ap7am logo

సినీ, టీవీ రంగాలలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా కృషి చేస్తా: మంత్రి తలసాని

Mon, Jun 01, 2020, 03:30 PM
Related Image హైదరాబాద్: సినీ, టీవీ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా కృషి చేస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.  సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మంత్రిని 24 విభాగాలకు చెందిన వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. తమకు తెల్ల రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు వర్తింప చేయాలని కోరారు. చిత్రపురి కాలనీలో 4 వేల మంది ఉంటున్నారని, వారి కోసం హాస్పిటల్, పాఠశాల ను నిర్మించాలని ఈ సందర్బంగా మంత్రిని కోరారు.

లాక్ డౌన్ సమయంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలోని 14 వేల మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ చిత్రపురి కాలనీలో హాస్పిటల్, పాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం బెస్ట్ పాలసీ ని తయారు చేస్తుందని, అందులో సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం పై కూడా పొందుపర్చడం జరుగుతుందని వివరించారు.

ఇప్పటికే చిరంజీవి, నాగార్జున ఇతర సినీ ప్రముఖులతో చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. CMRF ద్వారా వైద్య సేవలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. మంత్రి తో పాటు ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు కూడా ఉన్నారు. మంత్రిని కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు కోమర వెంకటేష్, ప్రధాన కార్యదర్శి PSN దొర, అనిల్, తెలుగు సినీ, టీవీ కాస్టూమర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నరసింహారావు, నాగేంద్ర ప్రసాద్, వాసు, లలిత, సురేష్, రాజేశ్వర్ రెడ్డి, బాబ్జీ, రాంబాబు, మూర్తి, ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

దసరా నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి: మంత్రి
దసరా నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హౌసింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని GYR కాంపౌండ్, బండ మైసమ్మ నగర్, చాచా నెహ్రూ నగర్, పొట్టి శ్రీరాములు నగర్, గొల్ల కొమరయ్య కాలనీ తదితర ప్రాంతాలలో 105.46 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 1258 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతి పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ హౌసింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి నగర పరిధిలో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. విద్యుత్, సేవరేజ్ లైన్, వాటర్ పైప్ లైన్ తదితర పనులు పూర్తి చేసి అక్టోబర్ నాటికి గృహ ప్రవేశం జరిగేలా సిద్ధం చేయాలని ఆదేశించారు. అంబేద్కర్ నగర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆవరణలో ప్రభుత్వ స్థలంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు చెందిన గోదాం, డైరీ పాం లను నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాలని, అవసరమైతే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ RDO వసంత కుమారి ని ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలోనే సనత్ నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేస్తున్నట్లు ఆయన వివరించారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నేరవేర్చేందుకు నగర పరిధిలో సుమారు లక్ష ఇండ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్దిదారులపై ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు చేసి నిర్మించి ఇస్తుందని వివరించారు.

ఈ సమావేశంలో రాంగోపాల్ పేట, బన్సీలాల్ పేట కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, హేమలత, హౌసింగ్ CE సురేష్, SE కిషన్, EE వెంకటదాసురెడ్డి, DEE గంగాధర్, సికింద్రాబాద్ RDO వసంత కుమారి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ముషీరాబాద్ MRO లు బాలశంకర్, హసీనా, జానకి, టౌన్ ప్లానింగ్ ACP కృష్ణ మోహన్, వాటర్ వర్క్స్ GM రమణారెడ్డి, DGM సునీల్, ఎలెక్ట్రికల్ DE లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)