'తాజా ఖబర్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!
Movie Name: Taaza Khabar
- 2023లో వచ్చిన ఫస్టు సీజన్
- అప్పటి 6 ఎపిసోడ్స్ కి మంచి రెస్పాన్స్
- ఈ నెల 27 నుంచి సెకండ్ సీజన్ స్ట్రీమింగ్
- ఓ మాదిరిగా అనిపించే కథ
- నిదానంగా .. నీరసంగా సాగే కథనం
'తాజా ఖబర్' హిందీ వెబ్ సిరీస్ ఫస్టు సీజన్ 2023 జనవరిలో 'హాట్ స్టార్' స్ట్రీమింగ్ అయింది. 6 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఆ సిరీస్ కి సీజన్ 2 వచ్చింది. హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 27వ తేదీ నుంచి హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. మరాఠీ భాషలలో అందుబాటులోకి వచ్చింది. 6 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ ముంబైలో జరుగుతూ ఉంటుంది. వసంత్ (భువన్ బామ్) ఓ పేద కుటుంబానికి చెందిన యువకుడు. వృద్ధులైన తల్లిదండ్రులను అతను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అతనికి నీడలా 'పీటర్' అనే స్నేహితుడు ఉంటాడు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళుతూ ఉంటారు. ఇక వసంత్ .. మధుబాల (శ్రియ) ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే మధుబాలపై మనసు పడిన శెట్టి ( జేడీ చక్రవర్తి), వసంత్ ను అడ్డుతప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
వసంత్ దగ్గరున్న ఫోన్ కి ఎప్పటికప్పుడు తాజా సమాచారం వస్తూ ఉంటుంది. అది జరగబోయే సంఘటనలకు సంబంధించిన సమాచారం కావడం ఇక్కడి విశేషం. ప్రపంచవ్యాప్తంగా జరగబోయే సంఘటనలు తన ఫోన్ కి మాత్రమే రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎక్కడ ఏం జరుగనుంది? డబ్బు ఎక్కడ చేతులు మారనుంది? ఏ ఆటలో ఎవరు గెలవనున్నారు? వంటి సంగతులు ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి.
దాంతో బెట్టింగ్ ను తన వృత్తిగా చేసుకున్న వసంత్, చాలా తక్కువ సమయంలో కోటీశ్వరుడు అవుతాడు. తన తల్లిదండ్రులను .. మధుబాలను .. పీటర్ ను ఎలాంటి లోటూ లేకుండా చూసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే అతని ఫోన్ కి ఒక సమాచారం వస్తుంది. వసంత్ దారుణమైన హత్యకి గురవుతాడనేది ఆ సమాచారంలోని సారాంశం. ఆ సమాచారం చదవగానే వసంత్ షాక్ అవుతాడు. ఇక్కడి వరకూ ఫస్టు సీజన్ కి చెందిన కథ నడుస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందా? అనే సస్పెన్స్ పై ఎండ్ చేశారు.
సెకండ్ సీజన్ విషయానికి వస్తే, తాను చనిపోయేలోగా మంచి పనులు చేయాలనుకున్న వసంత్, తన కాలనీవాసులకు డబ్బు పంచడం మొదలుపెడతాడు. ఆ సమయంలోనే అతనిని ఎవరో షూట్ చేస్తారు. వసంత్ మరణం అతని సన్నిహితులను కలచి వేస్తుంది. ఆ షాక్ నుంచి అతని తల్లిదండ్రులు తేరుకోలేకపోతుంటారు. పీటర్ .. మధుబాల ఆ బాధ నుంచి కోలుకోలేక పోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా వాళ్ల ముందు వసంత్ ప్రత్యక్ష మవుతాడు. అతను ఎలా తిరిగొచ్చాడనేది అర్థంకాక వాళ్లంతా అయోమయానికి లోనవుతారు. వసంత్ ప్రాణాలతో తిరిగొచ్చాడనే ఆనందాన్ని ఆవిరి చేస్తూ అతణ్ణి కిస్మత్ అనుచరులు కిడ్నాప్ చేస్తారు.
ఇంతకుముందు బెట్టింగ్ వలన యూసఫ్ అక్తర్ కోల్పోయిన వెయ్యికోట్ల గురించి కిస్మత్ ప్రస్తావిస్తాడు. ఆ డబ్బు వచ్చింది తన ఎకౌంట్ కేనని వసంత్ చెబుతాడు. ఆ డబ్బును అతని నుంచి వసూలు చేసే బాధ్యతను యూసఫ్ తనకి అప్పగించాడనీ, లేదంటే అతనే నేెరుగా రంగంలోకి దిగుతాడని బెదిరిస్తాడు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, అతని ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుందని అంటాడు.
దాంతో ఎక్కడ ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకుంటూ, చాలా త్వరగానే యూసఫ్ అడిగిన డబ్బును వసంత్ సర్దుబాటు చేస్తాడు. దాంతో అతను మరింత డబ్బు డిమాండ్ చేస్తూ నేరుగా రంగంలోకి దిగుతాడు. అప్పుడు వసంత్ ఏం చేస్తాడు? అసలు అతను ఎలా బ్రతికి వస్తాడు? దురాశకుపోయిన యూసఫ్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనేది కథ.
కామెడీ థ్రిల్లర్ జోనర్లో ఈ కథను అల్లారు. జరగబోయేది ముందుగానే తెలుసుకునే ఒక అవకాశం ఉండటం వలన, ఒక సామాన్య యువకుడు ఏ స్థాయికి ఎదుగుతాడు? అనేది కథ. ఈ క్రమంలో చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి. మరికొన్ని సాగతీతగా అనిపిస్తాయి. ఫస్టు సీజన్ లోని 6 ఎపిసోడ్స్ కాస్త సరదాగానే కనిపిస్తాయి. కానీ సెకండ్ సీజన్ విషయానికి వచ్చేసరికి, కామెడీ టచ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది.
నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ ఫరవాలేదు. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. చెప్పుకోదగిన తారాగణం ఉంది .. అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.నిజానికి సెకండ్ సీజన్ లో హీరోకి .. విలన్ కి మధ్య గేమ్ ఒక రేంజ్ లో నడవాలి. కానీ ఆ స్థాయి సన్నివేశాలను డిజైన్ చేయలేదు. అలాగే ట్విస్టులు కూడా ఏమీ లేవు. అక్కడక్కడా కాస్త హడావిడి చేస్తూ సాదాసీదాగా సాగిపోతుంది అంతే. ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి కథాకాస్త సర్దుకుని, టెన్షన్ పెడుతుంది. ఎంత చేసినా ఖర్చుకి తగిన స్థాయిలో కనెక్ట్ లేదనే భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే .. డ్రామాలో వేగం పెంచితే మరింత బెటర్ గా ఉండేదేమో అనిపిస్తుంది.