పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్, డేటా సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Related image

  • పాల్గొన్న మంత్రులు మహమ్మూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, డీజీపీ మహేందర్ రెడ్డి
  • సీఎం కేసీఆర్ దూర దృష్టితో చేపట్టిన చర్యలతో కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్: కేటీఆర్
  • ప్రజల రక్షణకు పోలీస్ వ్యవస్థను ఆధునికసిస్తున్న ప్రభుత్వం
  • తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014 లోనే పోలీస్ లకు అత్యాధునిక వాహనాలకై  రూ.280 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
  • మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న ప్రపంచ స్థాయి కమాండ్ కంట్రోల్ సిస్టం
  • కమాండ్ కంట్రోల్ సిస్టం ఏర్పాటుకు రూ. 600 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
  • శాంతి భద్రలతలపై  ఏర్పడిన నమ్మకంతో పారిశ్రామిక, వాణిజ్య సేవా వర్గాలను ఆకట్టుకుంటున్న హైదరాబాద్
  • తెలంగాణ, ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్
రంగారెడ్డి నవంబర్ 11:: పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ముందు చూపుతో తీసుకున్న చర్యల వలన కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు.

పోలీస్ శాఖ ఆధునీకరణలో భాగంగా గచ్చి బౌలిలో నెలకొల్పిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ , డేటా సెంటర్ ను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోమ్ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెక పూడి గాంధీ, ఎమ్మెల్సీ కె.నవీన్ కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె. దామోదర్, డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, ఐ.టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్,  పోలీస్ కమిషనర్లు సజ్జనార్, మహేష్ భగవత్, అంజనీ కుమార్, వివిధ శాఖ అధికారులు, ఐటీ  కంపెనీల సీఈ ఓలు తదితరులు హాజరైయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ భవిష్యత్తుపై అనేక అపోహలు సృష్టించారని, వాటన్నింటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న చొరవ వలన దేశంలో కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్ ఏర్పడిందని అన్నారు.

తాను హైస్కూల్ విద్యను హైదరాబాద్ లోనే అభ్యసించినట్లు తెలిపారు. గతంలో ప్రతి సంవత్సరం కనీసం వారం పాటు కర్ఫ్యూ ఉండేదని గుర్తు చేసారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి 2014లోనే రూ.280 కోట్లతో పోలీస్ శాఖకు అత్యాధునిక అమలు చేసేందుకై  ఆరుగురు పోలీస్ అధికారులతో నియమించిన కమిటీలో ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఉన్నారని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడుటకు, మహిళల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

అందులో భాగంగా పోలీస్ కమిషనరేట్ల సంఖ్యను 9కి పెంచినట్లు తెలిపారు. అలాగే కొత్తగా 100 పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భంలో మహిళా ఉద్యోగుల రక్షణ గురించి చర్చించారు. తక్షణమే స్పందించి  ఆదిబట్లలో ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పట్ల ఏర్పడిన నమ్మకంతో జాతీయ, అంతర్జాతీయ , ఐటీ , పారిశ్రామిక , వాణిజ్య , సేవ సంస్థలు  హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు.

ప్రపంచ స్థాయి పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 600 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో కమాండ్ కంట్రోల్ సిస్టం అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. శాంతిభద్రతలపై నమ్మకం కలిగించుటకు పోలీస్ వ్యవస్థను ఆధునీకరించుటకై చొరవ తీసుకుంటున్న డీజీపీ మహేందర్ రెడ్డి ని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.

పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ , డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రజలకు రక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణ , అభివృద్ధి పనులలో ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు వివిధ శాఖలతో సమన్వయంతో పెరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో ప్రస్తుతం 5 లక్షల పైబడి సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలిపారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం మన హైదరాబాద్ లోనే
ఉన్నట్లు తెలిపారు.

సీసీ కెమెరాల సంఖ్యను 10 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. దొంగతనాలు చేసేందుకు హైదరాబాద్ రావాలంటేనే దొంగలు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఒక వేళ వచ్చి నా , వెంటనే దొరికి పోతున్నారని తెలిపారు. భద్రతకై డయల్ 100 కు ఏ వ్యక్తి  ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తున్నట్లు ప్రజలనుండి ఫీడ్ బ్యాక్ వస్తున్నదని తెలిపారు.

అదేవిధంగా అత్యవసర వైద్యం అందించుటలో  జాప్యాన్ని నివారించుటకు సమీపంలోని ప్రభుత్వ , ప్రయివేట్ ఆసుపత్రులకు అంబులెన్సులు  త్వరగా  వెళ్లేందుకై ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసి ఈ వ్యవస్థకు అనుసంధానం చేయాలనీ సూచించారు. టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీస్ లు ముందున్నారని తెలిపారు. అలాగే పెరుగుతున్న  సైబర్ క్రైమ్ ను అరికట్టుటకు మరింత చొరవ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రజల రక్షణకు ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ , డేటా సెంటర్ ఏర్పాటుతో పోలీస్ శాఖ పని తీరు మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వలన క్రైమ్ రేట్ తగ్గినట్లు తెలిపారు. 28 వేల మంది పోలీస్ కానిస్టేబుళ్లను కొత్తగా నియమించినట్లు తెలిపారు. రూ.700 కోట్లతో పోలీస్ శాఖకు నూతన భవనాలు నిర్మించినట్లు తెలిపారు.

పోలీస్ శాఖ పని తీరుతో తెలంగాణ ప్రతిష్ట, గౌరవం పెరిగినట్లు పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాల్లో అన్ని పండుగలు ప్రశాంతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆధునిక పరిజ్ఞాన్నాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. మహిళల రక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని తెలిపారు. షీటీమ్స్ ను ఇతర రాష్ట్రాలు ఆదర్శనంగా తీసుకుంటున్నట్లు తెలుపారు.

డయల్ 100 కు 5 నిమిషాల్లోపే స్పందన లభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఈ కేంద్రం నిర్వహణకై సాంకేతిక సేవలను అందిస్తున్న ఎల్ అండ్ టీ స్మార్ట్ వరల్డ్ ఐటీ విభాగంతో మంత్రుల సమక్షంలో రాష్ట్ర  ఐటీ, పోలీస్ శాఖలు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.

More Press Releases