ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లు కూడా సినిమా కంటెంట్ తో సమానంగా పోటీపడుతున్నాయి. కథాకథనాల పరంగానే కాదు, నిర్మాణ విలువల పరంగా కూడా ఎక్కడా రాజీపడటం లేదు. ఇతర భాషల నుంచి వచ్చే వెబ్ సిరీస్ లను కూడా ఫాలో అవుతున్నవారికి, తెలుగు వెబ్ సిరీస్ లను మరింత క్వాలిటీతో అందించవలసి ఉంటుంది. అలాంటి ప్రయత్నాలకు సిద్ధపడే దిగుతున్నారు. తాజాగా 'సోనిలివ్' నుంచి మరో తెలుగు వెబ్ సిరీస్ పలకరించింది .. దాని పేరే '3Cs'.
ఈ రోజునే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుహాసిని రాహుల్ - రాహుల్ యాదవ్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ కి సంపత్ కుమార్ తోట దర్శకత్వం వహించాడు. నిత్య శెట్టి .. స్పందన .. జ్ఞానేశ్వరి ప్రధానమైన పాత్రలను పోషించారు. 6 ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్ సిరీస్ ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూద్దాం.
ఈ వెబ్ సిరీస్ టైటిల్ '3Cs' అని పెట్టారు .. 'ఛాయిసెస్ .. ఛాన్సెస్ .. ఛేంజెస్' అనేది ట్యాగ్ లైన్ గా కనిపిస్తుంది. ఇక ఈ కథ అంతా కూడా ఛైత్ర .. చందన .. కేథరిన్ అనే ముగ్గురు యువతుల చుట్టూ తిరుగుతుంది. అందువల్లనే ఈ టైటిల్ ను సెట్ చేశారు. టైటిల్ దగ్గర నుంచి కొత్తదనం చూపిస్తున్నారు గనుక .. ఇందులో విషయమేదో గట్టిగానే ఉంటుందని అనుకోవటం సహజం. ఈ కథ హైదరాబాదులో మొదలవుతుంది.
ఛైత్ర .. చంద్రిక .. కేథరిన్ ముగ్గురూ కూడా స్నేహితులు. చైత్రకి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. అందువలన తన పేరెంట్స్ ఎలా చెబితే అలా నడుచుకుంటూ ఉంటుంది. ఇక చంద్రిక విషయానికి వస్తే, తండ్రి ఒక దేశంలో .. తల్లి ఒక దేశంలో ఉంటారు. ఆర్ధికంగా చంద్రికకు ఎలాంటి లోటూ రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఇక కేథరిన్ చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోతుంది .. తండ్రి వదిలేసి ముంబై వెళ్లిపోతాడు. అందువలన ఎలాంటి ఎమోషన్స్ లేకుండా పెరుగుతుంది.
ఛైత్రకి సుజిత్ తో పెళ్లి కుదురుతుంది.. మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకుంటారు. అందుకు సంబంధించిన పనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలోనే చైత్రను చంద్రిక .. కేథరిన్ కలుస్తారు. తాను 'రోహన్'తో ప్రేమలో పడినట్టుగా ఆ సందర్భంలోనే చంద్రిక చెబుతుంది. అతను మోసగాడనే విషయాన్ని కేథరిన్ చెబుతుంది. చంద్రిక నమ్మకపోవడంతో ఆమెను వెంటబెట్టుకుని పబ్ కి తీసుకుని వెళుతుంది.
రోహన్ నిజస్వరూపం తెలుసుకున్న చంద్రిక అక్కడ మద్యం తాగుతుంది. ఆమె ఒత్తిడి చేయడంతో ఛైత్ర .. కేథరిన్ కూడా తాగుతారు. ఆ మత్తులో నుంచి బయటికి వచ్చిన తరువాత తాము అండమాన్ కి చెందిన 'క్రూజ్'లో ఉన్నట్టుగా తెలుసుకుని ఆశ్చర్యపోతారు. కేవలం 3 గంటల్లో తాము అండమాన్ ఎలా వచ్చామని ఆశ్చర్యపోతారు. తమని ఎవరు తీసుకుని వచ్చారు? ఎందుకు తీసుకుని వచ్చారు? అనేది అర్థం కాదు. అప్పుడు ఆ ముగ్గురు ఏం చేస్తారు? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? పెళ్లి సమయానికి ఛైత్ర ఇంటికి చేరుకుందా? లేదా? అనేదే కథ.
ఈ కథను ఒక లైన్ గా చాలా క్లారిటీతో చెప్పచ్చు. కానీ దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు గందరగోళంగా అనిపిస్తుంది. తెలియని ప్రదేశానికి డబ్బులు లేకుండా వచ్చినప్పుడు కలిగే అయోమయం.. భయం ముగ్గురు యువతుల్లోను కనిపించదు. వాళ్లు ఉన్న పరిస్థితిని చూసి ఆడియన్స్ లో టెన్షన్ ఉండదు. ముగ్గురు యువతులు చేసిన పనులు .. పర్యవసానాలు .. పాత్రలన్నీ దేని కోసం పరుగెడుతున్నాయి? ఏ వైపుకు వెళుతున్నాయి? అనే విషయంలో క్లారిటీ లోపించింది.
పాత్రల సంఖ్య ఎక్కువైపోవడం .. కొన్ని పాత్రలు రిజిస్టర్ కాకపోవడం .. విలనిజమనేది కామెడీ టచ్ తో కొనసాగాలా? సీరియస్ గా నడిపించాలా? అనే విషయంలో ఒక క్లారిటీ లేనట్టుగా అనిపిస్తుంది. ఈ కథను సిల్లీగా కాకుండా .. కామెడీ టచ్ లేకుండా సీరియస్ గా తీసుకుని వెళితే బాగుండేదేమో అనిపిస్తుంది. కథ .. పాత్రలు హడావిడిగా పరిగెడుతున్నా, అందుకు సిల్లీ రీజన్స్ చెబుతుండటం వలన తేలిపోతుంటాయి.
ముగ్గురు అమ్మాయిలు తమ ప్రమేయం లేకుండా అండమాన్ చేరుకోవడానికి బలమైన కారణాలు కనిపించవు. అక్కడి నుంచి వాళ్లు బయటపడటానికి బలమైన అడ్డంకులు ఎదురుకావు. ఈ ముగ్గురు యువతులను కేంద్రంగా చేసుకుని జరిగే గ్యాంగ్ వార్ లో పస కనిపించదు. ఆ గ్యాంగ్ వార్ దేనికోసమైతే జరుగుతుందో, ఆ అంశానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇవ్వలేదు. సునీల్ కాశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. అభిరాజ్ నాయర్ కెమెరా పనితనం ఫరవాలేదు.
ఓటీటీ రివ్యూ: '3Cs' (సోని లివ్ వెబ్ సిరీస్)
| Reviews
3csNithya Review
- సోనీలివ్' నుంచి '3Cs' వెబ్ సిరీస్
- ఈ రోజునే మొదలైన స్ట్రీమింగ్
- 6 ఎపిసోడ్స్ తో పూర్తయిన వెబ్ సిరీస్
- బలహీనమైన కథాకథనాలు
- క్లారిటీ లేని అంశాలతో సాగిన సన్నివేశాలు
Movie Name: 3csNithya
Release Date: 2023-01-06
Cast: Nithya Shetty, Spandana, Gnaneshwary, Ram Nithin
Director: Sampath Kumar Thota
Music: Sunil Kashyap
Banner: Streamline productions
Review By: Peddinti
3csNithya Rating: 2.00 out of 5
Trailer