'IC 814 ద కాందహార్ హైజాక్' (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ!
Movie Name: IC 814 The Kandahar Hijack
- ఆగస్టు 29 నుంచి మొదలైన స్ట్రీమింగ్
- 6 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
- 1999లో జరిగిన యధార్థ సంఘటన ఇది
- నిదానంగా వ్యవహరించే పాత్రలు
- కథనంలో కనిపించని స్పీడ్
1999 - డిసెంబర్ 24వ తేదీన కాఠ్మండ్ నుంచి ఢిల్లీకి ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఫ్లైట్ 176 మంది ప్రయాణికులతో బయల్దేరుతుంది. అలా బయల్దేరిన కొంతసేపటికి హైజాక్ చేయబడుతుంది. ఆ యథార్థ సంఘటనను కెప్టెన్ దేవ్ శరణ్ - శ్రిన్జయ్ చౌదరి 'ఫ్లైట్ ఇన్ టు ఫియర్' అనే పేరుతో పుస్తక రూపంలో ఆవిష్కరించారు.
ఆ సంఘటన ఆధారంగానే 'IC 814 ద కాందహార్ హైజాక్' వెబ్ సిరీస్ నిర్మితమైంది. కాఠ్మండ్ లో మొదలైన ఈ కథ వారం రోజుల తరువాత 'కాందహార్'లో ముగుస్తుంది. ఈ వారం రోజుల పాటు ఏం జరిగిందనేది కథ. 6 ఎపిసోడ్స్ గా ఆగస్టు 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కాఠ్మండ్ నుంచి 176 మంది ప్రయాణికులతో 'IC 814' ఫ్లైట్ బయల్దేరుతుంది. శరణ్ దేవ్ (విజయ్ వర్మ) కెప్టెన్ గా ఉన్న ఈ ఫ్లైట్ కి కో పైలెట్ గా అరుణ్ కుమార్ .. ఎయిర్ హోస్టెస్ గా ఇంద్రాణి - ఛాయ ఉంటారు. ఫ్లైట్ అలా కొంతదూరం వెళ్లగానే ఒక్కసారిగా హైజాకర్లు గన్స్ బయటికి తీస్తారు. ఫ్లైట్ ను 'కాబూల్' కి తీసుకెళ్లకపోతే ప్రాణాలు తీస్తామని దేవ్ శరణ్ ను హెచ్చరిస్తారు.
అయితే ఫ్లైట్ లో ఇంధనం తక్కువగా ఉందనీ .. 'కాబూల్' వరకూ వెళ్లలేమని శరణ్ దేవ్ చెబుతాడు. దాంతో ఇంధనం నింపుకోవడం కోసం 'అమృత్ సర్'లో ల్యాండ్ చేయమని హైజాకర్లు చెబుతారు. తాము ప్రయాణిస్తున్న ఫ్లైట్ హైజాక్ చేయబడిందని తెలియగానే ప్రయాణీకులంతా భయంతో బిక్కు బిక్కుమంటూ ఉంటారు. వాళ్లను మరింతగా నియంత్రించడం కోసం హైజాకర్లు ఇద్దరు ప్రయాణీకులను తీవ్రంగా గాయపరుస్తారు.
IC 814 ఫ్లైట్ హైజాక్ చేయబడిందనే విషయం భారత విదేశాంగ శాఖకి .. 'ఐబీ'కీ .. 'రా'కి తెలిసిపోతుంది. దాంతో ఆ శాఖలకు సంబంధించిన అధికారులంతా బయటికి ఈ విషయం తెలియకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫ్లైట్ లో ఓ వీవీఐపీ ఉన్నాడనే విషయం తెలుసుకుని మరింత ఆందోళనకి లోనవుతారు. ఆ సంగతి ఎలాంటి పరిస్థితుల్లోను బయటికి రాకూడదని నిర్ణయించుకుంటారు.
ఫ్లైట్ లో హైజాకర్లు ఐదుగురు ఉన్నారని తెలుసుకుంటారు. 'అమృత్ సర్'లో ఇంధనం కోసం ఫ్లైట్ ల్యాండ్ కాగానే, హైజాకర్లను చుట్టుముట్టడానికి కమెండోలను సిద్ధం చేస్తారు. . అయితే హైజాకర్లకు అనుమానం రావడంతో, ఇంధనం నింపుకోకుండానే ఆ ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటుంది. ఊహించని ఈ పరిణామానికి ప్రభుత్వ ప్రతినిధులు .. రక్షణ సంబంధమైన అధికారులు అయోమయంలో పడతారు.
