‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా

Wed, Jul 01, 2020, 08:41 PM
Related Image కొన్ని రకాల సోషల్ మీడియా పోస్టింగులతో మీరు ధైర్యం కోల్పోవద్దని, మీ డాక్టర్లకు, సిబ్బందికి తోడుగా ఉన్నామని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ వైద్యులకు భరోసానిచ్చారు. ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా గవర్నర్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా రాజ్ భవన్ నుండి ప్రముఖ వైద్యులతో, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్ లతో చర్చించారు. ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో డాక్టర్లు తమ ఆరోగ్యాన్ని, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి రోగులను కాపాడటంలో గొప్ప సేవలు చేస్తున్నారని గవర్నర్ అన్నారు. వారు చూపిస్తున్న అసమాన సేవలకు, త్యాగాలకు - డాక్టర్లకు, మెడికల్ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానని డా. తమిళిసై అన్నారు. ఒక డాక్టరుగా తాను వైద్యులతో, సిబ్బందితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నానని, ఈ సంక్షోభ సమయంలో వారు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి, సహకరించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. కోవిడ్ తో ప్రజలు ఆందోళనకు గురికావద్దని, తగు నివారణా చర్యలతో కరోనా వ్యాప్తిని మనందరం అడ్డుకోగలమని ఆమె వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ పరిస్ధితిని సరైన రీతిలోనే ఎదుర్కొంటున్నాయని, కావల్సిన మందులు, పి.పి.ఇ. కిట్లు, మాస్కులు, వసతులు సరిపడా ఉన్నాయని ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆనేక ఇతర దేశాల కంటే మన దేశం ఎంతో ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ కోవిడ్ పరిస్ధితిని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించటం, భౌతిక దూరాన్ని పాటించటం, గుంపులుగా గుమికూడకపోవటం, పోషక ఆహారాన్ని తీసుకోవటం, యోగా, ఇతర ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని గవర్నర్ తెలిపారు. ప్రజలలో అవగాహన, చైతన్యం, వారి భాగస్వామ్యం ద్వారానే కరోనాకి అడ్డకట్ట వేయగలమని డా. తమిళిసై అన్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా భారతరత్న డా. బి.సి. రాయ్ చిత్రపటానికి గవర్నర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు, సూపరింటెండెంట్ లు మాట్లాడుతూ తాము తమ జీవితాలను, తమ కుటుంబ సభ్యుల జీవితాలను ఫణంగా పెట్టి విదులు నిర్వహిస్తుంటే కొంతమంది కావాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం ఆవేదన కల్గిస్తుందని గవర్నర్ కు విన్నవించారు. గవర్నర్ గారి మాటలు తమలో ధైర్యం నిపాయని, స్పూర్తిని కలిగించాయని, గవర్నరుగారి నీమ్స్ హాస్పిటల్ సందర్శన తమలో భరోసా కలిగించాయని గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మ అవార్డు గ్రహీతలైన డాక్టర్లు ఎ. సాయిబాబా గౌడ్, ఎల్. నరేంద్రనాద్, అనగాని మంజుల, దాసరి ప్రసాదరావు, సి. వెంకట యస్ రామ్, రఘురామ్ పిల్లారిశెట్టి, ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే, మహ్మద్ అబ్దుల్ వహీద్ లతో పాటు, సూపరింటెండెంట్ డాక్టర్లు రాజారావ్ (గాంధీ ఆసుపత్రి), నాగేంధర్ (ఉస్మానియా జనరల్ ఆసుపత్రి), శంకర్ (ఫీవర్ ఆసుపత్రి), మహ్మద్ మెహబూబ్ (చెస్ట్ ఆసుపత్రి), కె.కె. పాల్ (ఇ.యస్.ఐ. ఆసుపత్రి), మనోహర్ (నిమ్స్ ఆసుపత్రి డైరక్టర్), రాజలింగం (సరోజినీ దేవి కంటి ఆసుపత్రి), భవాని (నేచర్ క్యూర్ ఆసుపత్రి), శ్రీనివాసరావ్ (యం.జి.యం. ఆసుపత్రి), బలరామ్ నాయక్ (రిమ్స్, అదిలాబాద్), వకుల (పభుత్వ ఆసుపత్రి, మహబూబ్ నగర్), నాగేశ్వరరావు (పభుత్వ ఆసుపత్రి, నిజామాబాద్), విజయేంధర్ రెడ్డి (ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు) తదితరులు గవర్నర్ తో రెండు గంటలపాటు చర్చించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)