'హను మాన్' - మూవీ రివ్యూ
Movie Name: Hanu Man
- సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన 'హను మాన్'
- ఆసక్తికరమైన కథాకథనాలు
- ఆకట్టుకునే సన్నివేశాలు
- విజువల్ ఎఫెక్ట్స్ తో కట్టిపడేసిన కంటెంట్
- తేజ సజ్జాకి మరో హిట్ పడినట్టే
సూపర్ హీరో కాన్సెప్ట్ తో గతంలో వచ్చిన 'సూపర్ మేన్' .. 'శక్తిమాన్' వంటి సీరియల్స్ పిల్లలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఆ తరహా కాన్సెప్టుతో తెలుగులో ఈ మధ్య కాలంలో సినిమాలు రాలేదు. మళ్లీ ఇంతకాలానికి అలాంటి ఒక కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. ఆ సినిమానే 'హను మాన్'. తేజ సజ్జా హీరోగా ఆయన రూపొందించిన ఆ సినిమా, మంచి అంచనాల మధ్య ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
'సౌర్యాస్త్ర' ప్రాంతంలో మైఖేల్ ( వినయ్ రాయ్) నివసిస్తూ ఉంటాడు. పదేళ్ల వయసు నుంచే అతనికి సూపర్ హీరో కాన్సెప్టులు అంటే చాలా ఇష్టం. 'సూపర్ మేన్' డ్రెస్ వేసుకునే తిరుగుతూ ఉంటాడు. తల్లిదండ్రులు లేని వారికే సూపర్ హీరోగా శక్తులు వస్తాయని భావించిన అతను, వారి మరణానికి కారకుడవుతాడు. సూపర్ హీరోగా శక్తులను సంపాదించుకోవాలనే ఆలోచన ఆశయంగా మారుతుంది .. వయసుతో పాటే పెరుగుతూ పోతుంది. సిరివెన్నెల (వెన్నెల కిశోర్) అనే సైంటిస్ట్, అతణ్ణి సూపర్ హీరోగా మార్చడానికి తగిన ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.
ఇక అడవిని ఆనుకుని ఉన్న 'అంజనాద్రి' అనే ఓ గిరిజన ప్రాంతంలో హనుమంతు ( తేజ సజ్జా) అతని అక్కయ్య అంజమ్మ ( వరలక్ష్మి శరత్ కుమార్) నివసిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేకపోవడంతో హనుమంతును అంజమ్మనే ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన హనుమంతుకి 'ఉండేల్'తో గురిచూసి కొట్టగల నైపుణ్యం ఉంటుంది. అదే ఆయన ఆయుధం. ఇక అతనికి చేతివాటం ఎక్కువే. అందువలన అందరూ దొంగోడు అనే పిలుస్తుంటారు. అదే గూడానికి చెందిన మీనాక్షి (అమృత అయ్యర్) అంటే అతనికి చాలా ఇష్టం.
ఆ గూడెంలో 'పాలెగాడు' అనే పదవిలో గజపతి (రాజ్ దీపక్ శెట్టి) ఉంటాడు. తన కనుసన్నలలోనే ఆ గూడెం ప్రజలంతా ఉండాలని భావిస్తూ ఉంటాడు. ఆ గూడెంలో అతనిని మించిన వస్తాదు లేకపోవడం వలన, అందరూ కూడా ఆయనకి ఎదురుపడటానికి కూడా భయపడుతూ ఉంటారు. అయితే ఆ గూడెంలో ఉంటూ పట్నంలో చదువుకుంటున్న మీనాక్షి, ఈ కాలంలో పాలెగాళ్లు ఏమిటంటూ, అతని ఉనికిని ప్రశ్నిస్తుంది. దాంతో ఆమెకి తానేమిటనేది చూపించాలని అతను నిర్ణయించుకుంటాడు.
గజపతి మనుషుల నుంచి మీనాక్షిని కాపాడటానికి చేసిన ప్రయత్నంలో హనుమంతు సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో దివ్యమైన వెలుగులు వెదజల్లే ఒక ప్రదేశాన్ని అతను చూస్తాడు. ఆ వెలుగులు వెదజల్లుతున్న ఒక 'మణి'ని తీసుకుని అతను తిరిగి వస్తాడు. ఆ దివ్యమణిపై సూర్యకాంతి పడినప్పుడు .. ఆ వెలుగు తనపై ప్రసరించినప్పుడు తాను మహాబలుడిగా మారిపోవడం అతను గమనిస్తాడు. అలాగే మబ్బులు పట్టినా .. సూర్యాస్తమయమైనా అది పనిచేయదని గ్రహిస్తాడు. ఆ ప్రాంతానికీ .. ఈ కాలానికి సంబంధం లేని ఒక వ్యక్తి, (సముద్రఖని) తనని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడనే సంగతి మాత్త్రం హనుమంతుకి తెలియదు.
