తెలుగు తెరపై కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన కథానాయకుడిగా చిరంజీవి కనిపిస్తాడు. అభిమానులను అలరించడం కోసం ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఒడిసిపట్టే అలుపెరగని విజేతగా అనిపిస్తాడు. కథానాయకుడిగా సుదీర్ఘమైన తన ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన కథాంశాలతో పలకరించిన చిరంజీవి, 'సైరా' అనే దేశభక్తితో కూడిన ఒక భారీ చారిత్రక చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తొలిసారిగా చిరంజీవి చేసిన చారిత్రక చిత్రంగా, ఆయన కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సైరా' ఏ స్థాయిలో మెప్పించిందన్నది ఇప్పుడు చూద్దాం.
కథలోకి వెళితే .. ఆంగ్లేయులు భారతదేశంపై పట్టు సాధించే దిశగా పావులు కదుపుతుంటారు. భారతదేశంలోని మిగతా ప్రాంతాలపై మాదిరిగానే 'రేనాడు' ప్రాంతంపై తమ ఉక్కుపాదాన్ని మోపుతారు. శిస్తు వసూలు విషయంలో అక్కడి రైతులను అనేక విధాలుగా హింసిస్తుంటారు. పాలెగాళ్ల కుటుంబం నుంచే వచ్చిన నర్సింహా రెడ్డి(చిరంజీవి), ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తాడు. రైతుల పక్షాన నిలిచి ఆంగ్లేయ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాడు. ఈ విషయంలో గురువైన గోసాయి వెంకన్న (అమితాబ్) ఆయనకి అండగా నిలుస్తాడు.
ఈ క్రమంలోనే నాట్యగత్తె అయిన లక్ష్మి(తమన్నా)పై నరసింహా రెడ్డి మనసు పారేసుకుంటాడు. తనకి చిన్నతనంలోనే సిద్ధమ్మ (నయనతార)తో వివాహం జరిగిందనే విషయం ఆయనకి ఆ సమయంలోనే తెలుస్తుంది. నరసింహా రెడ్డి కోరిక మేరకు ఊరూరా తిరుగుతూ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చడం కోసం లక్ష్మి నడుం బిగిస్తుంది. ఆయన పోరాటానికి తాను అడ్డు కాకూడదనే ఉద్దేశంతో సిద్ధమ్మ పక్కకి తప్పుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నరసింహా రెడ్డిని అంతం చేయడానికి ఆంగ్లేయ ప్రభుత్వం అష్ట దిగ్బంధనం చేస్తూ ముందుకు కదులుతుంది. తనకి అండగా నిలిచిన అతికొద్ది మంది వీరులతో ఆంగ్లేయ సైనికులను నరసింహ రెడ్డి ఎలా ఎదుర్కున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.
దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంతవరకూ యువ కథానాయకులతో యూత్ ను ఆకట్టుకునే సినిమాలనే ఎక్కువగా తెరకెక్కిస్తూ వచ్చాడు. అలాంటి ఆయన 150 సినిమాలు చేసిన చిరంజీవితో ఒక భారీ చారిత్రక చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేయగలడు? అనే సందేహం చాలామందికి కలిగింది. ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఆయన ఈ సినిమాను చాలా గొప్పగా ఆవిష్కరించాడు. ఈ సినిమాకి ప్రధమ లక్షణంగా భారీతనం .. ప్రధాన లక్షణంగా భారీతారాగణం వుండేలా ఆయన చూసుకున్నాడు. కథను మరింత ఇంట్రెస్టింగ్ గా చెప్పాలనే ఉద్దేశంతో ఝాన్సీ లక్ష్మీబాయి ఎపిసోడ్ నుంచి ఆయన ఎత్తుకున్నాడు. చిరంజీవి ఎంట్రీ ఇచ్చే జాతర సీన్ చిత్రీకరణతోనే సురేందర్ రెడ్డి తన సత్తా చాటుకున్నాడు. ఆంగ్లేయులపై అంచలంచెలుగా నరసింహా రెడ్డి విజయాలను సాధిస్తూ వచ్చిన తీరును బాగా చూపించాడు.
