స్వార్థపరులైన రాజకీయ నాయకుల వలన .. వాళ్లకి సహకరించే అవినీతి అధికారుల వలన సామాన్యులు అనేక కష్టనష్టాలను ఎదుర్కుంటున్నారు. ఈ కథాంశంతో గతంలో చాలానే సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. తాజాగా అదే తరహా కథాంశంతో దర్శకుడు కేవీ ఆనంద్ ఒక సినిమాను రూపొందించాడు. తమిళంలో 'కాప్పాన్' పేరుతోను .. తెలుగులో 'బందోబస్త్' టైటిల్ తోను ఈ సినిమా విడుదలైంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథగా చూస్తే .. భారత ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) ఎంతో నిజాయితీపరుడు. ఆయన ఒక్కగానొక్క కొడుకు అభిలాష్ (ఆర్య) తండ్రితో కూడా ఉంటూ ఉంటాడు. అంతా సుఖసంతోషాలతో ఉండాలనే దిశగా చంద్రకాంత్ వర్మ పాలన సాగుతుంటుంది. దేశ ప్రజలకి హాని చేసే ఏ పనికి ఆయన అంగీకరించడు. ఈ విషయంలో పారిశ్రామికవేత్త అయిన మహాదేవ్ (బొమన్ ఇరాని)ని కూడా ఆయన లెక్కచేయడు. ఆయనకి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా రవికిశోర్ (సూర్య) ఉంటాడు. ఒక వైపున ఆయన తన డ్యూటీని సిన్సియర్ గా చేస్తూనే, మరో వైపున అంజలి (సాయేషా సైగల్)తో ప్రేమలో ఉంటాడు. ఒకసారి కాశ్మీర్ పర్యటనకి వెళ్లిన ప్రధాని అక్కడ జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ లో చనిపోతాడు. ఆయన హత్యలో రంజిత్ (చిరాగ్ జాని) కీలకమైన పాత్రను పోషిస్తాడు. రంజిత్ ఎవరు? ప్రధానిని అతను ఎందుకు టార్గెట్ చేశాడు? అతని సవాల్ ను రవికిశోర్ ఎలా ఎదుర్కొంటాడు? అనే మలుపులతో మిగతా కథ నడుస్తుంది.
తమిళ దర్శకులలో కేవీ ఆనంద్ కి మంచి పేరుంది. పారిశ్రామికవేత్తల్లోని స్వార్థం .. అధికారుల్లోని అవినీతి దేశానికి ఏ స్థాయిలో హాని చేస్తాయి? వాళ్ల వలన కొంతమంది నిజాయితీగల అధికారులకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే విషయాన్ని కథగా తయారు చేసుకుని ఆయన ఈ సినిమాను రూపొందించాడు. కథలో మంచి సందేశం వుంది .. కానీ ఆ కథకు ఆయన ఎమోషన్ ను .. రొమాన్స్ ను .. కామెడీని జోడించలేకపోయాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను ఆయన చాలా బాగా తెరకెక్కించాడు .. కానీ అలాంటి ఎపిసోడ్స్ కి మధ్య నడిచే కథ నత్త నడకను గుర్తుచేస్తుంది.
కాశ్మీర్ లోను .. లండన్ లోను చిత్రీకరించిన సన్నివేశాల్లో భారీతనం కనిపిస్తుంది గానీ, ఇంట్రెస్టింగ్ గా మాత్రం అనిపించవు. పంట పొలాల పైకి మిడతల దండును వదిలే సీన్ ను .. ఆ తరువాత అదే ప్రయత్నం చేయబోగా హీరో వాటిని నాశనం చేసే సీన్ ను తెరపై చాలా బాగా ఆవిష్కరించాడు. మోహన్ లాల్ .. సూర్య .. బొమన్ ఇరాని .. చిరాగ్ జానీ పాత్రలను మాత్రమే ఆయన ఆసక్తికరంగా మలిచారు. ఆర్య .. సాయేషా సైగల్ .. నాగినీడు పాత్రల విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా కనిపించదు. తొలి సన్నివేశమే గందరగోళంతో మొదలవుతుంది. అసలు ఏం జరుగుతుందనే విషయం ప్రేక్షకులకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. సీరియస్ గా సాగే కథ మధ్యలో సిల్లీ సీన్స్ మరో మైనస్ గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ .. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు పేలవంగా సాగుతాయి.
