ఎన్.ఎస్.జి. కమెండోలు .. అత్యంత సమర్థవంతంగా నిర్వహించే ఆపరేషన్స్ కి సంబంధించిన నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే తెరపైకి వచ్చాయి. సాధారణంగా ఈ తరహా కథలను యాక్షన్ హీరోలు ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఇంకా లవర్ బాయ్ గానే కొనసాగుతోన్న ఆది సాయికుమార్ తొలిసారిగా యాక్షన్ మోడ్ లోకి వెళ్లి చేసిన సినిమా ఇది. యాక్షన్ హీరోగా ఆయన ఎన్ని మార్కులను దక్కించుకున్నాడో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
అర్జున్ పండిట్ (ఆది సాయికుమార్) కశ్మీర్ పండిట్ల కుటుంబంలో జన్మిస్తాడు. చిన్నతనంలోనే పాకిస్థాన్ తీవ్రవాదుల చేతిలో తల్లిదండ్రులు మరణించడాన్ని కళ్లారా చూస్తాడు. ఆ కసితోనే ఆయన ఎన్.ఎస్.జి. కమాండో అవుతాడు. కశ్మీర్ పండిట్ల పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించే ఘాజీబాబా (అబ్బూరి రవి) హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనను బంధిస్తాడు. ఘాజీబాబాకు ప్రత్యేక కోర్టు 'ఉరిశిక్ష'ను విధిస్తుంది. ఉరిశిక్ష నుంచి ఘాజీబాబాను తప్పించి తీసుకెళ్లడానికి ఆయన సహచరుడైన ఫారుక్ (మనోజ్ నందం) 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'ను ఆరంభిస్తాడు. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' అంటే ఏమిటి? అది తెలుసుకున్న అర్జున్ పండిట్ ఏం చేస్తాడు? అనేది కథ.
నిజానికి ఇది చిన్న హీరోతో .. కొత్త విలన్ తో .. తక్కువ బడ్జెట్ లో చేసే కథ కాదు. అయినా సాధ్యమైనంతవరకూ ఎక్కడా లోపం రానీయకుండా చూడటానికి దర్శకుడు అడివి సాయికిరణ్ తనవంతు కృషి చేశాడు. యాక్షన్ సన్నివేశాలను చాలా బాగా తెరకెక్కించాడు. అయితే కథలో వినోదం పాళ్లను యాక్షన్ కి జోడించలేకపోయాడు. హీరోకి జోడీ లేకపోవడం .. ఫీమేల్ లీడ్ రోల్ చేసిన సాషా ఛెత్రీ పాత్రకి ప్రాధాన్యత లేకపోవడం ప్రధానమైన లోపాలుగా కనిపిస్తాయి.
సాధారణంగా యాక్షన్ సినిమా అనగానే, టీనేజ్ అమ్మాయిలు .. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రారు. అందువల్లనేనేమో దర్శకుడు సెకండ్ ట్రాక్ లో కాలేజ్ క్యాంపస్ .. క్లాస్ మేట్స్ అల్లరి .. లవ్ తో కూడిన ఎమోషన్స్ కి కాస్తంత కామెడీని జోడించి సమానంగా నడిపించాడు. అయితే ఆయన ఈ ట్రాక్ ను సరిగ్గా నడిపించకపోవడం వలన, యాక్షన్ సీన్ వస్తేనే బెటర్ అనుకుని .. అది ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూసే పరిస్థితి తలెత్తుతుంది.
ఫస్టు ట్రాక్ లో హీరో .. విలన్ పాత్రలను బాగా డిజైన్ చేసిన ఆయన, సెకండ్ ట్రాక్ లో ఏ పాత్రను సరిగ్గా మలచలేదు. ఎయిర్ టెల్ యాడ్ లో మెరిసిన 'సాషా ఛెత్రీ'ని చూసిన వాళ్లు 'ఈ అమ్మాయిలో భలే స్పార్క్ వుంది' అనుకున్నారు. అలాంటి అమ్మాయి సినిమా మొత్తం కనిపిస్తుంది .. కానీ ప్రేక్షకులకు ఏమీ అనిపించదు. అందుకు కారణం ఆ అమ్మాయి పాత్రలో విషయం లేకపోవడమే. పాటలు .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు లేకపోవడం వలన, బి - సి సెంటర్స్ లో ఈ సినిమాకి అంతగా ఆదరణ లభించకపోవచ్చు.
నటీనటుల విషయానికొస్తే .. అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్ బాగా చేశాడు. మంచి ఫిట్ నెస్ తో ఈ పాత్రలో మెప్పించాడు. ఇక ప్రతినాయకుడిగా రచయిత అబ్బూరి రవి కూడా ఆకట్టుకున్నాడు. ఎంతో అనుభవం వున్నవాడిలా నటించాడు. ఇక ఫారుక్ పాత్రకి న్యాయం చేయడానికి మనోజ్ నందం తనవంతు కృషి చేశాడు. కానీ ఈ పాత్రకి ఆయన వయసు చాలలేదు. అందువలన ఆయన ఓ భయంకరమైన తీవ్రవాది అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. సాషా ఛెత్రీ మరీ బక్క పలచగా వుండి తెరపై ఆనలేదు. ఆ అమ్మాయి కాస్ట్యూమ్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సింది. అనీష్ కురువిల్ల పాత్ర పరిథిలో నటించాడు. రావు రమేశ్ వున్నాడుగానీ .. ఆయన చేయడానికి బలమైన సన్నివేశమే లేదు. ఇక ఎలాంటి ప్రయోజనం లేని కృష్ణుడు పాత్ర పరిస్థితి మరీ దారుణం.
సంగీతం ఓ మాదిరిగా వుంది. రీ రికార్డింగ్ .. ఫొటోగ్రఫీ ఫరవాలేదు. ఎడిటింగ్ విషయానికొస్తే కాలేజ్ ఫ్రెండ్స్ నేపథ్యంలోని సీన్స్ ను చాలా వరకూ ట్రిమ్ చేయవలసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క యాక్షన్ సీన్స్ మినహా ఈ సినిమాలో చెప్పుకోవడానికేం లేదు. అందువలన ఆ వర్గం ప్రేక్షకులకు ఓకే అనిపించవచ్చునేమో.
'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' మూవీ రివ్యూ
| Reviews
Operation Gold Fish Review
ఎంతోమంది కశ్మీర్ పండిట్లను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్ తీవ్రవాది ఘాజీబాబాను, జాతీయ భద్రతా దళానికి చెందిన అర్జున్ పండిట్ బంధిస్తాడు. ఉరిశిక్ష పడిన ఘాజీబాబాను విడిపించుకోవడానికి ఆయన ప్రధాన సహచరుడైన ఫారుక్ 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ను ఆరంభించడంతోనే అసలు కథ మొదలవుతుంది. విస్తృతమైన పరిథి కలిగిన ఈ కథలో, దర్శకుడు యాక్షన్ సన్నివేశాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి మిగతా వాటిని వదిలేశాడు. ఫలితంగా ప్రేక్షకులకు అసహనం కలుగుతుంది .. నిరాశే మిగులుతుంది.
Movie Name: Operation Gold Fish
Release Date: 2019-10-18
Cast: Aadi Sai Kumar, Sasha Chettri, Nithya Naresh,Rao Ramesh, Abburi Ravi, Manoj Nandam, Karthik Raju, Parvateesam
Director: Sai Kiran Adivi
Music: Sri Charan Pakala
Banner: Vinayakudu Talkies
Review By: Peddinti