ap7am logo

ఈ నెల 25 నుండి ఆగ‌ష్టు 15 వ‌ర‌కు ఆర‌వ విడ‌త తెలంగాణ‌కు హ‌రిత‌హారం: మంత్రి కె.తార‌క‌రామారావు

Mon, Jun 22, 2020, 06:07 PM
Related Image
  • జిహెచ్‌ఎంసిలో హ‌రిత‌హారం అమ‌లుపై కార్పొరేట‌ర్లు, అధికారుల‌తో మంత్రి కె.టి.ఆర్ స‌మావేశం
  • హ‌రిత‌హారం అమ‌లుకు కార్పొరేట‌ర్ల‌ ఆధ్వ‌ర్యంలో డివిజ‌న్ గ్రీన్ ప్ర‌ణాళిక‌
  • జిహెచ్‌ఎంసి ప‌రిధిలో 2.50 కోట్ల మొక్క‌లు నాటాల‌ని ల‌క్ష్యం
  • న‌గ‌రంలో 700 ట్రీ పార్కులు - 75 చోట్ల‌ యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్‌
  • ఉస్మానియా, సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ, ఎన్‌.జి.ఆర్‌.ఐల‌తో పాటు ఎక్కువ స్థ‌లాలు ఉన్న సంస్థ‌ల్లో యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్‌
  • ఆగ‌ష్టు 15 వ‌ర‌కు 3 వేల ప‌బ్లిక్ టాయిలెట్ల నిర్మాణం
  • హాజ‌రైన మంత్రి మ‌ల్లారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, మూసి రివ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ సుధీర్‌రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
హైద‌రాబాద్‌, జూన్ 22: ఈ నెల 25 నుండి ఆగ‌ష్టు 15 వ‌ర‌కు ఆర‌వ విడ‌త తెలంగాణ‌కు హ‌రిత‌హారాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని 25న‌ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ప్రారంభిస్తార‌ని తెలిపారు. ఈ సంవ‌త్స‌రం జిహెచ్‌ఎంసి ప‌రిధిలో 2కోట్ల 50 ల‌క్ష‌ల మొక్క‌లు నాటాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించిన‌ట్లు తెలిపారు. హ‌రిత‌హారంలో భాగంగా ఈ సంవ‌త్స‌రం జిహెచ్‌ఎంసి ప‌రిధిలో 700 ట్రీ పార్కుల‌తో పాటు 75 చోట్ల‌ యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్ ను చేప‌ట్ట‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఉస్మానియా, సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ, ఎన్‌.జి.ఆర్‌.ఐల‌తో పాటు ఎక్కువ స్థ‌లాలు ఉన్న సంస్థ‌లు, ఖాళీ స్థ‌లాలు ఉన్న దేవాదాయ శాఖ భూముల‌లో *యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్* కింద విరివిగా మొక్క‌లు నాటాల‌ని తెలిపారు.

అందుకు అనుగుణంగా కార్పొరేట‌ర్ల ఆధ్వ‌ర్యంలో డివిజ‌న్ గ్రీన్ ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. సోమ‌వారం జిహెచ్‌ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో న‌గ‌రంలో హ‌రిత‌హారం అమ‌లుపై కార్పొరేట‌ర్లు, జోన‌ల్, డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌తో రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్ మ‌ల్లారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, మూసి రివ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ సుధీర్‌రెడ్డి ఎంపి రంజిత్ రెడ్డి, శాస‌న మండ‌లి స‌భ్యులు ఎం.ఎస్‌.ప్ర‌భాక‌ర్‌, షంబీపూర్ రాజు, శాస‌న స‌భ్యులు కాలేరు వెంక‌టేష్‌, ముఠా గోపాల్‌, దానం నాగేంద‌ర్‌, బేతి సుభాష్ రెడ్డి, కె.పి.వివేకానంద‌, సాయ‌న్న‌, జిహెచ్‌ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ శ్వేత మ‌హంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు మాట్లాడుతూ తెలంగాణ‌ను హ‌రిత రాష్ట్రంగా మార్చేందుకు 230 కోట్ల మొక్క‌ల‌ను నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకొని, తెలంగాణకు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు రూపొందించిన‌ట్లు పేర్కొన్నారు. మాన‌వ ఇతిహాసంలో ఇంత పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే ప్ర‌య‌త్నం ఇదే మొద‌టిద‌ని తెలిపారు. దేశంలో మొక్క‌లు నాటేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన ఘ‌న‌త తెలంగాణ ప్ర‌భుత్వానికే చెందుతుంద‌ని తెలిపారు. వ‌చ్చే త‌రానికి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని అందించ‌డ‌మే ముఖ్య‌మంత్రి ఆకాంక్ష అని తెలిపారు. ప్ర‌జ‌ల కార్య‌క్ర‌మంగా హ‌రిత‌హారాన్ని అమ‌లు చేసేందుకు కార్పొరేట‌ర్లు చురుకైన పాత్ర పోషించాల‌ని సూచించారు.

