తెరపై హీరోగా కుదురుకోవడానికి సంతోష్ శోభన్ గట్టిగానే ట్రై చేస్తున్నాడు. తన సినిమాల్లో కామెడీ ఎంతమాత్రం తగ్గకుండా చూసుకుంటూ వస్తున్నాడు. ఆయన హీరోగా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' సినిమా రూపొందింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించిన ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కంటెంట్ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.
జీవితంలో సరదాగా చేసే కొన్ని పనులు ఒక్కోసారి ప్రమాదంలో పడేస్తుంటాయి. అలా ఒక యువకుడు .. యువతి వేరు వేరు ప్రాంతాల నుంచి యూ ట్యూబ్ వీడియోస్ కోసం ఒక ఫారెస్టు ఏరియాకు వెళతారు. వాళ్లకి ఎంతమాత్రం సంబంధం లేని ఒక సమస్య వాళ్లను వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. ఊహించని ప్రమాదం ఒక్కసారిగా వాళ్లను చుట్టుముడుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అక్కడి నుంచి ఎలా బయాటపడతారు? అనేదే కథ.
ఈ కథ విశాఖపట్నంలో 1990లో మొదలవుతుంది .. ఆ తరువాత ప్రస్తుత కాలానికి వస్తుంది. విప్లవ్ (సంతోష్ శోభన్) పలు ప్రాంతాలకి వెళుతూ .. తన ట్రావెలింగ్ కి సంబంధించిన వీడియోలను తన 'గువ్వ విహారి' యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేస్తుంటాడు. 'అరకు' ప్రాంతానికి సంబంధించిన వీడియో చేయడానికి డేనియల్ (సుదర్శన్) ను కెమెరా మేన్ గా తీసుకుని ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. ఇక ఢిల్లీలో యూ ట్యూబర్ గా ఉంటూ వసుధ (ఫరియా అబ్దుల్లా) మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. వసుధ కూడా అరకు అందాలను షూట్ చేయడానికి అక్కడికి చేరుకుంటుంది.
వసుధ యూ ట్యూబ్ వీడియోలను ముందు నుంచే చూస్తూ ఆమె అభిమానిగా ఉన్న విప్లవ్, ఆమె ప్రత్యక్షంగా కనిపించడంతో ప్రేమికుడిగా మారిపోతాడు. తను వచ్చిన పనిని పక్కన పెట్టేసి ఆమె వెంట తిరుగుతూ ఉంటాడు. ఇదే సమయంలో హోమ్ మంత్రి (శుభలేఖ సుధాకర్) తో చర్చలకు వెళ్లిన అరకు ప్రాంతంలోని నక్సలైట్ నాయకులు తిరిగిరారు. అందుకు కారకుడు డీజీపీ నరేంద్ర వర్మ (నరేన్) అని భావించిన ముఠా నాయకులు, అతనిని అంతం చేయడానికి ప్లాన్ చేస్తుంటారు.
అదే సమయంలో డీజీపీ కూతురు వసుధ అరకులోనే ఉందనే విషయం నక్సలైట్ నాయకుడైన గోపన్న ( మైమ్ గోపీ)కి తెలుస్తుంది. ఢిల్లీలో ఉందనుకున్న తన కూతురు యూట్యూబ్ వీడియోస్ కోసం అరకు వెళ్లిందనే సంగతి కూడా అదే సమయంలో డీజీపీకి తెలుస్తుంది. ఇక తమతో అడవిలో ఆడుతూ పాడుతూ తిరిగిన వసుధ, డీజీపీ కూతురనే విషయం అప్పుడే విప్లవ్ కి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? పర్యవసానాలు ఎలాంటివి? అనే మలుపులతో కథ ముందుకు వెళుతుంది.
మేర్లపాక గాంధీ ఇంతకుముందు తెరకెక్కించిన సినిమాల్లో ఎంతోకొంత విషయం కనిపిస్తూ వచ్చింది. కానీ కామెడీ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాను మాత్రం ఆయన సీరియస్ గా తీసుకోలేదనే విషయం అర్థమవుతుంది. కథ ఎక్కడో మొదలై .. ఎక్కడికో వెళుతుంది. ఈ మధ్యలో ఎటు తోస్తే అటు పరిగెడుతుంది. కామెడీ అని ఆయన అనుకున్నది ఆడియన్స్ కి సిల్లీ కామెడీగా అనిపిస్తుంది. సినిమాలో హీరో వైపు నుంచి యాక్షన్ లేదు .. ఏ వైపు నుంచి కూడా కామెడీ పేలలేదు. ఎమోషన్ వర్కౌట్ కాలేదు.
కథ మొదలైన దగ్గర నుంచి హీరో - హీరోయిన్స్ ఫారెస్టులో ఉంటారు. పోనీ అక్కడ వారి మధ్య రొమాన్స్ ను ఏమైనా వర్కౌట్ చేశారా అంటే ఒక్క పాటతో సరిపుచ్చారు. ఏ ట్రాకు పట్టుకున్నా అది బలహీనంగా సాగుతూ ఉంటుంది. బోరింగుగా నడుస్తూ ఉంటుంది. సుదర్శన్ తాను బాలీవుడ్ హిట్ సినిమాలకి కెమెరా మెన్ అని చెప్పుకోవడం .. హీరో అతణ్ణి తన యూ ట్యూబ్ వీడియోస్ కి గాను కెమెరా మెన్ గా పెట్టుకోవడం, తిండిపోతులతో ... పిరికివాళ్లతో నక్సలైట్ల టీమ్ ను బ్రహ్మాజీ తయారు చేయడం .. ఇలా ఎన్నో సిల్లీ అంశాలు కథలో కనిపిస్తాయి.
పాత్రల పరంగా చూసుకుంటే గొప్పగా డిజైన్ చేయకపోయినా, ఎవరికి తెలిసిన నటనతో వాళ్లు కనిపిస్తారు. ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచిన పాటల్లో 'ఏమంటినబ్బాయో .. ' అంటూ సాగే ఐటమ్ మాస్ బీట్ తో ఆకట్టుకుంటుంది. ' ఓ లచ్చువమ్మా .. లచ్చువమ్మా' అనే పాట కూడా బాగానే కనెక్ట్ అవుతుంది. వసంత్ ఫొటోగ్రఫీ .. రాము ఎడిటింగ్ ఫరవాలేదు.
కథను పట్టుగా .. పకడ్బందీగా అల్లుకోకపోవడం, కథనం విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం .. పాత్రల ప్రాధాన్యతకి తగినట్టుగా డిజైన్ చేయకపోవడం .. ఆ పాత్రల నుంచి సరైన అవుట్ పుట్ రాబట్టకపోవడం .. క్లైమాక్స్ కి ముందువరకూ హీరో - హీరోయిన్ మధ్య రొమాన్స్ వర్కౌట్ కాకపోవడం ప్రేక్షకులను నిరాశ పరుస్తాయి. ఈ కథ సినిమా స్థాయి కంటెంట్ కాదా? లేదంటే ఆ స్థాయిలో దృష్టి పెట్టలేదా? అనే డౌటుతోనే ఆడియన్స్ థియేటర్లో నుంచి బయటికి రావడం కనిపిస్తుంది.