రవితేజ తను తెరపై ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేవరకూ సందడి ఉండేలా చూసుకుంటాడు. ప్రేక్షకులు ఎంత మాత్రం బోర్ ఫీలవ్వకుండా ఎంటర్టైన్ చేస్తాడు. ఇక దర్శకుడిగా వీఐ ఆనంద్ కథాకథనాల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. కథలో ఆసక్తికరమైన మెలిక ఉండేలా చూసుకుని, చివర్లో అనూహ్యమైన సంగతేదో చెప్తాడు. రవితేజ స్టైల్ కి తన మార్క్ ప్రయోగాన్ని జోడించి ఈ కథను వీఐ ఆనంద్ ఎలా నడిపించాడో .. మాస్ ఆడియన్స్ ను ఎంతవరకూ మెప్పించాడో ఇప్పుడు చూద్దాం.
ఈ కథ లడఖ్ లోని మంచు కొండల్లో మొదలవుతుంది. డిస్కోరాజా (రవితేజ) ను విలన్ గ్యాంగ్ అంతం చేసేసి వెళ్లిపోతారు. చాలా కాలం తరువాత ఐస్ ట్రెక్కింగ్ కి వెళ్లిన కొంతమంది స్టూడెంట్స్ కి ఆ శవం దొరుకుతుంది. చనిపోయినవారిని బ్రతికించే దిశగా చాలాకాలంగా ప్రయోగాలు చేస్తున్న డాక్టర్ శర్మ దగ్గరికి ఆ శవం చేరుతుంది. డిస్కోరాజాను ఆయన బ్రతికిస్తాడు. అయితే గతాన్ని మరిచిపోయిన డిస్కోరాజా, తానెవరన్నది తెలుసుకోవడం కోసం ఓ మినిస్టర్ ను కొడతాడు.
ఆ వార్త టీవీల్లో రావడంతో డిస్కోరాజాను చూసిన ఓ కుటుంబం, అతను కొంత కాలంగా కనిపించకుండాపోయిన తమ 'వాసు'నే అని అనుకుంటారు. చాలా కాలం క్రితం చనిపోయిన డిస్కోరాజా ఎలా బ్రతికి వచ్చాడనేది అర్థంకాక విలన్ (బాబీసింహా) గ్యాంగ్ అయోమయంలో పడుతుంది. వాసు ఎవరు? డిస్కోరాజాతో ఆయనకి గల సంబంధం ఏమిటి? డిస్కోరాజాపైకి వాసును ఉసిగొల్పిన అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకు వెళుతుంది.
'ఎక్కడికిపోతావు చిన్నవాడా'.. 'ఒక్క క్షణం' సినిమాలు చూస్తే కథాకథనాలపై వీఐ ఆనంద్ కి మంచి పట్టు ఉందనే విషయం అర్థమవుతుంది. అలాగే కథా వస్తువుపై పూర్తి స్పష్టత ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఆ రెండు సినిమాలకి భిన్నంగా ఈ సినిమాలో ఆయన హీరోతో ద్విపాత్రాభినయం చేయించాడు. ఈ కారణంగా ఈ రెండు పాత్రలను బ్యాలెన్స్ చేయడంలో ఆయన కాస్త ఇబ్బంది పడినట్టుగానే అనిపిస్తుంది. 'డిస్కోరాజా' నేపథ్యం ప్రధానమైనది కనుక ఆ పాత్ర వరకూ ఆయన బాగానే మలిచాడు. మరో పాత్రకి సంబంధించిన నేపథ్యం బలహీనంగా అనిపిస్తుంది. ఈ కారణంగా ఆ ఎపిసోడ్ లోని పాత్రలు ... సన్నివేశాలు తేలిపోయాయి.
ఇంట్రడక్షన్ సీన్ మినహా విలన్ పాత్ర కూడా పవర్ఫుల్ గా ఏమీ అనిపించదు. నభా నటేశ్ .. పాయల్ రాజ్ పుత్ .. తాన్య హోప్ కథానాయికలు అనగానే, మాస్ ఆడియన్స్ ఒక రేంజ్ లో రొమాన్స్ ను ఊహించుకుంటారు. ఎవరితోనో ఒకరితో మాస్ సాంగ్ ఉంటుందని ఆశపడతారు. కానీ అలాంటి వాళ్లందరి ఆశలపై దర్శకుడు ఐస్ నీళ్లు చల్లేశాడు. ఈ మాత్రం దానికి హాట్ భామలు ఎందుకు అనుకోకుండా ఉండలేరు. హీరోను బ్రతికించే ప్రయోగం తాలూకు ప్రయత్నాలు మాస్ ఆడియన్స్ కి అర్థం కావు. ఒకానొక సందర్భంలో సునీల్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ చూపించడం కథాపరంగా కలిసిరాకపోగా, కథలో సీరియస్ నెస్ లోపించింది. వెన్నెల కిషోర్ పాత్ర ద్వారా నవ్వించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం మాత్రం కొంతవరకూ ఫలించింది.
