తెలుగు తెరను ఎన్నో ప్రేమకథా చిత్రాలు పలకరించాయి. ఆ కథల్లో .. ప్రేమ కోసం మరణాన్ని వరించిన జంటలు కొన్నయితే, మరణాన్ని జయించిన జంటలు మరికొన్ని కనిపిస్తాయి. అందుకు భిన్నంగా ఒక కొత్త పాయింటును పట్టుకుని దర్శకుడు జీఆర్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ఇది. సహజంగానే ప్రేమకథలను చూడటానికి యూత్ ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంది. మరి ఈ ప్రేమకథ వాళ్లకి ఉత్సాహాన్ని కలిగించిందా? నిరుత్సాహాన్ని మిగిల్చిందా? అనేది ఇప్పుడు చూద్దాం.
మహి(రాజ్ తరుణ్) .. వర్ష (షాలినీ పాండే) ఇద్దరూ కూడా 'ఊటీ'లోని ఒకే హాస్పిటల్లో పుడతారు. పదేళ్ల వయసు వచ్చేవరకూ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమగా పెరుగుతారు. వర్ష తాతయ్య (నాజర్) చనిపోవడంతో, ఆ కుటుంబం సొంత ఊరుకి వెళ్లిపోతుంది. ఆ కారణంగా మహి - వర్ష మధ్య దూరం పెరుగుతుంది. టీనేజ్ లోకి అడుగుపెట్టిన వర్ష, సినిమాల్లో హీరోయిన్ కావడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది.
ఇక తండ్రి బాటలోనే నడుస్తూ మహి ఫొటోగ్రఫర్ గా ఎదుగుతాడు. తన తండ్రి తీసిన ఫొటోలతో మహి ఒక ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాడు. ఆ ఫొటో ఎగ్జిబిషన్ కి వచ్చిన వర్ష, అక్కడ తన చిన్ననాటి ఫొటో చూసి మహిని గుర్తుపడుతుంది. అప్పటి నుంచి మళ్లీ వాళ్ల ప్రయాణం మొదలవుతుంది. ఈ లోగా రాహుల్ అనే వ్యక్తితో వర్ష పెళ్లి చేయడానికి ఆమె తల్లి (రోహిణి) ప్రయత్నిస్తుంటే, తనకి దగ్గరవుతున్న వర్షకి, తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాలని మహి నిర్ణయించుకుంటాడు. ఆరోగ్య పరంగా మహి ఎలాంటి పరిస్థితుల్లో వున్నాడు? రాహుల్ - మహి ఇద్దరూ కోరుకుంటున్న వర్ష, చివరికి ఎవరికి దక్కుతుందనేది మిగతా కథ.
'ఇద్దరి లోకం ఒకటే' నిజానికి చాలా మంచి టైటిల్ .. యూత్ ను థియేటర్స్ కి రప్పించే టైటిల్. ఈ కథకి ఇది కరెక్ట్ టైటిల్ అనే ఆడియన్స్ కి అనిపిస్తుంది. అయితే దర్శకుడు తయారు చేసుకున్న కథ .. అల్లుకున్న కథనం చాలా బలహీనమైనవి. కథ మొత్తం కూడా హీరో .. హీరోయిన్లపైనే నడుస్తుంది. మిగతా పాత్రల ప్రమేయం .. వాటి ప్రభావం చాలా తక్కువ. నాజర్ .. రోహిణి .. భరత్ వంటి ఆర్టిస్టులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం ఒక మైనస్ గా అనిపిస్తుంది.
హీరో హీరోయిన్లు జంట పక్షుల మాదిరిగా షికారు చేస్తుంటే .. అల్లరి చేస్తూ ఆడిపాడుతుంటే ఆడియన్స్ కి ఉల్లాసంగా అనిపిస్తుంది. అలా కాకుండా హీరో ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ .. ఆ సమస్యను హీరోయిన్ కి చెప్పలేక సతమతమవుతూ ఉంటే ఈ తరం ఆడియన్స్ సహనంతో సీట్లలో కూర్చోవడం కష్టమే. హీరో హీరోయిన్లను ఆశీర్వదించి థియేటర్లో నుంచి బయటికి రావాలనే తెలుగు ప్రేక్షకులు కోరుకుంటారు. అందుకు భిన్నమైన క్లైమాక్స్ ను దర్శకుడు ప్లాన్ చేయడం ఆయన వైపు నుంచి జరిగిన పొరపాటుగానే అనిపిస్తుంది.
