ఈ నెల 14న మరో 26 బస్తీ దవాఖానలు ప్రారంభం: మంత్రి తలసాని

Tue, Aug 11, 2020, 07:06 PM
Related Image ఈ నెల 14 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మరో 26 బస్తీ దవాఖానలను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాదు కలెక్టర్ శ్వేత మహంతి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కు చెందిన జిల్లా వైద్యాధికారులు వెంకట్, స్వరాజ్య లక్ష్మి, ఆంజనేయులు, TSMIDC అధికారి జగదీశ్ లు పాల్గొన్నారు. 26 బస్తీ దవాఖానలను తనతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలి ప్రభుత్వ విప్ ms ప్రభాకర్, మేయర్, డిప్యూటీ మేయర్ లు ప్రారంభిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనేదే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని చెప్పారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాదు జిల్లాలో 95, రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్ జిల్లాలో 40, సంగారెడ్డి జిల్లాలో 3 చొప్పున ఇప్పటికే 170 బస్తీ దవఖానలను ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్తీ దవఖానల ద్వారా ప్రతి రోజు సుమారు 14 వేల మంది వైద్య సేవలు పొందుతున్నారని, నూతనంగా 26 దవాఖానల ప్రారంభంతో అదనంగా మరో 2 వేల మందికి వైద్యసేవలు అందుతాయని చెప్పారు. ఈ బస్తీ దవాఖానలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక అటెండర్ విధులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

వీటికి అదనంగా హైదరాబాదు జిల్లా పరిధిలో 18, మేడ్చల్ జిల్లాలో 6, రంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున మరో 26 నూతన బస్తీ దవాఖానల ప్రారంభంతో వాటి సంఖ్య 196 కు చేరుతుందని వివరించారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక ఆలోచనలతోనే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300 బస్తీ దావఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, ప్రజల అవసరాలను బట్టి రానున్న రోజులలో మరిన్ని బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న బస్తీ దవాఖానలలో విద్యుత్, త్రాగునీరు, చిన్న చిన్న మరమ్మతులు వంటి ఇతర సమస్యలు ఉంటే వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు వైద్యం, విద్య రంగాలతో పాటు, గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు.

వేలాది రూపాయలను ఖర్చు చేసి వైద్య చికిత్స లు పొందలేకపోతున్న పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానలలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను కూడా ఉచితంగానే అందించడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)