ఆ దివ్యమణి వలన వచ్చిన శక్తి కారణంగా, గజపతిని హనుమంతు మట్టి కరిపిస్తాడు. అతనికి అంత ధైర్యం ... అంత బలం ఎలా వచ్చాయో అర్థంకాక అందరూ ఆశ్చర్యపోతారు. హనుమంతుకి వచ్చిన శక్తులను గురించి మైఖేల్ కి తెలుస్తుంది. ఆ శక్తులను పొందాలనే ఆలోచనతో ఆ గ్రామంలో అడుగుపెడతాడు. ఆ గూడెం అభివృద్ధి చేయడానికి వచ్చినట్టుగా అందరినీ నమ్మిస్తాడు. హనుమంతులోని శక్తికి ఆ దివ్యమణి కారణమని తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత హనుమంతు ఎదుర్కునే పరిస్థితులు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన అంశాలతో కథ ముందుకు కదులుతుంది.
ప్రశాంత్ వర్మనే ఈ కథను అందించాడు .. ఈ కథకి దృశ్య రూపాన్ని ఇచ్చాడు. ఈ కథ అంతా కూడా 'అంజనాద్రి' అనే అడవి నేపథ్యంలోనే జరుగుతుంది. ఓ చిన్న గూడెం ... అక్కడి మనుషులు .. వాళ్ల స్వభావాలు .. ఒక అక్కా తమ్ముడు .. వాళ్ల జీవన విధానం .. గూడెంలో హీరో వైపు నుంచి ఎక్కువగా నడిచే చిన్నపాటి ప్రేమకథ. ఆ చిన్న గూడెంపై కూడా పెత్తనం చెలాయించాలనుకునేవాళ్లు .. అక్కడివాళ్లు చాలరన్నట్టుగా పట్నం నుంచి ఊడిపడిన ప్రతినాయకుడు. ఇలాంటి వాతావరణంతో ప్రశాంత్ వర్మ ఆసక్తికరమైన కథను అల్లుకోగలిగాడు.
ఇక 'అంజనాద్రి' ప్రాంతాన్ని డిజైన్ చేయించుకోవడంలో ప్రశాంత్ వర్మ ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఒక వైపున అడవి .. మరో వైపున సముద్రం .. కొండలు .. లోయలు .. జలపాతాలు .. సెలయేళ్లు .. పెద్ద కొండకి ఆనుకుని కొండలో భాగంగానే సహజ సిద్ధంగా కనిపించే హనుమ విగ్రహం .. ఆయననే తమ ఇలవేల్పుగా భావించి పూజించే గూడెం .. వాటిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే, ఆ లోకంలోకి వాళ్లను తీసుకెళ్లడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడు.
హీరో .. హీరోయిన్ .. హీరో అక్కయ్య .. హీరో ఫ్రెండ్ .. గూడానికి చెందిన గజపతి .. అజ్ఞాత వ్యక్తి .. మెయిన్ విలన్ .. అతని దగ్గరుండే సైంటిస్టుగా వెన్నెల కిశోర్ పాత్రలే ఈ కథలో ప్రధానమైనవిగా కనిపిస్తాయి. ప్రతి పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తూ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతాయి. అలాగే ఈ కథలో హనుమంతుడు అంతర్లీనంగా కనిపించేలా దర్శకుడు తీసుకున్న శ్రద్ధ బాగా వర్కౌట్ అయింది. ఇక సందర్భాన్ని బట్టి హనుమ శ్లోకాలు .. స్తోత్రాలు వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో 'అంజనాద్రి'కి సంబంధించిన వీఎఫ్ ఎక్స్ .. ఫారెస్టు ఏరియాను కవర్ చేసిన తీరు .. సముద్ర గర్భానికి సంబంధించిన విజువల్స్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ .. వెన్నెల రాత్రిలో అడవిలో జరిగే ఫైట్ .. దివ్యమణి నేపథ్యంలోని సీన్స్ .. ఈ సినిమాకి హైలైట్ గా అనిపిస్తాయి. ఇక వెన్నెల్లా కిశోర్ .. సత్య కామెడీ చాలా హెల్ప్ అయ్యాయి. నిర్మాణ విలువలు .. సంగీతం .. ఫొటోగ్రఫీ ఈ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునే సినిమాగా 'హను మాన్' కనిపిస్తుంది.