ap7am logo

పశు గణాభివృద్ది సంస్థ కార్యకలాపాలపై మంత్రి తలసాని సమీక్ష సమావేశం

Sat, May 23, 2020, 07:49 PM
Related Image హైదరాబాద్: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువుల పెంపకాన్ని చేపట్టే విధంగా రైతులను ప్రోత్సహించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ట్ర పశు గణాభివృద్ది సంస్థ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, TSLDA చైర్మన్ రాజేశ్వర్ రావు, CEO మంజువాణి, విజయ డెయిరీ MD శ్రీనివాసరావు, వివిధ జిల్లాల పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతులు పాడి పశువుల పెంపకాన్ని చేపట్టే విధంగా ప్రోత్సహించడం వలన రైతులకు ప్రతిరోజూ ఆదాయం లభింఛి ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని, పాడి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు దోహద పడుతుందని వివరించారు. పాడి రంగం అభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన చెప్పారు. రైతులకు మేలు చేయాలనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయడం కోసం మేలుజాతి పశువుల అభివృద్దికి పశుగణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు చెప్పారు. పాడి రంగం అభివృద్ధి కి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సబ్సిడీపై పాడి గేదెలను అందజేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్దమనసుతో లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకాన్ని రైతులకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

పశుగణాభి వృద్ది సంస్థను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో పాడిరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని అన్నారు. అందులో భాగంగా 33 జిల్లాలలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు పశుగణాభివృద్ది సంస్థ పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు అయన తెలిపారు. ఇందుకు గాను పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అద్యక్షతన TSLDA చైర్మన్, CEO, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, విజయ డెయిరీ MD లతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నూతన కమిటీలకు అవసరమైన కార్యాలయాలు, సిబ్బంది, సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే గోపాలమిత్రల ద్వారా రైతు ఇంటివద్దనే కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి సేవలకు గుర్తింపుగా 3500  రూపాయలుగా ఉన్న గోపాలమిత్రల వేతనాన్ని 8500 రూపాయలకు పెంచినట్లు చెప్పారు.

నాణ్యమైన పశుసంపద అభివృద్ధి కోసం విరివిగా కృత్రిమ గర్బధారణ శిభిరాలను నిర్వహించాలని ఆదేశించారు. కరీంనగర్ లోని పశు వీర్య ఉత్పత్తి కేంద్రంలో సంవత్సరానికి 16 లక్షల డోసుల ఉత్పత్తి జరుగుతుందని, కంసానిపల్లిలో నిర్మిస్తున్న గనికృత పశు వీర్య ఉత్పత్తి కేంద్రం 3 నెలల్లో అందుబాటులో రానుందని తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వీర్యం, పాల ఉత్పత్తి నాణ్యతను పరిశీలించేందుకు ఆధునిక లాబరేటరీ ఏర్పాటు చేయడానికి అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. విజయ డెయిరీ, ముల్కనూర్, కరీంనగర్, నార్మూల్ డెయిరీలతో సమన్వయం చేసుకొని అవసరమైన చోట్ల పాలు, పాల ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సరఫరా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని విజయ డెయిరీ MD ని ఆదేశించారు.

పశుసంవర్ధక, పశుగణాభివృద్ది, విజయ డెయిరీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పారు. అంతేకాకుండా పనిభారాన్ని ఆయా శాఖలు పంచుకొని త్వరితగతిన పనులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. గోపాలమిత్రల సేవలను వినియోగించుకొని మెరుగైన సేవలు అందించాలని తద్వారా శాఖకు మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. పశుసంవర్ధక, పశుగణాభివృద్ది, డెయిరీ అధికారులు ప్రతినెల సమావేశం ఏర్పాటు చేసుకొని సమన్వయంతో వ్యవహరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. గోపాలమిత్రలు, సిబ్బందికి ప్రతి 2 నెలల కు ఒకసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక క్యాలెండర్ ను రూపొందించుకొని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

పాల ఉత్పత్తిని పెంపొందించడం పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం వలన సమస్యలపై అవగాహన వస్తుందని పేర్కొన్నారు. జిల్లాల చైర్మన్ లు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి సమస్యలపై అధ్యయనం చేయాలని అన్నారు. DD లు చెల్లించిన రైతులకు త్వరలో పాడి గేదెలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గోపాలమిత్రల మార్చి నెల వేతనాన్ని విడుదల చేస్తు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)