రవితేజ ఈ సినిమాలో రెండు పాత్రలను పోషించాడు. అయితే రెండవ పాత్రలో ఆయన చేయడానికేమీ లేకుండా పోయింది. 'డిస్కోరాజా'గా మాత్రం ఫుల్ ఎనర్జీతో చేశాడు. యాక్షన్ .. ఎమోషనల్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు. కథానాయికల విషయానికొస్తే ల్యాబ్ అసిస్టెంట్ గా తాన్యా హోప్ కనిపిస్తుంది. అనాథ పిల్లల ఆలనా పాలన చూసే పాత్రలో నభా నటేశ్ కనిపిస్తుంది. ఇక పాయల్ ను మూగ, వినికిడి లోపం కలిగినదిగా చూపిస్తూ దర్శకుడు కొత్తదనాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాడు. అలా చూపించవలసిన అవసరం ఏమిటనే విషయం కూడా అర్థం కాదు. ఇక వాసు జాడను వెతికి పట్టుకునే పాత్రలో సీనియర్ నరేశ్ చేసిన కామెడీ తక్కువ .. కన్ఫ్యూజన్ ఎక్కువ. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరో అయిన 'రాంకీ'తో పసలేని పాత్ర చేయించడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. విలన్ పాత్రలో బాబీసింహా ఆకట్టుకుంటాడు. విలన్ పాత్రకి ఆయన వాయిస్ బాగా సెట్ అయింది. మిగతా పాత్రల్లో అంతా ఓకే అనిపించారు.
తమన్ సంగీతం ఫరవాలేదు. ఆయన అందించిన బాణీల్లో 'నువ్వు నాతో ఏమన్నవో' అనే బాలు పాట బాగుంది. రీ రికార్డింగ్ బాగుంది .. అక్కడక్కడా సన్నివేశాలను డామినేట్ చేసింది కూడా. కెమెరా పనితనం చాలా బాగుంది. లడఖ్ లోని మంచు పర్వతాల్లోని సన్నివేశాల చిత్రీకరణ ఆశ్చర్యచకితులను చేస్తుంది. అలాగే యాక్షన్ సన్నివేశాలను కూడా గొప్పగా ఆవిష్కరించాడు. ఎడిటింగ్ విషయానికొస్తే ఫస్టాఫ్ లో ల్యాబ్ లో ప్రయోగానికి సంబంధించిన సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేది. వెంకట్ - రవివర్మ ఫైట్స్ బాగున్నాయి. అబ్బూరి రవి అందించిన సంభాషణలు సహజంగా సాగిపోయాయి. లోతైన మాటలు పెద్దగా లేవు.
రవితేజ అనగానే ఆయన నుంచి మాస్ ఆడియన్స్ తమకి ఇష్టమైన కంటెంట్ ను ఆశిస్తారు. సైంటిఫిక్ కి సంబంధించిన విషయాలను వాళ్లకు కనెక్ట్ చేయడం చాలా కష్టం. అలాగే విశ్రాంతి వరకూ కథలో వున్న మెలిక వాళ్లకి అర్థం కావడం కష్టమే. అందువలన ఒక రకమైన అయోమయం వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది. రవితేజ నుంచి మాస్ ఆడియన్స్ కోరుకునే స్టైల్ వుంది. కానీ ఆయన ఎనర్జీని ఆవిష్కరించే పాటలుగానీ .. డాన్సులుగాని లేకపోవడం ఒక లోటుగా కనిపిస్తుంది. క్రేజ్ వున్న ఇద్దరు గ్లామరస్ కథానాయికలను ఎంతమాత్రం ఉపయోగించుకోకపోవడం, రవితేజ మార్క్ మాస్ డైలాగ్స్ లేకపోవడం మరో లోటుగా చెప్పుకోవాలి. సగటు ప్రేక్షకుడిగా చెప్పాలంటే ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.
'డిస్కోరాజా' మూవీ రివ్యూ
| Reviews
Disco Raja Review
డిస్కోరాజా చిన్న చిన్న దొంగతనాల నుంచి గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. ఆ వృత్తిలో ఆయనకి బర్మా సేతు శత్రువుగా మారతాడు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటుంది. ఓ సారి లడఖ్ వెళ్లిన డిస్కోరాజా అక్కడ హత్య చేయబడతాడు. చాలా కాలంగా ఓ డాక్టర్ చేస్తున్న ప్రయోగం ఫలించి, డిస్కోరాజా బ్రతుకుతాడు. అయితే, గతాన్ని మరిచిపోయిన ఆయన ఏం చేస్తాడు? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేదే కథ. ఫస్టాఫ్ సాగతీతగాను .. సెకండాఫ్ కాస్త గందరగోళంగాను సాగే ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే!
Movie Name: Disco Raja
Release Date: 2020-01-24
Cast: Raviteja, Payal Rajput, Nabha Natesh, Tanya Hope, Bobby Simha, Sunil, Vennela Kishore, Ramki, Giri Babu
Director: V.I. Anand
Music: Thaman
Banner: S.R.T. Entertainments
Review By: Peddinti