ap7am logo

నియంత్రిత పద్ధతిలో ప్రాధాన్యం గ‌ల పంటలను సాగు చేస్తే అధిక లాభాలను ఆర్జిస్తారు: తెలంగాణ స్పీకర్ పోచారం

Thu, May 28, 2020, 08:55 PM
Related Image నిజామాబాద్ జిల్లా/ కామారెడ్డి జిల్లా: వానాకాలం 2020 పంటల సాగుపై బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలం శ్రీనగర్, పాతవర్ని, బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామాలలో ఈరోజు జరిగిన “అవగాహన సదస్సులలో” పాల్గొన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ.. నియంత్రిత పద్ధతిలో ప్రాధాన్యం గ‌ల పంటలను సాగు చేయడం ద్వారా రైతులు త‌మ దిగుబడుల నుండి అధిక లాభాలను ఆర్జిస్తారని తెలిపారు.

మూస పద్ధతిలో ఒకే రకమైన పంటను ఎక్కువ మంది రైతులు సాగు చేయడంతో మార్కెట్ లో డిమాండ్ తగ్గడంతో తక్కువ ధరలకు అమ్ముకోవాలసిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు తక్కువ సాగుచేసిన పంటలతో మార్కెట్ లో డిమాండ్ ఉండి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత పంటల సాగును తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగానికి అనుగుణంగా పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు మంచి లాభాలు పొందడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలలో స్థానికంగానే ఆహార ఉత్పత్తులు అందుతాయి. రైతులు వ్యవసాయ శాఖ సూచించిన పంటలను సాగు చేయాలి. ఇది రైతుల మేలు కోసమే తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో సన్న రకాల బియ్యంను ప్రజలు ఎక్కువగా తింటున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా సన్న రకాలకే అధిక డిమాండ్ ఉన్నది. రైతులు సన్న రకాలను సాగు చేయడం ద్వారా మద్దతు ధరతో అధిక లాభాలను పొందుతారని, మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కొనుగోలు ఇబ్బందులు ఉండవన్నారు.

గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతుల అభివృద్ధి కోసం కృషి చేయలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులను కష్టాల నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. రైతు బంధు, రైతు భీమా, ఉచితంగా 24 గంటల కరెంటు, రుణమాఫీ, అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం, ప్రతి అయిదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం, రైతు వేధికల నిర్మాణం, నూతన గౌడాన్ల నిర్మాణం మన రాష్ట్రంలోనే చేపట్టారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను మన  రైతులు అనుభవిస్తున్నారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను ప్రారంభిస్తారు. ఈ రిజర్వాయర్ నుండి ప్రత్యేక కాలువ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్ళు వస్తాయి. అదేవిధంగా పండిన ప్రతి గింజను మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి కొనుగోలు చేస్తుంది.

ఈ సందర్భంగా ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేస్తామని వర్ని మండలం  శ్రీనగర్, పాతవర్ని, వకీల్ ఫారం, నెహ్రూ నగర్ గ్రామాల రైతులు మరియు చందూర్ మండల కేంద్ర రైతులు తమ తీర్మాన పత్రాలను స్పీకర్ పోచారంకి అందజేశారు. ఈ అవగాహన సదస్సులో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)