జీవో 3ని కొనసాగించే విధంగా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించాలి: మంత్రి సత్యవతి రాథోడ్

Tue, Jul 07, 2020, 03:50 PM
Related Image
  • జీవో 3పై రివ్యూ పిటిషన్ దాఖలు పూర్తి
  • సుప్రీం కోర్టు ప్రారంభం కాగానే పిటిషన్ దాఖలు
  • గిరిజనుల ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • గిరిజనుల రిజర్వేషన్లపై కూడా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాము
  • కేంద్రమే నిర్ణయం తీసుకోకుండా గిరిజనుల ప్రయోజనాలను దెబ్బ తీస్తోంది
  • రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ ఎస్టీల రిజర్వేషన్ల పెంపుపై ఒత్తిడి తేవాలి
(మహబూబాబాద్, జూలై 07): తెలంగాణ రాష్ట్రంలోని ఏజన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు మేలు జరిగేలా ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో వందశాతం రిజర్వేషన్లు వారికే కల్పించాలనే జీవో 3ని కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో సోమవారం (06.07.2020) నాడు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత సుప్రీం కోర్టు ప్రారంభం అయిన మొదటి రోజునే ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంపై గిరిజనుల హక్కులు, ప్రయోజనాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి, అంకితభావానికి నిదర్శనమని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులను వంద శాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన జీవో 3ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కరోనా లాక్ డౌన్ సమయంలో కొట్టివేయడం తెలిసిందే.

ఈ జీవోను కొట్టివేసిన వెంటనే లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ సుప్రీం కోర్టు నుంచి ఈ తీర్పు కాపీలు తెప్పించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర సీనియర్ న్యాయవాదులు, అధికారులు, నిపుణులను సంప్రదించి సమగ్ర సమాచారంతో సుప్రీం కోర్టులో తెలంగాణ అడ్వకేట్ ఆన్ రికార్డు సలహా మేరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేశామన్నారు.

ఈ జీవో 3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా నిరంతరం సమన్వయం చేసుకుంటూ గిరిజనులకు కచ్చితంగా న్యాయం చేయాలనే లక్ష్యంతో సమగ్ర సమాచారంతో ఈ రివ్యూ పిటిషన్ సిఎం కేసీఆర్ సూచనల మేరకు రూపొందించడం జరిగిందన్నారు.

గత 20 ఏళ్లుగా ఈ జీవో అమలు వల్ల కూడా గిరిజనులలో అనుకున్న అభివృద్ధి జరగలేదని, అలాంటిది ఇక జీవోని కొట్టివేస్తే వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, వారికి న్యాయం జరిగేలా ఈ జీవోను పునరుద్ధరించాలంటూ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

అయితే ఇవేవి తెలుసుకోకుండా బీజేపీ రాష్ట్ర నేతలు ఈ ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ జీవో 3ని పునరుద్ధరించేందుకు చేసిన ప్రయత్నాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేయకపోతే ఇప్పటికైనా కేంద్రాన్ని ఈ జీవో 3ని పునరుద్దరించే విధంగా ఒప్పించాలన్నారు.  

ప్రతిపక్షం కదా అని విమర్శలు చేయడం మానుకుని, గిరిజనుల ప్రయోజనాల కోసం బీజేపీ రాష్ట్ర నేతలు కృషి చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీల జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు పెంచడం కోసం చెల్లప్ప కమిషన్ వేసి, గిరిజనుల జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా నాన్చుతోందన్నారు. ఫలితంగా ఎస్టీలు విద్య, ఉద్యోగ రంగాల్లో నష్ట పోతున్నారన్నారు.

బీజేపీ నేతలకు రాష్ట్ర గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆమోదింప చేసి, రిజర్వేషన్లను 10శాతానికి పెంచే విధంగా, జీవో 3 పునరుద్ధరించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి, గిరిజనుల హక్కులను, ప్రయోజనాలను కాపాడాలన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)