మూవీ రివ్యూ : 'ది ఘోస్ట్'

The Ghost

The Ghost Review

  • ఈ శుక్రవారమే విడుదలైన 'ది ఘోస్ట్'
  • ఆకట్టుకున్న యాక్షన్ సన్నివేశాలు 
  • ఆడియన్స్ కి కనెక్ట్ కాని ఎమోషన్స్ 
  • బలమైన విలనిజం లోపించిన సినిమా 
  • తెరపై ఎక్కువగా కొత్త ముఖాల హడావిడి

రొమాంటిక్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నాగార్జున, ఈ మధ్య కాలంలో యాక్షన్ సినిమాలను ఎక్కువగా చేస్తూ వెళుతున్నాడు. అలా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన సినిమానే 'ది ఘోస్ట్'.సునీల్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. సోనాల్ చౌహాన్ కథానాయికగా అలరించిన ఈ సినిమాలో, గుల్ పనాగ్ ..  అనిఖ సురేంద్రన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'గరుడ వేగ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో, సహజంగానే 'ది ఘోస్ట్' పై అందరిలో ఆసక్తి ఉంది. ప్రేక్షకుల అంచనాలకు ఈ సినిమా ఎంత దగ్గరగా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

1984లో ఢిల్లీలో జరిగిన మత పరమైన ఘర్షణలతో విక్రమ్ (నాగార్జున) తన తల్లిని పోగొట్టుకుంటాడు. అప్పటికి అతని వయసు పది పన్నెండేళ్లు ఉంటాయి. ఆ సమయంలో అతనిని ఒక కల్నల్ కాపాడి తన ఇంటికి తీసుకుని వెళతాడు. తన కూతురు 'అనూ'తో సమానంగా విక్రమ్ ను పెంచుతాడు. విక్రమ్ ఇంటర్ పోల్ లో చేరడానికి ఆయనే కారకుడు.ఇంటర్ పోల్ లో తనతో కలిసి పనిచేసే ప్రియ (సోనాల్ చౌహాన్)ను ఆయన వివాహం చేసుకుంటాడు. ఇద్దరూ కలిసి అనేక ఆపరేషన్స్ లో పాల్గొంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే కల్నల్ అనారోగ్యానికి లోనవుతాడు.

ఆయన కూతురు 'అనూ' ( గుల్ పనాగ్)  ప్రేమ వివాహం చేసుకోవడం వలన ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోతాయి. అలా కాలక్రమంలో 20 ఏళ్లు గడిచిపోతాయి. 'అనూ' ఏకైక సంతానమే అదితి (అనిఖ సురేంద్రన్). అనూ భర్త మరణించడంతో కంపెనీ వ్యవహారాలు చక్కబెడుతూ .. అదితి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే కల్నల్ చనిపోతూ 'అనూ' ఫ్యామిలీని కనిపెడుతూ ఉండమని విక్రమ్ తో  చెబుతాడు. అనూ కబురు చేయడంతో ఆమెను కలుసుకున్న విక్రమ్ కీ, ఆమె ఫ్యామిలీ ప్రమాదంలో ఉందనే విషయం అర్థమవుతుంది. అప్పుడు విక్రమ్ ఏం చేస్తాడు? పర్యవసానాలు ఎలాంటివి? అనేదే కథ.

ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఇంతకుముందు చాలామంది హీరోలు .. చాలా యాక్షన్ సినిమాలు చేశారు. అలాంటి సినిమాలలో ఇది ఒకటి. కాకపోతే ఈ సినిమాపై ప్రవీణ్ సత్తారు వేసిన తనదైన మార్క్ కనిపిస్తుంది.  ఇలాంటి కథల్లో యాక్షన్ ఎక్కువగా కనిపించినప్పటికీ, అది ఎమోషన్ ను ప్రధానంగా చేసుకుని నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలోనూ ఇటు ఎమోషన్ .. అటు యాక్షన్ ఉన్నాయి. తనకి జీవితాన్నిచ్చిన ఒక కల్నల్ కుటుంబాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నాగార్జున కనిపిస్తాడు. ఆయనతో పాటు సమానమైన యాక్షన్ సీన్స్ లో సోనాల్ చౌహాన్ 'ఔరా' అనిపిస్తుంది.

