మొక్కల పెంపకం బాధ్యతగా భావించాలి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Tue, Jul 07, 2020, 03:33 PM
Related Image
  • చెట్లు విరివిగా ఉంటేనే విస్తారంగా వర్షాలు
మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి, సంరక్షించాలని తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం బెల్లంప‌ల్లి ఫారెస్ట్ డివిజ‌న్ క్రిష్ణ‌ప‌ల్లి రేంజ్ లో హ‌రిత‌హారంలో భాగంగా 25 ఎకారాల స్థ‌లంలో ఒకే రోజు 11,110  మొక్కలు నాటే కార్య‌క్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించి, మొక్క‌లు నాటారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవడానికి దోహద పడుతుందన్నారు. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా మొక్క‌లు పెంప‌కానికి ప్ర‌భుత్వం అధిక ప్రాధా‌న్య‌త‌నిస్తుంద‌ని తెలిపారు. ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉండాలంటే ఆ ప్రాంతం మొత్తం భూభాగంలో 33 శాతం అడవులు ఉండాల‌ని, అందుకే సీఎం కేసీఆర్ 24% ఉన్న అట‌వీ ప్రాంతాన్ని 33% పెంచాల‌నే సంక‌ల్పంతో  అడ‌వుల పున‌రుజ్జీవ‌నం, ప‌చ్చ‌ద‌నానికి పెద్ద‌పీట వేస్తున్నార‌ని వెల్ల‌డించారు.

పరిసరాలు పచ్చదనంతో ఉండి చెట్లు విరివిగా ఉంటేనే వర్షాలు విస్తారంగా పడతాయని తెలిపారు. చెట్లు ఉన్న చోటనే వర్షాలు బాగా పడుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నాటిన మొక్క‌ల్లో 85% మొక్క‌ల‌ను బ‌తికించుకునేలా స‌ర్పంచ్ లు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అనంత‌రం బెల్లంప‌ల్లి ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్ లో హ‌రిత‌హారం కార్యక్ర‌మంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు.

ఈ కార్యక్ర‌మంలో ఎమ్యెల్యే దుర్గం చిన్న‌య్య‌, ఎమ్మెల్సీ పురాణం స‌తీష్, క‌లెక్ట‌ర్ భారతీ హోళికేరి, డీఎఫ్ వో లావ‌ణ్య‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.
రైతు వేదికల‌ నిర్మాణానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి భూమిపూజ:

రైతులు సంఘటితంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ తెలిపారు. బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో తాళ్ళ గురిజాల, క‌న్నాల గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి అల్లోల భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రైతులు ఒక చోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలను నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పమ‌న్నారు.

ఎరువులు, మందులు, విత్తనాల ఎంపిక, మార్కెటింగ్‌.. ఇలా అనేక  విష‌యాల్లో రైతులకు ఈ వేదికలు మార్గదర్శకంగా నిలుస్తాయ‌ని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ సేవలను మరింత చేరువ చేసేందుకు 5 వేల ఎకరాలకు కలిపి ఒక క్లస్టర్‌ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2,604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు.

ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)ని నియమించిందని చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి రైతులు లాభసాటిగా ఉండే పంటలు వేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్ర‌మంలో ఎమ్యెల్యే దుర్గం చిన్న‌య్య‌, ఎమ్మెల్సీ పురాణం స‌తీష్, క‌లెక్ట‌ర్ భారతీ హోళికేరి, త‌దిత‌రులు పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)