ap7am logo

విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు పెంచండి: తెలంగాణ గవర్నర్

Mon, Jun 22, 2020, 08:48 PM
Related Image హైదరాబాద్: విశ్వవిద్యాలయాలలో పరిశోధనా సంస్కృతిని పెంపోందించాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విశ్వవిద్యాలయాలలో బోధనతోపాటు సమాజహితమైన పరిశోధనలు పెద్ద ఎత్తున జరగాలని దీనిలో విద్యార్ధులను కూడా బాగస్వామ్యం చేయాలని సూచించారు. గవర్నర్ ఈరోజు పాలమూరు విశ్వవిద్యాలయం, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయ అధికారులతో వేరువేరుగా వీడియో కాన్పిరెన్స్ ల ద్వారా సమీక్షలు నిర్వహించారు.

జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, సంబంధిత సమాచారాన్ని నిర్వహించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కోవిడ్ అనంతర పరిస్థితులలో విద్యార్థుల ప్రయోజనాల కోసం భారీగా ఆన్‌లైన్ వనరులను సృష్టించాల్సిన అవసరం ఉందని, మారుమూల గ్రామీణప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేలా లైబ్రరీ వనరులను డిజిటలైజ్ చేయాలని గవర్నర్ సూచించారు.  

అలాగే, "అన్ని ఆన్‌లైన్ తరగతులకు సంబంధించిన వీడియో పాఠాలు, ఉపన్యాసాలు విశ్వవిద్యాలయం యొక్క డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది" అని ఆమె తెలిపారు. విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థుల సంఘాల పనితీరును ప్రస్తావిస్తూ, పేరు కోసమే పూర్వ విద్యార్థుల సంఘాలుగా మిగలకుండా, పూర్వ విద్యార్ధులు వారివారి విశ్వవిద్యాలయాల అభివృద్ధి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్ధుల సంఘాలను బలోపేతం చేసి సమన్వయం చేయాలని గవర్నర్ ఆదేశించారు.

"విశ్వవిద్యాలయాలు ఉద్యోగ-ఆధారిత కోర్సుల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెట్టాలి, కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులకు మెరుగైన ఉపాది కల్పించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు నైపుణ్య-ఆధారిత శిక్షణలు వారి ఉపాధి అవకాశాలకు ఎంతో దోహదపడతాయని" అని గవర్నర్ అన్నారు. విశ్వవిద్యాలయాలు పనితీరు మెరుగుపరచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించాల్సిన ఆవశ్యకత ఉందని గవర్నర్ వివరించారు.

"మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను అత్యుత్తమ సంస్థలుగా మార్చడానికి మనమందరం సంకల్పించాలి. నాణ్యమైన ఉన్నత విద్యలో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా మార్చాలన్నది నా బలమైన కోరిక" అని గవర్నర్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు యుజి, పిజి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాదించి మెరుగైన ఫలితాలను పొందాలని అదికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశాలలో గవర్నర్ సెక్రటరీ కె. సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీశంకర్, సి.ఎన్. రఘుప్రసాద్, అనుసందాన అధికారి సి.హెచ్. సీతారాములు, డా. కె. రాజారాం పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)