విజయ్ హీరోగా 'వారసుడు' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. నిర్మాతగా దిల్ రాజు .. దర్శకుడిగా వంశీ పైడిపల్లి ఇద్దరూ కూడా తమ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. వారి గత చిత్రాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అలాంటి జోనర్లోనే విజయ్ హీరోగా వారు చేసిన 'వరిసు' సినిమా ఈ నెల 11వ తేదీన తమిళనాట విడుదలైంది. తెలుగు ప్రేక్షకులను 'వారసుడు' పేరుతో ఈ రోజున పలకరించింది.
కథలోకి వెళితే .. రాజేంద్రన్ (శరత్ కుమార్ ) పెద్ద బిజినెస్ మేన్. ఆయన భార్య సుధ (జయసుధ). వారి సంతానమే జై (శ్రీకాంత్) అజయ్ (కిక్ శ్యామ్) విజయ్ (విజయ్). జై .. అజయ్ ఇద్దరికీ పెళ్లి అయినప్పటికీ ఉమ్మడి కుటుంబాగానే ఉంటూ ఉంటారు. జై .. అజయ్ ఇద్దరూ కూడా వ్యాపార వ్యవహారాల్లో తండ్రికి సహకరిస్తూ ఉంటారు. జీవితమంటే నాలుగు గోడల మధ్య బ్రతకడం కాదు .. నలుగురి మధ్యలో బ్రతకడం అనేది విజయ్ ఉద్దేశం. అందువలన తాను బిజినెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటూ ఉంటాడు.
ఒకసారి తండ్రీకి .. విజయ్ కి మధ్య మాటా మాట పెరుగుతుంది. దాంతో తన ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపొమ్మని తండ్రి అనడంతో విజయ్ ఆ ఇంటికి దూరంగా వెళ్లిపోతాడు. అయితే తన భర్తకి తెలియకుండా విజయ్ కి కాల్ చేసి సుధ మాట్లాడుతూనే ఉంటుంది. ఇక బిజినెస్ లో రాజేంద్రన్ కి జయప్రకాశ్ (ప్రకాశ్ రాజ్) ప్రధాన శత్రువు. ఎప్పటికప్పుడు అతణ్ణి ఎదుర్కుంటూ వస్తున్న రాజేంద్రన్ 'కేన్సర్' బారిన పడతాడు. మారో 6 నెలలలో తాను చనిపోతాననే విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెడతాడు.
ఇక సాధ్యమైనంత త్వరగా తన ఇద్దరు కొడుకుల్లో 'వారసుడు' ఎవరో ప్రకటించాలని ఆయన నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలోనే రాజేంద్రన్ - సుధ షష్ఠిపూర్తి వేడుక జరుగుతుంది. తల్లి మాట కాదనలేక ఏడేళ్ల తరువాత విజయ్ కూడా వస్తాడు. ఆ ఫంక్షన్ లోనే పెద్ద కొడుకు .. రెండో కొడుకు బలహీనతలు ఏమిటనేది రాజేంద్రన్ కి అర్థమవుతుంది. తన తరువాత తన భార్యను ఎవరు బాగా చూసుకుంటారనేది కూడా తెలిసిపోతుంది. దాంతో విజయ్ ను తన వారసుడిగా ప్రకటిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేవే కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు.
తమిళనాట మాస్ హీరోగా విజయ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అలాంటి విజయ్ తో వంశీ పైడిపల్లి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేయించాడు. విజయ్ లోని మాస్ యాంగిల్ ను ఫ్యాన్స్ మిస్సవ్వకుండా ఫైట్స్ లోను .. డాన్సులలోను చూపించాడు. విజయ్ రేంజ్ కీ .. క్రేజ్ కి తగినట్టుగా ఎక్కడా భారీతనం తగ్గకుండా చూసుకున్నాడు. కథలో హీరో శ్రీమంతుల కుటుంబానికి చెందినవాడు .. పైగా ఉమ్మడి కుటుంబం. అందుకోసం వంశీ పైడిపల్లి ఎంచుకున్న ఇల్లు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటి అని చెప్పచ్చు.
వంశీ పైడిపల్లి తయారు చేసుకున్న ఈ కథలో కొత్తదనమనేది కనిపించదు. ఓ తండ్రి తన కొడుకుల్లో ఒకరిని పక్కన పెట్టడం .. ఆ తరువాత ఆ కుటుంబ సభ్యులు దారితప్పడం .. చెల్లా చెదురైపోయిన ఆ కుటుంబాన్ని మళ్లీ హీరోనే వచ్చి ఒక గాడిలో పెట్టడం .. ఆ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టటడం అనే అంశాలతో ఇంతకుముందు చాలానే కథలు వచ్చాయి. అందువలన కథా పరంగా కొత్తగా ఏమీ కనిపించదు.
ఇక కథనం విషయానికి వస్తే .. అందులో కూడా 'ఔరా' అనిపించేంత విషయం లేదు. నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ప్రేక్షకులు గెస్ చేస్తూనే ఉంటారు .. దానికి దగ్గరగానే తెరపై కథ జరుగుతూ ఉంటుంది. ఇక స్క్రీన్ ప్లేలో పెద్ద లోపంగా కనిపించేది రష్మిక ఎంట్రీ. కథ మొదలైన 45 నిమిషాలకు ఆమె ఎంట్రీ ఇస్తుంది. అది కూడా విజయ్ వదినకి చెల్లెలుగా. అక్కను కలవడానికి చాలా సాధారణంగా వస్తుంది. ఆ మాత్రం ఎంట్రీకి అంతసేపు ఎందుకు వెయిట్ చేయించారనేది అర్థం కాదు.
