హోంమంత్రికి వినతి పత్రం అందజేసిన తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్ ట్రేడ్ యూనియన్

Related image

  • ఆటో డ్రైవర్లపై ప్రైవేటు ఫైనాన్సర్ల దాడులు ఆపాలి
హైదరాబాద్: ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపై హోంశాఖమంత్రికి సోమవారం నాడు తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ట్రేడ్ యూనియన్ నాయకులు సయ్యద్ మునీరుద్దిన్, రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, అమానుల్ల్హ ఖాన్ తదితరులు హోంమంత్రిని కలిసినవారిలో ఉన్నారు.

కోవిడ్-19 నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఛిన్నాభిన్నమై అనేక రకాలుగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు భారీ వర్షాలకు జి.హెచ్.ఎం.సి పరిధిలోని అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందేనన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రైవేట్ ఆటో ఫైనాన్సర్లు ఈఎంఐ కట్టలేదనే నెపంతో నిర్ధాక్షిణంగా నడి రోడ్డు మీద వారి ప్రైవేట్ వ్యక్తులతో డ్రైవర్లపై దాడులు చేసి ఆటోలను బలవంతంగా, చట్ట వ్యతిరేకంగా జప్తు చేస్తూ ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారని వాపోయారు.

ఈ విషయంపై ఆటో యూనియన్ ఇతర ఆటో సంఘాలు ప్రైవేట్ పైనాన్స్ ఆఫీసుల ముందు ధర్నా కూడా చేశామన్నారు. ఆటో డ్రైవర్లు లాక్ డౌన్ సందర్భంగా బకాయిలు ఉన్నటువంటి ఈఎంఐలపై ఎలాంటి చక్రవడ్డీలు వేయొద్దని, కరోనా తగ్గుముఖం పట్టి మార్కెట్ చక్కపడేంత వరకు ఈఎంఐ ల విషయంలో ఆటో డ్రైవర్లను ఒత్తిడి చెయ్యొద్దన్నారు.

ప్రైవేట్ ఫైనాన్సు వారి ఇట్టి చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆటో ఫైనాన్స్ అసోసియేషన్‌ వినతి పత్రం సమర్పించారు. ఈఎంఐ లపై మరో ఎనిమిది నెలలు గడువు కావాలని వారు కోరారు. అప్పుడు ఒప్పుకొని ఆటో యూనియన్ లో హామీ ఇచ్చిన ఫైనాన్స్ అసోసియేషన్ ఇప్పుడు హామీని ఉల్లంగించి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, దాడులు చేస్తున్నారని, ఇలాంటి వారిపై ఎక్కడ సంఘటన జరిగినా పోలీస్ స్టేషన్లో కేస్ పెడితే తీసుకొని ఆటో ఫైనాన్సర్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆటో డ్రైవర్లను కాపాడాలని వారు హోంమంత్రిని కోరారు.

More Press Releases