చిరంజీవి .. నయనతార .. తమన్నా పాత్రలను అయన అద్భుతంగా డిజైన్ చేశాడు. ఈ మూడు పాత్రల మధ్య ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకుల మనసులను భారం చేశాడు. ఇక ఆంగ్లేయులపై నరసింహా రెడ్డి తిరుగుబాటు సన్నివేశాలను .. ఆంగ్లేయ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కునే సన్నివేశాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు. అయితే ఈ కథను ఝాన్సీ లక్ష్మీబాయి(అనుష్క)తో చెప్పించడమనేది అసలు కథకి కాస్తంత అంతరాయం కిందే అనిపిస్తుంది. ఇక ఆంగ్లేయ అధికారులు నరసింహా రెడ్డి భార్యా బిడ్డలను అపహరించి తీసుకెళ్లగా, ఆంగ్లేయ అధికారులను నరసింహా రెడ్డి ఎదిరించి భార్య బిడ్డలను బయటికి తీసుకురావడమనే ఎపిసోడ్ ను ప్రేక్షకులు ఒక రేంజ్ లో ఊహించుకుంటారు. కానీ చాలా సింపుల్ గా ఆ సీన్ ను తేల్చేశాడు.
ఇక సాధ్యమైనంత త్వరగా అసలు కథలోకి వెళ్లాలనే ఉద్దేశం కారణంగా ఆరంభంలో కథలో హడావిడి కనిపిస్తుంది. నరసింహా రెడ్డి తల్లిదండ్రులు .. ఆయన సోదరులు .. ఆయన కాలంలో ఆ ప్రాంతంలో అరాచకత్వానికి పాల్పడిన ఆంగ్లేయ అధికారుల పేర్లు ప్రేక్షకులకు గుర్తుండేలా చేయలేకపోయాడు. అలాగే జగపతిబాబు పాత్రను ఇంకాస్త పవర్ఫుల్ గా చూపిస్తే బాగుండేదేనని అనిపిస్తుంది. కథ .. కథనం .. పాటలు .. నేపథ్య సంగీతం విషయంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధను అభినందించవలసిందే. సంభాషణలు ఇంకాస్త పదునుగా వుండేల చూసుకుంటే బాగుండేది. మొత్తానికి ఫస్టాఫ్ ను ఉత్కంఠభరితంగా .. సెకండాఫ్ ను ఉద్వేగపూరితంగా నడిపించడంలో ఆయన సఫలీకృతుడయ్యాడు.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. 250 కోట్లకి పైగా ఖర్చుతో ఆయన ఈ సినిమాను నిర్మించాడు. మొదటి నుంచి చివరివరకూ సినిమాలో ఏ సన్నివేశంలోను ఖర్చు విషయంలో రాజీ పడినట్టుగా కనిపించదు. భారీ సెట్టింగ్స్ .. వందలమంది జూనియర్ ఆర్టిస్టులతో ఆయన ఈ సినిమాకి భారీ తనాన్ని తీసుకొచ్చాడు. వీఎఫెక్స్ విషయంలోను ప్రత్యేక దృష్టిపెట్టి ఈ సినిమాకి అదనపు బలం చేకూరడానికి ఆయన చేసిన కృషి ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది.
'సైరా'లో నరసింహా రెడ్డి పాత్ర తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని చిరంజీవి ఒక వేదికపై చెప్పారు. ఆయన చెప్పిన మాట అక్షరాలా నిజమనేది ఈ సినిమా చూసిన తరువాత స్పష్టమవుతుంది. ఈ పాత్రలో చిరంజీవి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ లోను .. దేశభక్తిని తట్టిలేపే సంభాషణలతోను తనకి తిరుగులేదని ఆయన మరోమారు నిరూపించుకున్నాడు. సిద్ధమ్మ పాత్రకి నయనతార నిండుదనాన్ని తీసుకొచ్చింది. సున్నితమైన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించింది. లక్ష్మీ పాత్రలో తమన్నా కొత్తగా కనిపించింది. నాట్యగత్తెగా .. నరసింహా రెడ్డికి మనసిచ్చి ఆయన ఆశయ సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన యువతిగా ఆమె తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. నరసింహారెడ్డి గురువుగా అమితాబ్ ఆ పాత్రకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆంగ్లేయ అధికారిగా చేసిన అలెక్స్ ఓ నెల్ తో పాటు జగపతిబాబు .. సుదీప్ .. విజయ్ సేతుపతి .. రవికిషన్ .. నాజర్ .. రఘుబాబు .. ముఖేశ్ రుషి తమ తమ పాత్రల పరిథిలో నటించారు.