కథలో ప్రభు .. సుమన్ ఇద్దరూ కూడా చాలా చిన్న పాత్రల్లో కనిపిస్తారు. అంత చిన్న పాత్రలకి వాళ్లు ఒప్పుకోవడం కూడా ఆశ్చర్యమే. ఇక విజయ్ ను తండ్రి వారసుడిగా ప్రకటించడం అన్ని టీవీల్లోను వస్తుంది. ఆ తరువాత అతణ్ణి చైర్మన్ సీట్లో చూసి అన్నయ్యలు ఆశ్చర్యపోవడం చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతారు. ఇలా ఒకటి రెండు అంశాలు తప్పించి వంశీ పైడిపల్లి ఈ కథను చాలా నీట్ గా .. గ్రాండ్ గా తెరపై నడిపించాడు.
విజయ్ పాత్రతో యాక్షన్ ను .. శరత్ కుమార్ - జయసుధ పాత్రల ద్వారా ఎమోషన్ ను .. యోగిబాబు పాత్ర ద్వారా కామెడీని వర్కౌట్ చేశాడు. అంతేకాకుండా కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఓటింగ్ సమయంలో కామెడీ ఎపిసోడ్ .. అన్న కూతురును రౌడీల భారీ నుంచి విజయ్ కాపాడి తీసుకొచ్చే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయి. విజయ్ .. ప్రకాశ్ రాజ్ .. శరత్ కుమార్ .. జయసుధ నటన ఈ సినిమాకి హైలైట్. విజయ్ హెయిర్ స్టైల్ విషయంలో కాస్త శ్రద్ధపెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
ఇక రష్మిక తెరపై కనిపించింది చాలా తక్కువ సేపు .. ఆమె అంత గ్లామర్ గా కనిపించకపోవడం అభిమానులకు అసంతృప్తిని కలిగిస్తుంది. విజయ్ - యోగిబాబు కాంబినేషన్లోని సున్నితమైన కామెడీ కూల్ గా నవ్విస్తుంది. తమన్ బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయి. విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్ .. విజయ్ బిల్డప్ సాంగ్ .. రష్మిక కాంబినేషన్లోని రెండు పాటలు .. మదర్ సింటిమెంట్ సాంగ్ అన్నీ కూడా బాగున్నాయి. 'అమ్మ' పాట .. రంజితమే సాంగ్ హైలైట్.
ఇంకా కార్తీక్ పళని ఫొటోగ్రఫీ చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ కి ఆయన రిచ్ నెస్ తీసుకొచ్చాడు. బ్యూటిఫుల్ సెట్స్ లోని కలర్ ఫుల్ సాంగ్స్ ను అద్భుతంగా ఆవిష్కరించాడు. రాజు సుందరం .. శోభి .. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సంభాషణలు కూడా సున్నితంగా మనసును తాకుతాయి. 'ఒక ఇంట్లో డైనింగ్ టేబుల్ చూసి ఆ ఇంటి జాతకం చెప్పచ్చు' .. 'ప్రపంచాన్ని గెలవాలనుకున్నాను .. కానీ ఇంట్లోనే ఓడిపోయాను ' .. 'జరిగింది మనల్ని మార్చాలి ... జరగబోయేది మనం మార్చాలి' .. వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి.
వ్యాపారంలో పోటీలు .. పక్కదారి పట్టించే బలహీనతలు .. ముక్కలైపోయిన ఫ్యామిలీని హీరో అతికించుకుంటూ రావడం వంటి కథలు ఇంతకుముందు చూసినవే. అలాగే తల్లీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో నడిచిన కథలను కూడా చూశాము. అయినా ఈ కథను ఫాలో అవుతాము .. అందుకు కారణం విజయ్ చేసిన మేజిక్. ఎక్కడా తగ్గని నిర్మాణ పరమైన విలువలు .. వంశీ పైడిపల్లి టేకింగ్. ఫ్యామిలీ ఎమోషన్స్ తో సంక్రాంతి పండగకి దగ్గరగా ఉండే కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, ఎంతవరకూ వారికి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.
మూవీ రివ్యూ: 'వారసుడు'
| Reviews
Varasudu Review
ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'వారసుడు'
కథాకథనాల్లో కనిపించని వైవిధ్యం
యాక్షన్ కి .. ఎమోషన్ కి పెద్దపీట
హుషారెత్తించిన తమన్ సాంగ్స్
ఫైట్స్ లో .. డాన్స్ లో విజయ్ ఎనర్జీ హైలైట్
కథాకథనాల్లో కనిపించని వైవిధ్యం
యాక్షన్ కి .. ఎమోషన్ కి పెద్దపీట
హుషారెత్తించిన తమన్ సాంగ్స్
ఫైట్స్ లో .. డాన్స్ లో విజయ్ ఎనర్జీ హైలైట్
Movie Name: Varasudu
Release Date: 2023-01-14
Cast: Vijay, Rashmika Mandana, Jayasudha, Prakash Raj, Sharath Kumar, Srikanth, Yogi Babu
Director: Vamsi Paidipalli
Music: Thaman
Banner: Sri Venkateshwara Creations
Review By: Peddinti
Varasudu Rating: 3.00 out of 5
Trailer