పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ

Fri, Jun 19, 2020, 04:01 PM
Related Image
  • పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జిహెచ్ఎంసి కమీషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్, కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి
హైదరాబాద్, జూన్ 19: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేక ప్రణాళికతో పని చేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. పంజాగుట్టలో రూ.5 కోట్ల 95 లక్షలు వ్యయంతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శుక్రవారం హోం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జిహెచ్ఎంసి కమీషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్, కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి, ప్రాజెక్ట్స్ విభాగం సి ఈ శ్రీధర్, ఈ ఈ జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ అత్యంత రద్దీగా వుండే ఈ రహదారి విస్తరణకు పనులు మంజూరుకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్న పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు చొరవ చూపినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అభివృద్ధి పనులలో రాష్టం ముందున్నదని తెలిపారు. లాక్ డౌన్ పీరియడ్ లో అభివృద్ధి పనులు వేగంగా జరిగినట్లు తెలిపారు. ఇటీవలనే ఫ్లైఓవర్ లు, అండర్ పాసుల‌తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రగతిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు సమీక్షగించినట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.

అదే విదంగా అతితక్కువ సమయంలో పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించారని జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థను, సానుకూలంగా స్పందించి స్థలాలను అప్పగించిన యజమానులను, క‌మ్యునిటీ సంఘాలను హోం మంత్రి అభినందించారు. శ్మ‌శాన వాటికలో వున్న సమాధులకు ఎటువంటి నష్టం జరగకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టీల్ ప్లేట్ గిర్డిల్స్ ఉపయోగించి ఈ బ్రిడ్జిని నిర్మించినట్లు తెలిపారు. లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ట్రాఫిక్ సమస్య లేకుండా పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి వలన  ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని, కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు.

రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ పీరియడ్ ను జిహెచ్ఎంసి ఉపయోగించుకున్నట్లు తెలిపారు. నగరంలో రోడ్లు, వంతెనలు, నాలా పూడిక తీత, నాలా విస్తరణ పనులు జరిగినట్లు తెలిపారు. లాక్ డౌన్ లోనే ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించి, ట్రాఫిక్ సమస్యను తీర్చినట్లు తెలిపారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు.

మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఆదేశాల‌ మేరకు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి జిహెచ్ఎన్సి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే నాగార్జున సర్కిల్ నుండి బంజారాహిల్స్, పంజాగుట్ట మధ్య ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, ప్రయాణ సమయాన్ని తగ్గించుటకై రూ. 23 కోట్ల అంచనాతో చట్నీస్ వైపు స్టీల్ బ్రిడ్జితో పాటు హిందూ శ్మ‌శాన వాటికవైపు నాగార్జున సర్కిల్ నుండి శ్మ‌శాన వాటికకు వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక బ్రిడ్జి, మెయిన్ రోడ్డులో ప్రస్తుతం శ్మ‌శాన వాటిక ప్రవేశద్వారం నుండి హై- టెన్షన్ విద్యుత్ లైన్ వరకు ఒక బ్రిడ్జి, రోడ్డు విస్తరణ, మరియు శ్మ‌శాన వాటిక నుండి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ -01 కు వెళ్లేందుకు ఎక్జిట్ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఈ పనులలో జిహెచ్ఎంసి జనరల్ ఫండ్ తో రూ. 5.95 కోట్లతో చ‌ట్నీస్‌ వైపు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని నేడు ప్రారంభించుకున్నట్లు తెలిపారు. హిందూ శ్మ‌శాన వాటిక వైపు చేపట్టిన పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. జులై నెలాఖరుకు అన్ని పనులు పూర్తవుతాయని తెలిపారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)