అధికారి ఫారం XXXA లోని రిజల్టు షీటులో, ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్ల సంఖ్యని (నోటాకి నమోదైన ఓట్లతో యుక్తంగా), తిరస్కరించబడిన ఓట్ల సంఖ్య ను నమోదు చేసి ప్రకటిస్తారు.
  •   ఫలితాలను ప్రకటించే ముందు ఆ కౌంటింగ్ కేంద్రానికి రాష్ట్ర ఎన్నికల సంఘంచే నియమించిన కౌంటింగ్ పరిశీలకుని అనుమతి తీసుకుని  ప్రకటిస్తారు.  
  • రీ కౌంటింగ్ కు దరఖాస్తు ద్వారా రిటర్నింగు అధికారిని కోరినప్పుడు దరఖాస్తులో పేర్కొన్న కారణాలను పరిగణనలోనికి తీసుకొని, రిటర్నింగ్ అధికారి తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం.
  • ఫలితాల ప్రకటనను ఫారం - XXXI తయారు చేసి, ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ఫారం - XXXII లోని ఎన్నికల రిటర్న్ ను పూర్తి చేసి, ధృవీకరించి ,ఎన్నికైన అభ్యర్ధికి, ఫారం - XXXIII లో ఎన్నికల ధృవపత్రాన్ని అందజేస్తారు. 

టెండర్ ఓటు పడిన పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ గురించి సూచనలు:
  • ఏదైనా పోలింగ్ కేంద్రములో టెండర్ ఓటు నమోదు అయినప్పుడు ఆ పోలింగ్ కేంద్రం యొక్క ప్రిసైడింగ్ అధికారి అట్టి టెండర్ ఓటు నమోదైన బ్యాలెటు పేపరును బ్యాలెట్ బాక్సులో వేయకుండా  మడిచి, దానికి ప్రత్యేకంగా కేటాయించిన కవర్ లో ఉంచి సీలు చేసి, రిసెప్షన్ సెంటరులో రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు.
  • ఈ టెండర్ బ్యాలట్ కలిగిన కవర్ లను ఎన్నికల చట్టబద్ధమైన కవర్ లతో సహా ప్రత్యేకంగా భద్రపరుస్తారు. మరియు అట్టి కవర్లను ఎట్టి పరిస్టితుల్లోను రిటర్నింగ్ అధికారి  తెరవరాదు.
  • కౌంటింగ్ జరుగునప్పుడు ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బ్యాలట్ బాక్సులో ఉన్న బ్యాలట్ పేపర్లను మాత్రమే కౌంటింగ్ కు పరిగణన లోకి తీసుకుని లెక్కిస్తారు.
  • కమిషనర్ & ఎన్నికల అథారిటీ, జీహెచ్ఎంసీ ఇట్టి టెండర్ బ్యాలట్ ఉన్న సీలు చేయబడిన కవర్ లను ఇతర సీల్డ్ కవర్లతో పాటు నిర్దిష్ట కాలపరిమితి అయిన ఒక సంవత్సరం వరకు భద్ర పరచాలి.

More Press Releases