తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకూ అపజయమెరుగని దర్శకుల జాబితాలో రాజమౌళి .. కొరటాల శివ తరువాత వినిపించే పేరు అనిల్ రావిపూడి. వినోదభరితమైన కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే దర్శకుడిగా చాలా తక్కువ సమయంలోనే ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఈ సారి వినోదానికి సందేశాన్ని జోడించి ఆయన ఆవిష్కరించిన సినిమానే 'సరిలేరు నీకెవ్వరు'. ఆయన అందించిన హిట్ చిత్రాల జాబితాలో ఈ సినిమాకి చోటు దక్కుతుందా? కొత్త ఏడాదిలో మహేశ్ బాబుకి హిట్ పడుతుందా? అనేది ఇప్పుడు చూద్దాం.
మేజర్ అజయ్ కృష్ణ (మహేశ్ బాబు) కశ్మీర్ రెజిమెంట్ లో పనిచేస్తుంటాడు. అతని టీమ్ లోనే అజయ్ (సత్యదేవ్) కూడా పనిచేస్తుంటాడు. తీవ్రవాదుల బారి నుంచి పిల్లలను కాపాడే ఒక ఆపరేషన్లో అజయ్ (సత్యదేవ్) తీవ్రంగా గాయపడతాడు. అతను బతికే అవకాశాలు తక్కువనే విషయం స్పష్టమవుతుంది. అతని తల్లి ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) తన కూతురికి సంబంధాన్ని కుదుర్చుతుంది. ఆ పెళ్లికి తన కొడుకు వస్తాడని ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటుంది.
తన పైఅధికారి ఆదేశం మేరకు ప్రొఫెసర్ భారతి కుటుంబానికి అండగా నిలబడటం కోసం తన సహోద్యోగి అయిన ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్)ను వెంటబెట్టుకుని అజయ్ కృష్ణ కర్నూల్ బయల్దేరతాడు. మార్గమధ్యంలో అతనికి సంస్కృతి (రష్మిక) పరిచయమవుతుంది. తొలి చూపులోనే ఆమె అతనిపై మనసు పారేసుకుంటుంది. కర్నూల్ చేరుకున్న అజయ్ కృష్ణ, మినిస్టర్ నాగేంద్ర (ప్రకాశ్ రాజ్) వలన ప్రొఫెసర్ భారతికి ప్రాణభయం ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది మిగతా కథ.
యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని మిక్స్ చేసి నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. ఆయన గత చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అదే తరహా కథకి సందేశాన్ని కూడా జోడించి, దేశరక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని సైనికుడిని 'సరిలేరు నీకెవ్వరు' అని కీర్తిస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు.
బలమైన కథాకథనాలతో .. ఆసక్తికరమైన సన్నివేశాలతో అనిల్ రావిపూడి ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను ఆయన మూడు భాగాలుగా చేసుకున్నాడు. ఆరంభంలో కామెడీకి .. మధ్యలో యాక్షన్ కి .. చివరిలో ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఆయన ఈ కథను పరుగులు తీయించాడు. ఎక్కడా అనవసరమైన పాత్రలు కనిపించకుండా, ఎంచుకున్న ప్రతి పాత్రకి ప్రాధాన్యతనిస్తూ .. ప్రత్యేకతను కల్పిస్తూ కథను నడిపించాడు. మహేశ్ బాబు .. రష్మిక .. జయప్రకాశ్ రెడ్డి .. సంగీత .. పోసాని పాత్రలకి ఊతపదాలు పెట్టేసి ఆద్యంతం నవ్వించాడు. మహేశ్ బాబు లుక్ దగ్గర నుంచి ప్రతి విషయంలోను ఆయన తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ స్క్రీన్ పై కనిపిస్తుంది. ట్రైన్ లో కామెడీ ఎపిసోడ్ .. కొండారెడ్డి బురుజు దగ్గర యాక్షన్ సీన్ .. ప్రకాశ్ రాజ్ ఇంటికి వచ్చి ఆయనను మహేశ్ బాబు హెచ్చరించే సీన్ ను హైలైట్ గా చిత్రీకరించాడు.