ప్ర‌జ‌ల్లో ఆరోగ్యం ప‌ట్ల రోజురోజుకు శ్ర‌ద్ద పెరుగుతున్న‌ద‌ని కార్పొరేట్లు ప్ర‌తి ఇంటికి తిరిగి హ‌రిత‌హారం ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచి భాగ‌స్వాముల‌ను చేయాల‌ని కోరారు. ప్ర‌తి డివిజన్ ప‌రిధిలో ఉన్న కాల‌నీలు, ప్ర‌భుత్వ ఖాళీ స్థ‌లాలు, పార్కులు, లేఅవుట్ ఖాళీ స్థ‌లాలు, చెరువులు, కుంట‌లు, నాలాల‌పై మొక్క‌లు నాటేందుకు ఈ నెల 30 లోపు గ్రీన్‌ యాక్ష‌న్ ప్లాన్‌ను రూపొందించుకోవాల‌ని కార్పొరేట‌ర్ల‌కు స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, శ్మ‌శాన‌వాటిక‌లు, దేవాల‌యాలు, వ‌క్ఫ్ ఆస్తులు, చ‌ర్చీల‌లో ఉన్న‌ ఖాళీ ప్ర‌దేశాల‌ను గుర్తించి సంబంధిత అధికారులు, నిర్వాహ‌కుల‌తో చ‌ర్చించి మొక్క‌ల‌ను నాటించాల‌ని తెలిపారు. హ‌రిత‌హారంలో కాల‌నీల అసోసియేష‌న్లు, రెసిడెన్షియ‌ల్ సంక్షేమ సంఘాల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని తెలిపారు. కాలుష్య నివార‌ణ‌కు మొక్క‌ల పెంప‌క‌మే ఏకైక మార్గ‌మ‌ని తెలిపారు.

ప్ర‌తి ఇంట్లో నీడ‌ను ఇచ్చే, అలంక‌ర‌ణ మొక్క‌లు ఉండాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని తెలిపారు. త‌ద‌నుగుణంగా ప్ర‌జ‌లు కోరుకునే ర‌కాల మొక్క‌లు, పూలు, అలంక‌ర‌ణ మొక్క‌ల‌ను ఇంటింటికి తిరిగి స్వ‌యంగా అంద‌జేయాల‌ని కార్పొరేట‌ర్ల‌కు సూచించారు. త‌ద్వారా హ‌రిత‌హారంలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం పెంపొందుతుంద‌ని అన్నారు. హ‌రిత‌హారం మానిట‌రింగ్ కు కాల‌నీవాసుల‌తో వాట్స‌ప్ గ్రూప్‌ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని కార్పొరేట‌ర్ల‌కు సూచించారు. హ‌రిత‌హారం మొక్క‌ల సంర‌క్ష‌ణ‌కు ట్రీగార్డ్‌ల‌ను స్వ‌యంగా ఏర్పాటు చేయాల‌ని కార్పొరేట‌ర్ల‌ను కోరారు. అదేవిధంగా దాత‌ల నుండి ట్రీగార్డ్‌ల‌ను విరాళంగా సేక‌రించాల‌ని అధికారుల‌కు సూచించారు. అంద‌రికి మొక్క‌ల‌ను అందుబాటులో ఉంచేందుకు ప్ర‌తి డివిజ‌న్‌కు 2 చొప్పున 300 న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

న‌గ‌రం చుట్టుప‌క్క‌ల ఉన్న న‌ర్స‌రీల‌ను సంద‌ర్శించాల‌ని కార్పొరేట‌ర్లు, అధికారుల‌కు సూచించారు. న‌గ‌రంలో పెద్ద ఎత్తున మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఆగ‌ష్టు 15 నాటికి 3వేల ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను నిర్మించాల‌ని అధికారుల‌ను మంత్రి కె.టి.ఆర్‌ ఆదేశించారు.

రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ మాట్లాడుతూ హ‌రిత‌హారం అమ‌లుకు కాల‌నీవాసులు, రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్ల‌తో చ‌ర్చించి స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని కార్పొరేట‌ర్ల‌కు సూచించారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో రోడ్లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల ప‌నులు వేగంగా పూర్త‌య్యాయ‌ని తెలిపారు. పిల్ల‌ల‌కు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని ఆస్తిగా అందించాల్సిన బాధ్య‌త ప్ర‌తి కుటుంబంపై ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. వార్డుల వారిగా నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను సాధించుట‌కు ప్ర‌జ‌ల‌ను హ‌రిత‌హారంలో నిమ‌గ్నం చేయాల‌ని తెలిపారు. హ‌రిత‌హారంలో పాల్గొనే ప్ర‌జ‌ల‌కు శానిటైజ‌ర్లు, మాస్కుల‌ను అంద‌జేయాల‌ని తెలిపారు. ఇల్లు, ప‌రిస‌రాల్లో, కాల‌నీలోని రోడ్లు, పార్కుల‌ను హ‌రిత‌మ‌యం చేయాల‌ని తెలిపారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)