మహి పాత్రలో రాజ్ తరుణ్ చాలా ఫ్రెష్ గా కనిపించాడు. కాస్త ఒళ్లు చేసి లుక్స్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. మనసిచ్చిన అమ్మాయికి తన జబ్బు విషయాన్ని చెప్పుకోలేక మానసిక సంఘర్షణకి గురయ్యే పాత్రలో బాగా చేశాడు. ఇక షాలినీ పాండే గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆకట్టుకుంది. గత చిత్రాల్లో కంటే ఈ సినిమాలో ఆమె మరింత గ్లామరస్ గా కనిపించింది. ఇక నాజర్ .. రోహిణి .. సిజ్జూ .. భరత్ పాత్ర పరిధిలో నటించారు.
మిక్కీ జె.మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. ప్రతి పాట సందర్భానికి తగినట్టుగా హృద్యంగా సాగింది. 'నువ్వే నువ్వే' .. 'అదే ఊరు అదే యేరు' .. 'నిజంలా నా కల' పాటలు బాగున్నాయి. ఇక రీ రికార్డింగ్ కూడా సందర్భానికి తగినట్టుగానే వుంది. సమీర్ రెడ్డి కెమెరా పనితనం గొప్పగా వుంది. హీరో హీరోయిన్లతో పాటు ప్రతి దృశ్యాన్ని చాలా అందంగా ఆవిష్కరించాడు. పాటలను .. ఊటీ లొకేషన్లను చాలా బ్యూటిఫుల్ గా ఆయన చిత్రీకరించాడు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, హీరో హీరోయిన్ల బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్ ను ట్రిమ్ చేస్తే బాగుండేది. అలాగే రోహిణిని ఆమె భర్త సిజ్జూ మోసగించే సీన్ కూడా అనవసరమనిపిస్తుంది. అబ్బూరి రవి మాటలు ఒకటి రెండు చోట్ల మాత్రమే మనసుకి తగులుతాయి. కథలో భాగంగా షాలినీ పాండే హీరోయిన్ పాత్ర ఆడిషన్స్ కి వెళితే, 'నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?' అని ఒక దర్శకుడు అంటాడు. అంత అందంగా వున్న అమ్మాయిని పట్టుకుని అలా ఎవరైనా అంటారా? అని ఆడియన్స్ షాక్ అవుతారు.
కథాకథనాల పరంగా చూసుకుంటే ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. కంగారేం వుంది ఇంటర్వెల్ కి ఇంకా చాలా సమయం ఉందిగా అన్నట్టుగా తాపీగా సాగుతూ నీరసం తెప్పిస్తుంది. పాత్రలు .. వాటి నేపథ్యాల చిత్రణ కూడా అసంతృప్తిని కలిగిస్తుంది. కథకి కామెడీని ఏ మాత్రం జోడించకపోగా, ప్రేక్షకులు జీర్ణించుకోలేని ఎమోషన్ ను హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సినిమా పూర్తయ్యేంతవరకూ ప్రేక్షకులు ఓపిగ్గా కూర్చున్నారు అంటే, ఆ క్రెడిట్ సంగీతానికి .. ఫొటోగ్రఫీకి వెళుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
'ఇద్దరి లోకం ఒకటే' మూవీ రివ్యూ
| Reviews
Iddari Lokam Okate Review
ప్రేమలో పడిన తరువాత కొన్ని సంఘటనలు అందమైన జ్ఞాపకాలుగా .. అనిర్వచనీయమైన అనుభూతులుగా మారతాయి. అయితే కొంతమంది విషయంలో చిన్ననాటి అందమైన జ్ఞాపకాలు .. అనుభూతులే ప్రేమగా మారతాయి. అలా రెండో కోవకి చెందిన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'ఇద్దరి లోకం ఒకటే'. ఒక చిన్నపాయింట్ పట్టుకుని మొదటి నుంచి చివరివరకూ సాగదీసిన ఈ కథ, ప్రేక్షకుల సహనానికి మాత్రం పరీక్ష పెడుతుంది!
Movie Name: Iddari Lokam Okate
Release Date: 2019-12-25
Cast: Raj Tarun, Shalini Pandey, Nassar, Rohini, Bharath
Director: G.R.Krishna
Music: Mickey J Meyer
Banner: Sri Venkateswara Craetions
Review By: Peddinti