మేజర్ పాత్రలో మహేశ్ బాబు నటన ఈ సినిమాకి హైలైట్. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పరంగా ఆయన పూర్తి మార్కులు కొట్టేశాడు. ఇంతకుముందుకంటే ఈ సినిమాలో ఆయన లుక్ బాగుంది .. మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడు. అల్లరి పిల్లగా రష్మిక కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఇక ప్రొఫెసర్ భారతి పాత్రకి విజయశాంతి నిండుదనాన్ని తీసుకొచ్చింది. కాకపోతే ఆమె ఫేస్ లో మునుపటి కళలేదు. మినిస్టర్ నాగేంద్ర పాత్రలో ప్రకాశ్ రాజ్ జీవించాడు. రావు రమేశ్ .. సంగీత .. రాజేంద్ర ప్రసాద్ .. అజయ్ .. సుబ్బరాజు .. జయప్రకాశ్ రెడ్డి పాత్ర పరిధిలో నవ్వించారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. ఆయన బాణీల్లో 'హి ఈజ్ సో క్యూట్ .. హి ఈజ్ సో స్వీట్'.. 'డాంగ్ .. డాంగ్' .. 'సూర్యుడివో చంద్రుడివో' .. 'మైండ్ బ్లాక్' .. 'సరిలేరు నీకెవ్వరు' సాంగ్స్ సందర్భానికి తగినట్టుగా ఆకట్టుకున్నాయి. సన్నివేశాలకి తగినట్టుగా రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది .. ప్రేక్షకుడిని కూడా సన్నివేశాల్లో ఒక పాత్రను చేస్తూ రీ రికార్డింగ్ సాగింది. ఇక రత్నవేలు ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ప్రతి సన్నివేశాన్ని .. ప్రతిపాటను .. ప్రతి ఫైట్ ను ఆయన గొప్పగా ఆవిష్కరించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా వుంది. ఎక్కడా అనవసరమైన సీన్స్ గానీ .. సాగతీత సీన్స్ గాని కనిపించవు. ఫైట్స్ .. కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా వున్నాయి.
'నీలా నేను ఎందుకు తిట్టలేదో తెలుసా? మీ అమ్మ అన్నాగానీ నాకు రెస్పెక్టే రా' అంటూ ఓ తీవ్రవాదితో మహేశ్ చెప్పే డైలాగ్, 'ఆడపిల్లల తండ్రులపై దరిద్రులు దండయాత్ర చేస్తూనే వుంటారు' అంటూ రావు రమేశ్ చెప్పే డైలాగ్, 'బతుకు తెరువు కోసం ఎన్నో గొలుసులు లాగారు .. బతకడం కోసం ఈ గొలుసు లాగలేర్రా' అంటూ ట్రైన్లో దొంగలతో మహేశ్ చెప్పే డైలాగ్, 'అడవి .. అల్లూరి సీతారామరాజు బలం' అనే అజయ్ డైలాగ్ ఆకట్టుకునేలా వున్నాయి. ఇక 'మీ పట్టుదల..కృషి .. శ్రమ' అనే మహేశ్ ఊతపదం .. 'నీకు అర్థమవుతుందా' అనే రష్మిక ఊతపదం .. 'ఈ ఆడోళ్లున్నారే' అనే పోసాని ఊతపదం .. 'కూజాలు చెంబులవుతయ్' అనే జయప్రకాశ్ రెడ్డి ఊతపదం ..'నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్' అనే సంగీత టీమ్ ఊతపదం సందర్భోచితంగా నవ్వులు పూయిస్తాయి.
ఈ సినిమా మొత్తంలో కొంతవరకూ రష్మిక కనిపించదు .. కాకపోతే అదో లోపంగా అనిపించదు. అలాగే ఒకటి రెండు చోట్ల పాత్రల మేనరిజమ్స్ 'ఎఫ్ 2' సినిమాను గుర్తుకు తెస్తాయి. అలా అని చెప్పేసి అవి బోర్ కొట్టవు. తన మార్క్ కామెడీని .. మహేశ్ మార్క్ యాక్షన్ కి జోడిస్తూ, వాటిని ఎమోషన్ తో కలుపుతూ వెళ్లిన తీరు గొప్పగా వుంది. ప్రేక్షకులను నవ్వించే ఏ అవకాశాన్ని వదులుకోకుండా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా, యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు.
'సరిలేరు నీకెవ్వరు' మూవీ రివ్యూ
| Reviews
Sarileru Neekevvaru Review
దేశ సరిహద్దుల్లో శత్రువుల దాడిని తిప్పికొట్టే మేజర్ అజయ్ కృష్ణ, ప్రొఫెసర్ భారతి కుటుంబానికి అండగా నిలబడవలసి వస్తుంది. అందుకోసం అతను కశ్మీర్ నుంచి కర్నూల్ వస్తాడు. భారతి కుటుంబాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్న మినిస్టర్ నాగేంద్రకు ఎదురు తిరుగుతాడు. ప్రొఫెసర్ భారతికి .. మినిస్టర్ నాగేంద్రకి మధ్య వైరానికి గల కారణం ఏమిటి? భారతికి సపోర్ట్ గా నిలిచిన అజయ్ కృష్ణకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అజయ్ కృష్ణ ఎలా నాగేంద్ర ఆటకట్టించాడు? అనేది కథ. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సమపాళ్లలో కలిపి అల్లిన ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Movie Name: Sarileru Neekevvaru
Release Date: 2020-01-11
Cast: Mahesh Babu, Rashmika, Vijayashanti, Rajendra Prasad, Prakash Raj, Rao Ramesh, Posani, Sangeetha, Vennela Kishore, Ajay
Director: Anil Ravipudi
Music: Devi Sri Prasad
Banner: AK Entertainments, Sri Venkateswara Creations
Review By: Peddinti