హైద‌రాబాద్ లోని వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు ప‌ర్య‌టించిన‌ కేంద్ర బృందం

Related image

  • నాగోల్‌, బండ్ల‌గూడ‌, బైరామ‌ల్‌గూడ‌, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, క‌ర్మ‌న్‌ఘాట్‌, స‌రూర్‌న‌గ‌ర్ చెరువు, టోలిచౌకి, న‌దీం కాల‌నీల‌లో ప‌ర్య‌టించిన కేంద్ర బృందం
హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్ 23: నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు ఎల్బీన‌గ‌ర్‌, ఖైర‌తాబాద్ జోన్ల‌లో  కేంద్ర బృందం ప‌ర్య‌టించి, వ‌ర‌ద ముంపు ప్రాంతాలను ప‌రిశీలించి బాదిత కుటుంబాల‌తో వివ‌రాల‌ను సేక‌రించింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నాయకత్వంలో కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం.రఘురామ్, కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ కె కుష్వారా లు నగరంలో ప‌ర్య‌టించారు. జిహెచ్ఎంసి జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ఉపేంద‌ర్‌రెడ్డి, ప్రావిణ్య‌, చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌లు క‌మిటీతో పాటు ప‌ర్య‌టించి ఆయా ప్రాంతాలలో నెల‌కొన్న వ‌ర‌ద ప‌రిస్థితి, ప్ర‌భుత్వ‌ప‌రంగా చేప‌ట్టిన స‌హాయ, పున‌రావాస, పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల గురించి క‌మిటీకి తెలిపారు.

దెబ్బ‌తిన్న రోడ్లు, నాలాలు, చెరువు క‌ట్ట‌లు పున‌రుద్ద‌ర‌ణ‌కు చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి అధికారుల నుండి వివ‌రాలు తీసుకున్న‌ది. కొన్ని ప్రాంతాల్లో నాలాలు ఇంకా ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్నందున, చెరువుల ప‌టిష్ట‌త‌కు, నాలాల విస్త‌ర‌ణ‌కు చేప‌డుతున్న చ‌ర్య‌ల గురించి అధికారులు వివ‌రించారు. నాగోల్‌, బండ్ల‌గూడ‌, బైరామ‌ల్‌గూడ చెరువుల నాలాల నుండి వ‌చ్చే వ‌ర‌ద నీటిని మూసిలో క‌లిపేందుకు శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నాలాల‌ను అభివృద్ది చేయ‌నున్న‌ట్లు నీటి పారుద‌ల‌, జిహెచ్ఎంసి అధికారులు తెలిపారు. అందుకు అనువుగా డిజైన్ల‌ను రూపొందించుట‌కై క‌న్స‌ల్టెన్సీకి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

నాగోల్, బండ్లగూడ చెరువుల నుండి ఓవర్ ఫ్లో అయి నాలాలలోకి వస్తున్న, వరద నీరు, వరద ముంపుతో జరిగిన నష్టం గురించి అధికారులు, స్థానిక ప్రజల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఎల్బీనగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్ నాగోల్ రాజరాజేశ్వరి కాలనీలో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన కేంద్రబృందం.

భారీ వర్షాలు, పైన ఉన్న చెరువుల నుండి వచ్చిన వరదతో నాగోల్ ప్రాంతంలోని పలు కాలనీలు, ఇండ్లు  దాదాపు 6 అడుగుల మేర నీటి ముంపుకు గుర‌య్యాయ‌ని బాధిత కుటుంబాలు కేంద్ర కమిటీకి వివరించాయి. ఈ ప్రాంతానికి మూసి నది ఒక కిలోమీటర్ వున్నదని, వరదతో పాటు పైన వున్న అన్ని చెరువులను అనుసంధానం చేస్తూ, ఓవర్ ఫ్లో అయ్యే నీటిని మూసి నదిలో కలిపేందుకు నాలను ఏర్పాటు చేయనున్నట్లు నీటి పారుదల, జి.హెచ్.ఎం.సి  అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కై మూసీకి కలుపుతూ నాలను విస్తరింపజేసేందుకు అనువైన డిజైన్ల తయారీకి కన్సల్టెన్సీ కి అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.

క‌ర్మ‌న్‌ఘాట్‌ మేఘా ఫంక్షన్ హాల్ సమీపంలో పక్కనుండి వెళ్తున్న మీర్‌పేట‌ నాలాను, బైరామ‌ల్‌గూడ‌ నాలాల నుండి వచ్చిన వరద నీటితో ముంపుకు గురైన కాలనీలను కేంద్రబృందం పరిశీలించింది. మీర్‌పేట బైరామ‌ల్‌గూడ‌ చెరువుల నాలాల ఉదృతితో ఈ ప్రాంతంలోని ఉదయ్ నగర్, మల్రెడ్డి రంగారెడ్డి నగర్, తపోవన్ కాలనీలలో దాదాపు 2 వేల ఇండ్లు ముంపుకు గురైనట్లు అధికారులు వివరించారు. అనంతరం సరూర్ నగర్ చెరువును కేంద్ర బృందం పరిశీలించింది.

కేంద్రబృందం టోలిచౌక్ లోని విరాసత్ నగర్, బాల్ రెడ్డి నగర్, నదీమ్ కాలనీలలో పర్యటించి సాతం చెరువు నీటి ఉధృతితో మునిగిన కాలనీలు, రోడ్లను పరిశీలించింది. ఆయా ప్రాంత ప్రజలతో మాట్లాడింది. 7-11 అడుగుల వరకు మొదటి అంతస్తులు కూడా ముంపుకి గురై తీవ్రంగా నష్ట పోయినట్లు ప్రజలు తెలిపారు.

More Press Releases