కథా పరంగా చూసుకుంటే కొత్తగా ఏమీ కనిపించదు. ముందుగా చెప్పుకున్నట్టుగా ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ఇక అద్భుతమైన స్క్రీన్ ప్లే .. ట్విస్టులు కూడా ఏమీ లేవు. ఆస్తులు .. వారసులు .. వ్యాపారాల్లో వాటాలు ... ఆధిపత్యం కోసం వేసే ఎత్తులు .. పైఎత్తులతో ఈ కథ నడుస్తుంది. అది కూడా ఫ్లాట్ గా సాగిపోతూ ఉంటుంది. ఇందులోకి ఎంటరైన మాఫియా .. విక్రమ్ ను చూసి కంగారు పడుతుంది. ఎందుకంటే వాళ్లంతా ఆయనకి గతంలో  పెట్టుకున్న పేరే 'ఘోస్ట్'. ఒకానొక సమయంలో అండర్ వరల్డ్ డాన్ లంతా కలిసి, ఘోస్ట్ పాదాల చెంత మోకరిల్లుతారు. దాంతో  ఆయన తన ఊచకోతకు ఫుల్ స్టాప్ పెట్టేసి కంటిచూపుతోనే కనికరించేస్తాడు. ఈ అంశమే ఆడియన్స్ కి మింగుడు పడటానికి కాస్త సమయం పడుతుంది.

ప్రవీణ్ సత్తారు కథా కథనాలు అంత బలంగా ఏమీ అనిపించవు. ఉన్న కథలో అనిఖ సురేంద్రన్ పాత్ర ముఖ్యమైనదే అయినా, ఆ అమ్మాయికి సంబంధించిన ఎపిసోడ్ కి ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరిగింది. అందువలన ఆ పాయింటును కాస్త  లాగినట్టుగానే అనిపిస్తుంది. అలాగే ఒకానొక సమయంలో చిన్న పాత్రలు చేసే పెద్ద సందడి కూడా మైనస్ గా మారిందేమో అనిపించకమానదు. అంతేకాదు లేటెస్ట్ గన్స్ తో శత్రువులు విరుచుకుపడుతుంటే నాగ్ ఖడ్గంతో రంగంలోకి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నటన విషయానికి వస్తే ఎవరి పాత్ర పరిధిలో వారు బాగానే చేశారు. 

ఈ సినిమా కోసం భరత్ - సౌరభ్ కట్టిన బాణీలు పెద్దగా ఆకట్టుకోవు. ముఖ్యంగా 'దూరాలైనా .. తీరాలైనా;' పాటలో ర్యాప్ సాహిత్యాన్ని తట్టుకుని కూర్చోవడం అంత తేలికైన విషయం కాదనిపిస్తుంది. ఇక మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ముఖేశ్ జీ కెమెరా పనితనం బాగుంది. ఈస్ట్ అరేబియా సన్నివేశాలను .. చేజింగ్ సీన్స్ ను .. ఫైట్స్ ను .. పాటలను చిత్రీకరించిన తీరు బాగుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే ఓకే. ఇక దినేశ్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన ఫైట్స్ కొత్తగా అనిపిస్తాయి.

ఈ సినిమాలో నాగార్జున పోషించిన 'ఘోస్ట్' పాత్ర బలమైనది. అయితే ఆ స్థాయికి తగినట్టుగా ఆ పాత్రను డిజైన్ చేయలేదనిపిస్తుంది.  బలమైన విలన్ అంటూ ఉండడు. కథ నడుస్తున్నా కొద్దీ విలన్ కేటగిరీలోకి చేరుతున్నవారి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఒకానొక దశలో నాగ్ తప్ప మిగతా ముఖాలన్నీ కూడా కొత్తవే కనిపిస్తాయి. యాక్షన్ వైపు నుంచి ఎన్ని ఎక్కువ మార్కులుపడతాయో .. ఎమోషన్ వైపు నుంచి అంత తక్కువ మార్కులు పడతాయి. ఇటు నాగ్ కెరియర్లోను .. అతి తెలుగు తెరపైనా ఇంతవరకూ వచ్చిన యాక్షన్ సినిమాలలో ఇది ఒకటి మాత్రమే. అంతకుమించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు

Movie Name: The Ghost

Release Date: 2022-10-05
Cast: Nagarjuna,Sonal Chouhan, Anikha Surendran, Gul Panag
Director: Praveen Sattaru
Music: Mark K Robin
Banner: Sri Venkateswara Cinemas

The Ghost Rating: 2.50 out of 5

Trailer

More Reviews