సంపూర్ణేశ్ బాబుకి యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఆయన కామెడీని ఇష్టపడే అభిమానులు పెద్ద సంఖ్యలోనే వున్నారు. అయితే తన తాజా చిత్రంగా ఆయన చేసిన 'కొబ్బరి మట్ట' కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ, ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆయన మూడు వైవిధ్యభరితమైన పాత్రలను పోషించాడు. ఈ మూడు పాత్రల్లో ఆయన ఏ స్థాయి సందడి చేశాడో, తన సినిమా కోసం వెయిట్ చేస్తోన్న అభిమానులను ఏ మేరకు అలరించాడో చూద్దాం.
'దువ్వ' గ్రామానికి పెద్ద దిక్కు పాపారాయుడు (సంపూ). ఆయన తీర్పు అక్కడి ప్రజలకు వేదవాక్కు. అడిగినవారి కోసం అవతలివారిని మర్డర్ చేసే మంచితనం ఆయన సొంతం. అలా ఒక వ్యక్తిని మర్డర్ చేసి ఆ వ్యక్తి కొడుకు చేతిలో తాను ప్రాణాలు కోల్పోతాడు. ప్రాణాలు వదిలేస్తూ .. పెద్ద కొడుకైన 'పెదరాయుడు' (సంపూ)ను పిలిచి, తమ్ముళ్లను .. చెల్లెళ్లను బిడ్డలుగా చూసుకోమని చెబుతాడు. అప్పటి నుంచి పెదరాయుడు వాళ్లను బిడ్డలుగానే భావిస్తూ పెంచి పెద్ద చేస్తాడు. వాళ్ల ఆలనా పాలన చూసుకోవడం కోసమని చెప్పి మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడు. అయితే ఒకానొక సందర్భంలో తమ్ముళ్లు .. చెల్లెళ్లు అంతా పెదరాయుడి తీరును తప్పుబడతారు. పనిమనిషి 'పండు'(షకీలా)కి పెదరాయుడు పోలికలతో పుట్టిన ఆండ్రాయుడు (సంపూ) కూడా అదే సమయంలో పట్నం నుంచి వస్తాడు. తనకి కూడా ఆస్తిని పంచాలని ఆయనని రచ్చబండకు లాగుతాడు. ఫలితంగా చోటుచేసుకునే పర్యవసానాలేమిటనేది తెరపైనే చూడాలి.
దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ ప్రేక్షకులను నవ్వించడమే ప్రధానంగా ఈ కథను తయారు చేసుకున్నాడు. కథలో ఆండ్రాయుడు పాత్ర ఈ జనరేషన్ కి తగినట్టుగా వచ్చి జాయిన్ అయినప్పటికీ, దర్శకుడు 'పెదరాయుడు' సినిమానే స్ఫూర్తిగా తీసుకుని సన్నివేశాలను అల్లుకున్నాడు. పెదరాయుడులోని కొన్ని సన్నివేశాలను సంపూ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్చేసి .. ఆ తరహాలో కామెడీ డైలాగ్స్ ను చెప్పించాడు .. హావభావాలను రాబట్టాడు. పాపారాయుడు .. పెదరాయుడు .. ఆండ్రాయుడు అనే మూడు వయసుల్లోని పాత్రల్లో సంపూ పాత్రను చాలా బాగా డిజైన్ చేశాడు. పాటల్లోను సంపూ మార్క్ కామెడీ మిస్ కాకుండా చూసుకున్నాడు. కాకపోతే ఈ మూడు గెటప్పులు .. కాస్ట్యూమ్స్ విషయంలో మరికాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.
దర్శకుడు తరువాత ఎక్కువ మార్కులు స్టీవెన్ శంకర్ కి పడతాయి. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశానికి ఆయన రాసిన సంభాషణలు నవ్వుల పువ్వులు పూయించాయి. స్త్రీ గొప్పతనం గురించి .. పురుషుడు గొప్పతనం గురించి .. నాన్న గొప్పతనం గురించి ఆయన రాసిన మాటలు కడుపుబ్బా నవ్విస్తాయి. 'పెదరాయుడు' పెద్ద తమ్ముడి ఫస్టునైట్ సీన్ కి ఆయన రాసిన మాటలు పడి పడి నవ్వుకునేలా చేస్తాయి.
ఇక హాస్య నటుడిగా సంపూర్ణేశ్ బాబు ఈ సినిమాలో మూడు పాత్రల్లోను నాన్ స్టాప్ గా నవ్వించాడు. ఈ మూడు పాత్రల్లోను వైవిధ్యభరితమైన నటనను కనబరిచాడు. 'పెదరాయుడు'లో మోహన్ బాబు తరహా డైలాగ్ ను .. 'దానవీరశూరకర్ణ'లో 'ఏమంటివి .. ఏమంటివి' తరహా డైలాగ్ ను సంపూ కామెడీగా చెబుతుంటే విజిల్స్ పడ్డాయి. ఇక శివలింగం దగ్గర ఆయన డాన్స్ చేసి ఆ 'చమట'తో జనం దాహం తీర్చే సీన్ కూడా బాగా నవ్విస్తుంది. 'అ ఆ' పాటలో స్టెప్స్ తోను ఆయన అదరగొట్టేశాడు. ఇక షకీలా .. కత్తి మహేశ్ కూడా పాత్ర పరిధిలో బాగానే చేశారు.
సంగీతం .. రీ రికార్డింగ్ .. కెమెరా పనితనం .. ఎడిటింగ్ పనితీరు ఫరవాలేదనిపించే విధంగా వున్నాయి. నిర్మాణ పరమైన విషయాల్లో నాణ్యత .. కాస్ట్యూమ్స్ విషయంలోను .. లొకేషన్స్ విషయంలోను శ్రద్ధ చూపించి వుంటే ఈ సినిమా మరో మెట్టు పైన ఉండేది. అలాగే సంపూ భార్యల పాత్రల్లో కొంచెం తెలిసిన ఆర్టిస్టులను పెడితే బాగుండేది. కొంచెం ఆలస్యమైనా, తన అభిమానులను ఉత్సాహపరిచే సినిమానే సంపూ చేశాడని చెప్పొచ్చు. సరదాగా నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నమే గనుక, లాజిక్కులు పక్కన పెట్టేస్తే కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు.
'కొబ్బరి మట్ట' మూవీ రివ్యూ
| Reviews
Kobbari Matta Review
కామెడీ సన్నివేశాలతో కూర్చిన కథగా 'కొబ్బరి మట్ట' కనిపిస్తుంది. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్రలలో సంపూ చేసిన హాస్య విన్యాసంగా అనిపిస్తుంది .. మొదటి నుంచి చివరివరకూ నవ్విస్తుంది.
Movie Name: Kobbari Matta
Release Date: 2019-08-10
Cast: Sampoornesh Babu, Ishika singh, Shakeela, Katthi Mahesh,
Director: Rupak Ronaldson
Music: Syed kamran
Banner: Amrutha Productions
Review By: Peddinti