నటీనటుల విషయానికొస్తే .. ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యంలో జీవించే రైతుగా, ప్రధాని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా సూర్య వైవిధ్యభరితమైన నటనను కనబరిచాడు. వేషధారణలోను .. డైలాగ్ డెలివరీలోను కొత్తదనాన్ని చూపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో తన మార్కుతో రెచ్చిపోయాడు. ఇక ప్రధాని పాత్రలో మోహన్ లాల్ ఎంతో హుందాగా కనిపించారు .. ఆ పాత్రకి నిండుదనాన్ని తెచ్చారు. డబ్బింగ్ కూడా ఆయన పాత్రకి కరెక్టుగా సెట్ అయింది. ఇక ప్రధాని కొడుకుగా ఆర్య పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేదు. ఈ కారణంగా సీరియస్ సీన్స్ కూడా తేలిపోతుంటాయి. ఇక సాయేషా సైగల్ చాలా అందంగా కనిపించింది. ఆమె పాత్రలో హడావిడే తప్ప విషయం ఉండదు. అసలు ఆమె ఏం చేస్తుందనే విషయంలో క్లారీటీ రాదు. స్వార్థపరుడైన పారిశ్రామికవేత్తగా బొమన్ ఇరాని తనదైన శైలిని ఆవిష్కరించాడు. సూర్యను సవాల్ చేసే రంజిత్ పాత్రలో చిరాగ్ జాని తన నటనతో మెప్పించాడు.
సంగీతం పరంగా చూసుకుంటే హారీస్ జైరాజ్ బాణీలు హడావిడి చేస్తాయేగానీ ఆకట్టుకోవు. రీ రికార్డింగ్ మాత్రం బాగుంది. యాక్షన్ సన్నివేశాలకి రీ రికార్డింగ్ మరింత బలాన్నిచ్చింది. ప్రభు అందించిన ఫొటోగ్రఫీ బాగుంది. లండన్ .. కాశ్మీర్ సీన్స్ .. యాక్షన్ ఎపిసోడ్స్ ను ఆయన చాలా ఇంట్రెస్టింగ్ గా చిత్రీకరించాడు. ఆంటోని ఎడిటింగ్ కొంత నిరాశ పరిచేదిగానే అనిపిస్తుంది. సూర్యకి సంబంధించి గ్రామీణ నేపథ్యంలో వచ్చే సీన్స్ .. ఆర్య తాగేసి కారు డ్రైవ్ చేసినప్పుడు జరిగే ఎటాక్ సీన్ .. పూర్ణ బర్త్ డే సీన్ .. రైతుల ఆందోళనకి సంబంధించిన సీన్స్ .. ఇలా ట్రిమ్ చేయాల్సిన సీన్స్ చాలానే కనిపిస్తాయి. లవ్ వున్నా రొమాన్స్ లేదు .. పాటలున్నా వాటిలో పస లేదు. సందేశం వున్నా సాగతీత ఎక్కువ. కామెడీ సీన్స్ గానీ .. కదిలించే అంశాలు గాని లేని ఈ సినిమా, యాక్షన్ సినిమాలను ఇష్టపడే కొందరికి మాత్రమే నచ్చచ్చు.
'బందోబస్త్' మూవీ రివ్యూ
| Reviews
Bandobast Review
ఒక పారిశ్రామిక వేత్త దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిమంతుడవుతాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప జేయడం కోసం ప్రకృతికి .. ప్రజలకు నష్టాన్ని కలిగించడానికి కూడా వెనుకాడడు. ఈ విషయంలో ఆయన ప్రధానిని సైతం ఎదిరించే స్థాయికి చేరుకుంటాడు. అప్పుడు ప్రధాని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న రవికిశోర్ ఏం చేశాడనేదే కథ. వినోదానికి దూరంగా చాలా నీరసంగా నడిచే ఈ కథ, అక్కడక్కడ మాత్రమే ఆకట్టుకుంటుంది .. అదీ యాక్షన్ సినిమాల ప్రేమికులను మాత్రమే.
Movie Name: Bandobast
Release Date: 2019-09-20
Cast: Surya, Sayesha Saigal, Mohanlal, Arya, Boman Irani, Chirag Jani, Samuthirakani, Poorna
Director: K.V.Anand
Music: Harris Jayaraj
Banner: Lyca Productions
Review By: Peddinti