'హనీమూన్ ఫొటోగ్రాఫర్' (జియో సినిమా) వెబ్ సిరీస్ రివ్యూ!
Movie Name: Honeymoon Photographer
- మర్డర్ మిస్టరీగా 'హనీమూన్ ఫొటోగ్రాఫర్'
- 6 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
- 6 ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ
- కథను నిదానంగా చెప్పిన డైరెక్టర్
- ఆకట్టుకునే స్క్రీన్ ప్లే
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన సిరీస్ 'హనీమూన్ ఫొటోగ్రాఫర్'. ఆశానేగి .. సాహిల్ సలాధియా .. రాజీవ్ సిద్ధార్థ .. ఆపేక్ష పోర్వల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, అర్జున్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించాడు. 6 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్, ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
రోమేశ్ ఇరాని (రీతూ రాజ్ సింగ్) ఒక పెద్ద బిజినెస్ మెన్. అతని సంస్థలలో ఫార్మా కంపెనీ కూడా ఉంటుంది. ఆయన ఒక్కగానొక్క కొడుకు అధీర్ (సాహిల్ సలాథియా). అతను జోయా (ఆపేక్ష)తో ప్రేమలో పడతాడు. తండ్రికి ఇష్టం లేకపోయినా, ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. జోయాతో కలిసి మాల్దీవులకు హనీమూన్ ప్లాన్ చేస్తాడు. తమ వెడ్డింగ్ షూట్ కి వచ్చిన అంబిక (ఆశా నేగి)ని హనీమూన్ ఫొటోగ్రాఫర్ గా పిలుస్తారు. వాళ్లతో పాటు ఆమె మాల్దీవులకు వెళుతుంది.
జోయాతో పెళ్లికి సంబంధించిన ఫోటోలను తీయడానికి వెళ్లినప్పుడే, అంబికపై అధీర్ మనసు పారేసుకుంటాడు. అతను జోయాతో సంతృప్తికరంగా లేడనే విషయం అంబికకి అర్థమవుతుంది. మాల్దీవులలో ఆమెకి రేహాన్ (రాజీవ్ సిద్ధార్థ) పరిచయమవుతాడు. అతనితో ఆమె చనువుగా ఉండటాన్ని అధీర్ తట్టుకోలేకపోతాడు. అంబికపై అధీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే విషయం జోయాకి కూడా అర్థమైపోతుంది. ఒక రోజున తెల్లవారేసరికి బీచ్ లో అధీర్ శవమై కనిపిస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు.
మద్యం ఎక్కువ కావడం వలన .. సముద్రంలోకి వెళ్లడం వలన అధీర్ చనిపోయాడని అంతా భావిస్తారు. అధీర్ చనిపోయిన దగ్గర నుంచి, రేహాన్ కనిపించకపోవడం అంబికకి అనుమానాన్ని కలిగిస్తుంది. ఇక తన భర్త మరణించడానికి ముందు రోజు, తాము బస చేసిన ప్రదేశంలో తన మామగారికి అత్యంత సన్నిహితుడైన అరవింద్ కనిపించడం జోయాకి సందేహాన్ని కలిగిస్తుంది. అధీర్ తల్లి మీనా పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేయిస్తారు.
అధీర్ రక్తంలో పాయిజన్ ఆనవాళ్లు ఉన్నట్టుగా తేలుతుంది. తమ కొడుకును ఎవరు హత్య చేశారనేది తనకి తెలియాలని రోమేశ్ ఇరాని పోలీస్ డిపార్టుమెంటుపై ఒత్తిడి తెస్తాడు. దాంతో ఏసీపీ దివ్య (సంవేదన) రంగంలోకి దిగుతుంది. ముందుగా ఆమెకి అంబికపై అనుమానం వస్తుంది. దాంతో తన స్నేహితుడైన ఎల్విన్ ( జాసన్ ధామ్) ఇంట్లో అంబిక తలదాచుకుంటుంది. జరిగిందంతా అతనితో చెప్పి సాయం కోరుతుంది. ఇక అరవింద్ తో రోమేశ్ ఒక 'పెన్ డ్రైవ్' గురించి రహస్యంగా మాట్లాడుతూ ఉండటం జోయా వింటుంది.
ఆ 'పెన్ డ్రైవ్' కీ .. అధీర్ హత్యకి ఏదైనా కారణం ఉందా? అనే ఆలోచన ఆమెకి వస్తుంది. ఆ సీక్రెట్ ను ఛేదించడానికి ఆమె పూనుకుంటుంది. అదే సమయంలో ఎల్విన్ - అంబిక ఆమెను సీక్రెట్ గా ఫాలో అవుతారు. ఆమె నేరుగా వెళ్లి ఒక పాతబంగ్లాలో ఒక వ్యక్తిని కలుసుకుంటుంది. అతను రేహాన్ కావడంతో అంబిక బిత్తరపోతుంది. అతను తన లవర్ కాదనీ .. బ్రదర్ అని జోయా చెబుతుంది. అధీర్ ను హత్య చేసింది ఎవరనేది తెలియాలంటే, రోమేశ్ వెదుకుతున్న పెన్ డ్రైవ్ తమకి దొరకాలని అంటుంది. ఆ పెన్ డ్రైవ్ లో ఏముంటుంది? అధీర్ హత్యకి కారకులు ఎవరు? అనేది మిగత కథ.
హనీమూన్ ట్రిప్ లో ఉన్న ఒక వ్యక్తి హత్య జరుగుతుంది. అతణ్ణి ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? అనే సందేహాన్ని రేకెత్తిస్తూ కథలో కదలిక మొదలవుతుంది. హత్య చేయబడిన వ్యక్తి భార్య .. అతను మనసు పడిన లేడీ ఫొటోగ్రఫర్ .. భార్య తరఫు వ్యక్తి .. తండ్రి తరఫు వ్యక్తి .. ఈ నలుగురిపై ఆడియన్స్ కి అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఈ విషయంలో ఆడియన్స్ ఎటూ తేల్చుకోలేని విధంగా దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు బాగుంది.
మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్త డల్ గా అనిపించినప్పటికీ, ఆ తరువాత కథ కాస్త పుంజుకుంటుంది. అయితే అది ఆ స్పీడ్ కూడా చాలలేదేమో అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి. ఎవరు హత్య చేశారు? హంతకులు ఎవరు? అనే ఒక గందరగోళం మాత్రం చివరివరకూ ఉంటుంది. ఆ మలుపులు ఆసక్తికరంగాను ఉంటాయి. ఒక వైపున పోలీసుల విచారణ .. మరో వైపున అనుమానితుల కదలికలు కుతూహలాన్ని పెంచుతాయి.
ఈ సిరీస్ కి స్క్రీన్ ప్లే ప్రధానమైన బలమని చెప్పాలి. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ కథకి చాలా హెల్ప్ అయ్యాయి. ఎడిటింగ్ కూడా ఓకే. అనవసరమైన సన్నివేశాలు కనిపించవు. అభ్యంతరకరమైన సన్నివేశాలు ఒకటి రెండు చోట్ల లైట్ గా టచ్ అవుతాయి. 6 ఎపిసోడ్స్ చూసిన తరువాత, కథను ఇంకాస్త స్పీడ్ గా చెబితే బాగుండేదేమోనని అనిపిస్తుంది.