'మత్తు వదలరా' అనే టైటిల్ వినగానే ఇదేదో డ్రగ్స్ కి సంబంధించిన సినిమానే అనే ఆలోచన సహజంగానే వస్తుంది. నిజంగానే ఈ సినిమా డ్రగ్స్ అనే అంశం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాతో కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైతే, చిన్నబ్బాయి శ్రీ సింహా హీరోగా పరిచయమయ్యాడు. ఇక దర్శకుడు రితేశ్ రాణా కూడా ఇదే సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఈ మూడు విశేషాలతో రూపొందిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం.
బాబూ మోహన్ (శ్రీ సింహా) .. యేసుదాస్ (సత్య) .. అభి (అగస్త్య) మంచి స్నేహితులు. ముగ్గురూ ఒక చిన్న రూమ్ లో అద్దెకి ఉంటూ వుంటారు. బాబూ మోహన్ .. యేసుదాస్ ఇద్దరూ ఓ ఆన్ లైన్ సంస్థలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తుంటారు. ఇక అభి మాత్రం రూమ్ లోనే ఉంటూ సిస్టమ్ పై ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చాలీచాలని జీతం పట్ల అసహనంతో వున్న బాబూ మోహన్ కి, అదనంగా ఎలా సంపాదించుకోవాలనేది చెబుతాడు యేసుదాస్. ఆ బాటలో అడుగు ముందుకువేయాలని నిర్ణయించుకున్న బాబూ మోహన్ ఒక ఫ్లాట్ కి వెళతాడు. యేసుదాస్ చెప్పిన ప్లాన్ ను ఆచరణలో పెట్టబోయి చిక్కుల్లో పడతాడు. అక్కడ ఏం జరుగుతుంది? అది ఎలాంటి పర్యవసానాలకి దారితీస్తుంది? అనేది మిగతా కథ.
రితేశ్ రాణా టైటిల్ కి తగిన కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా సాదాసీదాగా .. సహజత్వానికి దగ్గరగా పాత్రలను పరిచయం చేశాడు. కథను చిక్కుముడుల వైపు నడిపిస్తూ, చిక్కదనం పెంచుకుంటూ వెళ్లాడు. అందువలన ఫస్టాఫ్ చాలా నిదానించినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆడియన్స్ లో మరింత ఆసక్తిని రేకెత్తించిన రితేశ్ రాణా, ఆ తరువాత కథను బాగానే పరుగులు తీయించాడు.
డ్రగ్స్ .. మర్డర్ మిస్టరీకి సంబంధించిన రెండు అంశాలతో సస్పెన్స్ ను రేకెత్తిస్తూ, ఆ క్రమంలో కామెడీని మిస్ కాకుండా చూసుకున్నాడు. తెలుగు టీవీ సీరియల్స్ పై సెటైరిక్ గా రాసుకున్న ట్రాక్ తోను ప్రేక్షకులను నవ్వించాడు. హీరోయిన్ .. రొమాన్స్ .. పాటలు అనే అంశాలకు దూరంగా రూపొందిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
కీరవాణి చిన్నబ్బాయి శ్రీ సింహా ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించాడు. తనచుట్టూ ఏం జరుగుతుందో తెలియని అయోమయం .. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆరాటం కలిగిన యువకుడిగా శ్రీ సింహా బాగా చేశాడు. అయితే కొంత కథ తరువాత ఆయనను హ్యాండ్సమ్ గా చూపించాలనే ఉద్దేశంతో, అప్పటివరకూ ఫిక్స్ చేసిన లుక్ అసలు నప్పలేదు. గెడ్డం మీసాలతో కూడిన ఆ లుక్ ఆయనకే కాదు, చూసేవాళ్లకి కూడా కాస్త చిరాగ్గా అనిపిస్తుంది.
హీరో స్నేహితుడిగా యేసుదాసు పాత్రలో సత్య కితకితలు పెట్టేశాడు. మొదటి నుంచి చివరివరకూ కనిపిస్తూ .. నవ్విస్తూ రిలీఫ్ ను ఇచ్చాడు. ఈ పాత్ర ఆయన కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. మరో స్నేహితుడిగా అగస్త్య చాలా సహజంగా చేశాడు. చాలాకాలం తరువాత తెరపై కనిపించిన 'పావల' శ్యామల అదరగొట్టేసింది. వెన్నెల కిషోర్ .. విద్యుల్లేఖ రామన్ కామెడీ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయింది. బ్రహ్మాజీ .. గుండు సుదర్శన్ .. అతుల్య పాత్ర పరిధిలో నటించగా, అతిథి పాత్రలో అజయ్ మెరిశాడు.
ఇది క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథ కావడం వలన రీ రికార్డింగ్ పై ఎక్కువగా ఆధారపడి నడుస్తుంది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన సంగీతం, సందర్భానికి తగిన విధంగా వుంది. సురేశ్ సారంగం కెమెరా పనితనం బాగుంది. సన్నివేశాలకి తగిన లైటింగ్ తో ఆయన చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్టాఫ్ లో కార్తీక శ్రీనివాస్ తన కత్తెరకి మరికాస్త పని చెప్పాల్సింది. హీరో .. సత్య, .. విద్యుల్లేఖ .. గుండు సుదర్శనం కాంబినేషన్లో వచ్చే సీన్స్ ను ట్రిమ్ చేస్తే బాగుండేది.
తక్కువ పాత్రలతో .. చాలా తక్కువ బడ్జెట్లో రూపొందిన సినిమా ఇది. నిజం చెప్పాలంటే ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కి మాత్రమే సరిపోయే కంటెంట్. దర్శకుడు దానిని వెండితెరకి తగినట్టుగా మలచడానికి చేసిన ప్రయత్నం కారణంగా, ఫస్టాఫ్ నెమ్మదించింది. సస్పెన్స్ కి .. మిస్టరీకి మధ్య దొరికిన ఏ అవకాశాన్ని దర్శకుడు వదులుకోకుండా కామెడీని కలుపుతూ వెళ్లాడు. అందువలన సినిమా బోర్ అనిపించదు. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ బడ్జెట్ లో .. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందని చెప్పొచ్చు.
'మత్తు వదలరా' మూవీ రివ్యూ
| Reviews
Mathu Vadalara Review
ఆర్థికపరమైన సమస్యలతో ముగ్గురు స్నేహితులు ఇరుకైన ఒక చిన్న గదిలో వుంటూ నానా కష్టాలు పడుతుంటారు. డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న కథానాయకుడు ఒక ఐటమ్ ను అందజేయడానికి ఒక ఫ్లాట్ కి వెళతాడు. అక్కడ జరిగే అనూహ్యమైన సంఘటనతో కథ మలుపు తిరుగుతుంది. ఆ సంఘటన ఏమిటి? పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేదే మిగతా కథ. ఫస్టాఫ్ లో కథ కాస్త నెమ్మదించినా, ఆ తరువాత ఆసక్తికరమైన మలుపులతో ఆకట్టుకుంటుంది.
Movie Name: Mathu Vadalara
Release Date: 2019-12-25
Cast: Sri Simha Koduri, Vennela Kishore, Satya, Athulya Chandra, Brahmaji, Agastya, Vidyullekha
Director: Ritesh Rana
Music: Kaala Bhairava
Banner: Mythri Movie Makers, Clap Entertainment
Review By: Peddinti