ఆర్ధిక వ్యవస్థని బలోపేతం చేసే కార్యక్రమాలని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు: మంత్రి హరీశ్ రావు

Sat, Jul 04, 2020, 05:57 PM
Related Image వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థని బలోపేతం చేసే కార్యక్రమాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి. హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం సంగుపేటలోని బాలికల వ్యవసాయ పాలీటెక్నీక్ కళాశాలలో నూతన వసతి గృహాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలని లాభసాటి గా మార్చేందుకు వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నామని వివరించారు.

రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమాలతో పాటు ఉచిత విద్యుత్, గోడౌన్ ల నిర్మాణం, పంటల్ని మద్దతు ధరలకు కొనుగోలు చేయటం వంటి కార్యక్రమాలని చేపట్టామని వివరించారు. వ్యవసాయం, ఉద్యాన పంటలతో పాటు పాడి, మత్స్య పరిశ్రమలని, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించటంతో గ్రామాల్లో రైతులకు చేతి నిండా పని దొరుకుతుందన్నారు. కరోనాతో అన్ని రంగాలు కుదేలు అయినప్పటికీ రైతులకి వ్యవసాయ రంగంలో చేతి నిండా పని ఉండి అధిక దిగుబడులు సాధిస్తున్నారని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించి ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేసే స్థాయికి మన రైతులు చేరుకోవడం గర్వకారణం అని హరీష్ రావు అన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన తెలంగాణ సోనా వరి రకం మధుమేహ వ్యాధి గ్రస్తులకి ఎంతో ఉపయోగం అని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అటవీ కళాశాల, ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం.. జిల్లాలో ఈ రంగాల  అభివృద్ధికి ఎంతో దోహదపడతాయన్నారు. వ్యవసాయ పాలీటెక్నీక్ అభివృద్ధికి తన వంతు సహకారం ఇస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్, సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, లోక్ సభ సభ్యులు బీబీ పాటిల్, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్, కలెక్టర్ హనుమంతరావు లతో కలిసి హరీష్ రావు నూతన భవనాన్ని ప్రారంభించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)