దేవాలయ భూములను పరిరక్షిస్తాం.. ఆక్రమిస్తే కఠిన చర్యలు: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Wed, Jul 29, 2020, 04:52 PM
Related Image
  • దేవాదాయ భూముల ప‌రిర‌క్ష‌ణ‌పై మంత్రులు అల్లోల‌, త‌లసాని స‌మీక్ష‌
హైద‌రాబాద్, జూలై 29: దేవాదాయ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. జంట‌న‌గ‌రాల ప‌రిధిలోని దేవాదాయ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైన మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధ‌వారం దేవాదాయ శాఖ అధికారుల‌తో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ‌హించారు.

దేవాదాయ భూముల ప‌రిర‌క్ష‌ణ‌, నిరుప‌యోగంగా ఉన్నఆల‌య భూముల‌ను గుర్తించి, వాటి ద్వారా ఆదాయం పొందే మార్గాల‌పై  ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని దిశానిర్ధేశం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ... దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. నామమాత్రపు ధరకు దేవాదాయ శాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకొని తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్‌ లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

లీజ్‌ నిబంధనలు మార్చి  దేవాదాయ శాఖ‌కు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని అధికారులన్నారు. దశాబ్దాల క్రితం నాటి లీజ్ ల‌తో పాటు అద్దెల విషయంలో కూడా పునఃసమీక్ష చేసుకోవాలని చెప్పారు. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. హైద‌రాబాద్ ప‌రిధిలో రూ. 55 కోట్ల వ్య‌యంతో 13 ప్రాంతాల్లో నిరుప‌యోగంగా ఉన్న దేవాదాయ భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్ లు, క‌ళ్యాణ మండ‌పాల నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ ఈ సంద‌ర్భంగా మంత్రుల‌కు వివ‌రించారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్పెష‌ల్ డ్రైవ్ ద్వారా ‌1300 ఎక‌రాల ఆల‌య భూముల‌ను గుర్తించి వెనక్కి తీసుకున్నామ‌ని, 21 వేల ఎక‌రాల ఆల‌య భూముల‌కు ర‌క్ష‌ణ స‌రిహ‌ద్దు బోర్డులు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. దీర్ఘ కాలంగా కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న‌దేవాదాయ శాఖ  భూములపైన ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అవ‌సర‌మైతే  లీగ‌ల్ ఆఫీస‌ర్ల‌ను కూడా నియ‌మించాల‌ని చెప్పారు. పోలీసు శాఖ స‌మ‌న్వ‌యంతో స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, భూ ఆక్ర‌మ‌దారుల‌ను ఖాళీ చేయించాల‌న్నారు.

ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, దేవాదాయ శాఖ & విజిలెన్స్ జాయింట్ సెక్ర‌ట‌రీ శేఖ‌ర్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస రావు, రీజిన‌ల్ జాయింట్  క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి, హైద‌రాబాద్, సికింద్ర‌బాద్ స‌హాయ‌క క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)