అమిత్ త్రివేది అందించిన బాణీలు బాగున్నాయి. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన 'జాగో నరసింహా' .. 'పవిత్రభారత' పాటలు కథలోకి ప్రేక్షకులను లాక్కెళ్లి ఆ ఉద్యమంలో భాగస్వాములను చేస్తాయి. జూలియస్ పాకియం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టేసింది. అయితే కొన్ని చోట్ల డైలాగ్స్ ను డామినేట్ చేసేసింది. ఇక రత్నవేలు ఫొటోగ్రఫీ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. ప్రతి దృశ్యాన్ని ఆయన అద్భుతంగా ఆవిష్కరించాడు. యాక్షన్ సీన్స్ ను .. నైట్ ఎఫెక్ట్ సీన్స్ ను .. యుద్ధ సన్నివేశాలను తెరపై ఆయన ఆవిష్కరించిన తీరు విస్మయులను చేస్తుంది. శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. అనవసరమైన సన్నివేశాలేం కనిపించవు.
ఇక కాస్ట్యూమ్స్ డిజైన్ విషయంలో సుస్మిత కొణిదెలకి .. ఉత్తర మీనన్ కి మంచి మార్కులు పడతాయి. నయనతార .. నరసింహా రెడ్డి భార్య అనే విషయం తెలియక, 'యుద్ధానికి వీరుడిని పంపించు' అని ఆమెతో తమన్నా అంటే, 'నేను నాయకుడినే పంపించాను' అని నయనతార చెప్పే డైలాగ్ ఈ సినిమాకి హైలైట్. బలమైన కథా కథనాలు .. దర్శకుడి పనితనం .. కథావస్తువుకి తగిన భారీతనం .. ప్రధానమైన పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. సందర్భోచితమైన సందేశంతో కూడిన పాటలు .. అద్భుతమైన చిత్రీకరణ .. అందమైన లొకేషన్లు .. ఆకట్టుకునే కాస్ట్యూమ్స్ డిజైనింగ్ .. భారీ సెట్స్ .. విస్మయులను చేసే నిర్మాణ విలువలు 'సైరా నరసింహారెడ్డి' సినిమాను మరోస్థాయికి తీసుకెళతాయి. చిరంజీవి తొలిసారిగా చేసిన ఈ చారిత్రక చిత్రం మెగా అభిమానుల అంచనాలను అందుకుంటుందనే చెప్పొచ్చు.
'సైరా నరసింహా రెడ్డి' మూవీ రివ్యూ
| Reviews
Syeraa Review
భారతావని స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకున్న తొలి పోరాట యోధుడి కథ ఇది. ఉడుకు నెత్తురుతో ఉప్పెనలా ఆంగ్లేయులపై విరుచుకుపడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఇది. దేశమాత సంకెళ్లను తెంచడం కోసం తనని తాను సమిధగా సమర్పించుకున్న అమరవీరుని ఆదర్శ చరిత్రగా 'సైరా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బలమైన కథాకథనాలకు భారీతనాన్ని జోడించి అందించిన ఈ చిత్రం, చిరంజీవి కెరియర్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుందనే చెప్పాలి.
Movie Name: Syeraa
Release Date: 2019-10-02
Cast: Chiranjeevi, Amithabh, Nayanatara, Thamannah, Alexxo'Nell, Jagapathi Babu, Vijay Sethupathi,Sudeep,Ravikishan
Director: Surendar Reddy
Music: Amit Trivedi
Banner: Konidela Productions
Review By: Peddinti