అమృత్ సర్ నుంచి బయల్దేరిన ఫ్లైట్ గాల్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. దుబాయ్ లో ఇంధనం కొట్టించమని హైజాకర్లు చెప్పడంతో, దేవ్ శరణ్ అక్కడ ల్యాండ్ చేస్తాడు. వచ్చింది హైజాక్ చేయబడిన విమానమని ముందుగానే తెలియడం వలన, స్త్రీలను .. పిల్లలను దింపేస్తేనే ఇంధనం నింపుతామని అక్కడి అధికారులు చెబుతారు. అప్పుడు హైజాకర్లు ఎలా స్పందిస్తారు? వాళ్లు ఎందుకు హైజాక్ చేశారు? వాళ్ల డిమాండ్స్ ఏమిటి? అనే అంశాలతో ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది.
ఇది పాతికేళ్ల క్రితం జరిగిన యథార్థ సంఘటన. ఈ సిరీస్ లో అక్కడక్కడా ఒరిజినల్ పుటేజ్ ను కూడా వాడుతూ వచ్చారు. ఒక ఫ్లైట్ లో .. ఉగ్రవాదులతో కలిసి ప్రయాణీకులు .. సిబ్బంది వారం రోజులపాటు గడపడమనేది, తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటన. ప్రయాణీకులంతా క్షణక్షణం .. భయం .. భయం అన్నట్టుగా బ్రతికే పరిస్థితి. కానీ ప్రయాణీకులలోని భయాన్ని ఆ స్థాయిలో ఆవిష్కరించలేకపోయారు .. ఆడియన్స్ లో ఉత్కంఠను కలిగించలేకపోయారు.
హైజాకర్లు చెప్పినట్టుగా ఫ్లైట్ వెళ్లాలి .. పైగా ఇంధనం అయిపోతుందనే టెన్షన్ ను కూడా ఆశించిన స్థాయిలో పండించలేకపోయారు. ఐదుగురు హైజాకర్లలో ఒకరిద్దరిని మాత్రమే హైలైట్ చేసి మిగతా వాళ్లను రిజిస్టర్ కూడా చేయలేదు. ఇక హైజాకర్లు ఎయిర్ హోస్టెస్ తో మంచిగా ఉండటం .. ప్రయాణీకులతో 'అంత్యాక్షరి' పాడించడం .. సిగరెట్ తాగమని పైలైట్ ను అడగడం వంటికి సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. ఆల్రెడీ హైజాకర్ల పేర్ల విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
హైజాక్ అయిన సంగతి తెలిసిన తరువాత ప్రభుత్వ ప్రతినిధులు .. అధికారులు స్పందించే తీరు కూడా చాలా నింపాదిగా అనిపిస్తుంది. ఎవరిలో ఎలాంటి ఆందోళనగానీ .. ఎలాంటి హడావిడి గాని కనిపించదు. అలాగే తమ బంధువుల కోసం ఎయిర్ పోర్టులో ఆందోళన వ్యక్తంచేసే వారి విజువల్స్ కూడా అవసరమైనంత స్థాయిలో పడలేదు. ఇక టాయ్ లెట్ ను ఎయిర్ హోస్టెస్ క్లీన్ చేయడమనేది చూడలేని సన్నివేశం. ఒకవేళ అది నిజంగానే జరిగినా అంతలా చూపించవలసిన అవసరం లేదు.
ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ ఫరవాలేదు. యథార్థ సంఘటనకి తగినట్టుగా స్క్రిప్ట్ ను డిజైన్ చేసుకున్నారు. అదే ఆర్డర్ లో కథను నిదానంగా చెబుతూ వెళ్లారు. అందువలన ఈ తరహా జోనర్ నుంచి ఆడియన్స్ ఆశించే స్పీడ్ కనిపించలేదు. కంటెంట్ కి తగిన ఎమోషన్స్ .. టెన్షన్ పుట్టించే సన్నివేశాలు పడలేదు. అసలు యాక్షన్ ను టచ్ లేకపోవడం మరో వెలితి. అందువలన అక్కడక్కడా కాస్త సాగతీతగా కనిపిస్తూ, ఫైనల్ గా ఫరవాలేదు అనిపిస్తుందంతే.