వివిధ దశల్లో ఉన్న పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది రోడ్లకు అటవీ అనుమతులపై అరణ్య భవన్ లో పీసీసీఎఫ్ సమీక్ష

Related image

ఆదిలాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 48 రోడ్లకు సంబంధించిన అటవీ అనుమతులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి సత్వర పూర్తి కోసం అటవీ, పంచాయితీ రాజ్ శాఖల ఉన్నతాధికారుల సమన్యయ సమావేశం జరిగింది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్దిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ ఆర్ఎం దోబ్రియల్, రెండు శాఖలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా జిల్లాల్లోని రోడ్ల అనుమతులు ఏ కారణంగా జాప్యం అవుతున్నాయన్న దానిపై ప్రధానంగా చర్చ జరిగింది.

అనుమతుల ప్రక్రియకు సంబంధించి ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేస్తే, అటవీశాఖ తరపున పనులు వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా పీసీసీఎఫ్ హామీ ఇచ్చారు. జాప్యాన్ని నివారించేందుకు ఆన్ లైన్ ప్రక్రియ నమోదు చేసే విధానాన్ని, అందుకోసం అయ్యే సమయాన్ని స్వయంగా అటవీ అధికారులు, పంచాయితీ రాజ్ అధికారులకు వివరించారు.

భారీ వర్షాలు, కరోనా వల్ల ఆలస్యమైన పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలి: పీసీసీఎఫ్ 

ఓ వైపు కరోనా, మరో వైపు భారీ వర్షాల వల్ల ఆలస్యమైన అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు, అటవీ పునరుద్దరణ పనులను వెంటనే వేగవంతం చేయాలని అన్ని జిల్లాల అటవీ అధికారులను పీసీసీఎఫ్ ఆర్ శోభ ఆదేశించారు. అనేక కారణాల వల్ల ఇప్పటికే పనుల్లో జాప్యం జరిగిందని, ఇకముందు అలా జరగకుండా చీఫ్ కన్జర్వేటర్లతో పాటు, జిల్లా స్థాయి అటవీ అధికారులు నిత్యం క్షేత్రస్థాయి పనుల పర్యవేక్షణ చేయాలని సూచించారు.

కంపా నిధుల లభ్యత ఉన్నందున పనుల పరిశీలన, బిల్లుల విడుదలలో కూడా ఆలస్యం చేయవద్దన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా థర్డ్ పార్టీ పరిశీలన నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ప్రతీ అటవీ శాఖ అధికారి, సిబ్బంది కూడా చిత్తశుద్దితో పని చేయాలని తెలిపారు.

వివిధ దశల్లో ఉన్న అర్బన్ పార్కుల అభివృద్దిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, మిగతా ప్రాంతాలను కన్జర్వేషన్ జోన్లుగా తీర్చిదిద్దటం అత్యంత ముఖ్యమైన విషయం అన్నారు. కంపా నిధులతో చేపట్టిన పనులు, వాటి పురోగతిపై పీసీసీఎఫ్ కంపా లోకేష్ జైస్వాల్ జిల్లాల వారీగా సమీక్షించారు. అటవీ పునరుద్దరణలో భాగంగా వర్షాల కారణంగా నేలలో తేమను ఉపయోగించుకుని కలుపు మొక్కల నివారణ చేపట్టాలన్నారు.  

కంపా నిధులతో చేపట్టే పనుల్లో వేగంతో పాటు, నాణ్యతను కూడా తప్పనిసరిగా పాటించాలని, వచ్చే యేడాది నిధుల లభ్యతతో పాటు, కంపా పనుల లక్ష్యం కూడా పెరిగే అవకాశముందన్నారు. హరితహారం, వచ్చే యేడాది కోసం నర్సరీల నిర్వహణపై పీసీసీఎఫ్ ఆర్ఎం దోబ్రియల్ పలు సూచనలు చేశారు. పెద్ద మొక్కల పెంపకానికి వీలుగా తక్షణం నర్సరీల పనులను వేగవంతం చేయాలన్నారు.

సమావేశంలో అదనపు పీసీసీఎఫ్ లు స్వర్గం శ్రీనివాస్, ఎంసీ.పర్గెయిన్, సునీతా భగవత్, అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్లు, అన్ని జిల్లాలకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, అటవీ అధికారులు పాల్గొన్నారు.

More Press Releases