రూ.250 కోట్ల వ్యయంతో మెగా డైరీ నిర్మిస్తాం: మంత్రి తలసాని

Thu, Jul 09, 2020, 07:08 PM
Related Image రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి లో 250 కోట్ల రూపాయల వ్యయంతో మెగా డైరీ నిర్మించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ శ్రావణ మాసంలో మెగా డైరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ సమీక్ష సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, TSLDA CEO మంజువాణి, అడిషనల్ డైరెక్టర్ రామచందర్, డైరీ MD శ్రీనివాస్ రావు, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు. 18.50 కోట్ల తో అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిపల్లి లో 55 ఎకరాల విస్తీర్ణంలో నూతన పశుపరిశోధన కేంద్రం, కృత్రిమ గర్భధారణ పై రైతులకు ఆధునిక పద్దతులలో అవగాహన కల్పించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, దానికి కూడా శ్రావణ మాసంలో నే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం గొర్రెలు, పశుసంపద అభివృద్ధి కి తోడ్పడుతుందని తెలిపారు. పశువుల గర్భధారణ పరీక్షల లో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో, కృత్రిమ గర్భధారణ లో 3 వ స్థానంలో నిలిచామని అన్నారు.

కులవృత్తులకు చేయూత ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పం అని అన్నారు. గడచిన 70 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం ఈ రంగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి  ప్రత్యేక చొరవ, ఆదేశాలతో గొర్రెల పెంపకం దారులు, పాడి రైతులు, మత్స్య కారుల అభివృద్ధి కోసం వందల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఆయా రంగాలపై ఆధారపడి న వారు సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రశంసించిందని, కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ఇతర రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రస్తావిస్తున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా  80 కోట్ల గొర్రెలను పంపిణీ చేయగా, అవి ఇప్పుడు పిల్లలతో కలుపుకొని 2 కోట్లకు చేరాయని చెప్పారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం దేశంలోనే గొప్ప పథకంగా నిలిచిందని అన్నారు. ఇప్పటికే 50 శాతం మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని, మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు. జీవాలకు దాణా, మరణించిన జీవాలకు ఇన్సూరెన్స్ వర్తింప చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన మాంసాన్ని వినియోగదారుల కు అందించాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలలో మాంసం దుకాణాలు ఏర్పాటు చేయాలని, మొబైల్ దుకాణాల ద్వారా మాంసం అందించాలని నిర్ణయించినట్లు, ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు తెలిపారు.

విజయ డైరీ ఉత్పత్తులకు ప్రజలలో ఎంతో ఆదరణ ఉందని, వాటిని  ప్రజలకు మరింత చేరువ చేసేలా నూతన ఔట్ లెట్ ల ఏర్పాటు, మొబైల్ ఔట్ లెట్ ల ద్వారా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తాము తీసుకున్న ముందస్తు చర్యల కారణంగానే  కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల్లో కూడా పాలు, పెరుగు కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడగలిగామని తెలిపారు. అన్ని వసతులతో కూడిన  షీప్స్ మార్కెట్ ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఇప్పటికే నల్లగొండ, సిద్దిపేట జిల్లాలో మార్కెట్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఖమ్మం, వనపర్తి లలో ఒక్కో చోట 5 ఎకరాల విస్తీర్ణంలో షీప్స్ మార్కెట్ ల నిర్మాణానికి స్థలాన్ని సేకరించడం జరిగిందని, వాటి నిర్మాణానికి గాను1 ఒక్కో దానికి షీప్స్ మార్కెట్ ల నిర్మాణానికి 25 లక్షల రూపాయల చొప్పున నిధులు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మత్స్యకారులను లక్షాది కారులను చేయాలనే లక్ష్యంతోనే ఉచితంగా చేప పిల్లలు, సబ్సిడీపై వాహనాలు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు.

చేప పిల్లల కొనుగోలు, పంపిణీ లో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని అన్నారు.ఈ సంవత్సరం 24 వేల వివిధ నీటి వనరులలో 80 కోట్ల చేప పిల్లలు విడుదలకు నిర్ణయించామని, టెండర్ ప్రక్రియలో ఉందన్నారు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు విడుదల చేసిన కారణంగా రాష్ట్రంలో మత్స్య సంపద ఎంతో వృద్ధి చెందిందని తెలిపారు. వినియోగదారుల కు పరిశుభ్రమైన చేపలను అందించే ఉద్దేశ్యం తో ghmc పరిధిలో 150 మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆక్వా హబ్ ఏర్పాటులో భాగంగా మిడ్ మానేరు డ్యాం నుండి 10 కిలోమీటర్ల పరిధిలో 62 గ్రామాలలో సర్వే జరిపినట్లు చెప్పారు. ఈ సర్వే లో 3962 మంది మత్స్యకారులు, 259 మంది భూ నిర్వాసితులను గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 2680 మంది మత్స్యకారులు,  42 మంది భూ నిర్వాసితులకు చేపలు పట్టుకోవడానికి లైసెన్స్ లు ఇచ్చినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సహకారం తోనే అనేక కార్యక్రమాలను విజయవంతం గా అమలు చేయగలుగుతున్నట్లు పేర్కొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)