'బుర్రకథ' మూవీ రివ్యూ

BurraKatha

Movie Name: BurraKatha

Release Date: 2019-07-05
Cast: Aadi Saikumar, Misthi Chakraborthy, Nairashah, Rajendra Prasad, posani, Abhimanyu Singh
Director:Diamond Rathna Babu
Producer: Kiran Reddy, Srikanth deepala, Kishor
Music: Sai Karthik
Banner: Deepala Arts
Rating: 2.00 out of 5
కథానాయకుడు అభిరామ్ రెండు మెదళ్లతో పుట్టిన కారణంగా అభి - రామ్ గా పిలవబడుతుంటాడు. ఒక మెదడు పనిచేస్తున్నప్పుడు క్లాస్ స్వభావంతోను .. మరో మెదడు పనిచేస్తున్నప్పుడు మాస్ మనస్తత్వంతోను ఆయన ప్రవర్తిస్తుంటాడు. పర్యవసానంగా చోటుచేసుకునే మలుపులతో కొనసాగిన సినిమాయే 'బుర్రకథ'. కథాకథనాల్లో తగినంత పట్టులేని కారణంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

శరీరాలు వేరైనా కథానాయకులు ఇద్దరూ ఒకే విధంగా ప్రవర్తించే కథలు .. శరీరాలు అతుక్కుని పుట్టిన హీరోల మధ్య విరుద్ధ భావాలకి సంబంధించిన కథలు .. పైకి కనిపించకున్నా ఒక హీరోలోనే మరొకరు వున్నట్టుగా చూపుతూ కొన్ని కథలు గతంలో తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. అలాంటి విభిన్నమైన కథతో వచ్చిన సినిమానే 'బుర్రకథ'. హీరో రెండు మెదళ్లతో పుట్టడం అనే అరుదైన అంశంతో ఈ కథను రూపొందించారు. రచయితగా మంచి పేరున్న డైమండ్ రత్నబాబు తొలిసారిగా తెరకెక్కించిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందన్నది పరిశీలిద్దాం.

కథలోకి వెళితే .. పదేళ్ల వయసు వున్న 'అభిరామ్' మనస్తత్వం తల్లిదండ్రులకు (రాజేంద్రప్రసాద్ దంపతులకు) చిత్రంగా అనిపిస్తుంది. దాంతో ఆ పిల్లాడిని వాళ్లు డాక్టర్ ప్రభుదాస్ (పోసాని) దగ్గరికి తీసుకెళతారు. ఆ పిల్లాడికి కొన్ని టెస్టులు చేసిన ప్రభుదాస్, అతను రెండు మెదళ్లతో పుట్టినట్టు చెబుతాడు. ఏదైనా పెద్ద శబ్దం వచ్చినప్పుడు అతను ఒక మెదడు నుంచి మరో మెదడుకి మారిపోతాడని అంటాడు. ఒక మెదడులో స్టోర్ చేయబడిన విషయాలు మరో మెదడుకి తెలియవని చెబుతాడు.

ఈ కారణంగానే అతని ఆలోచనలు .. అలవాట్లు .. అభిరుచులు .. అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయని అంటాడు. ఆపరేషన్ చేస్తే పెద్దమొత్తంలో ఖర్చు అవుతుందని చెబుతాడు. దాంతో ఆ ఆలోచనను విరమించుకుని అభిరామ్ తల్లిదండ్రులు తిరిగొచ్చేస్తారు. అప్పటి నుంచి 'అభిరామ్' ఒకే శరీరాన్ని కలిగిన ఇద్దరుగా అంటే, 'అభి'గా .. 'రామ్'గా పెరుగుతాడు. టీనేజ్ లోకి అడుగుపెట్టిన తరువాత 'అభి' హ్యాపీ (మిస్తీ చక్రవర్తి)ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. 'రామ్' అసలు పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. పర్యవసానంగా వాళ్ల జీవితంలో చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో మిగతా కథ కొనసాగుతుంది.

రచయితగా అనేక చిత్రాలకి పనిచేసిన డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా మారాడు. తొలి ప్రయత్నంలోనే ఆయన కాస్త జటిలమైన పాయింట్ నే ఎంచుకున్నాడని చెప్పాలి. రెండు బుర్రలున్న కథానాయకుడు ఎప్పటికప్పుడు మారిపోయే సన్నివేశాలను ఆయన బాగానే ప్లాన్ చేసుకున్నా, శరీరం ఒకటే .. వున్న హీరో ఒకడే కనుక, ప్రేక్షకులకు పెద్ద థ్రిల్ గా ఏమీ అనిపించదు. 'అభి' పాత్రకి మాస్ టచ్ ఇచ్చిన ఆయన, క్లాస్ టచ్ తో 'రామ్' పాత్రను పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోలేకపోయాడు. ఈ పాత్రను అర్థం చేసుకునే విషయంలో ప్రేక్షకుడు కాస్తంత అయోమయానికి లోనవుతాడు. అందుకు కారణం ఆ పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు పేలవమైనవి కావడమే .. అక్కడక్కడా స్పష్టత లోపించడమే. ఇక విలన్ గగన్ విహారి (అభిమన్యు సింగ్) పాత్రను .. 'బొంగరం హేమ'గా పృథ్వీ పాత్రను .. నైరా షా పాత్రను కూడా ఆయన సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయాడు. పాయింట్ కొత్తదే అయినా, తెరపై దానిని ఆసక్తికరంగా ఆవిష్కరించే విషయంలో ఆయన కొంతవరకే సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

ఇక కథానాయకుడు ఆది సాయికుమార్ విషయానికొస్తే, తన గత చిత్రాల్లో కంటే లుక్ పరంగా ఈ సినిమాలో హ్యాండ్సమ్ గా కనిపించాడు. మాస్ లుక్ తో 'అభి'గా .. క్లాస్ టచ్ తో 'రామ్' గా రెండు వైవిధ్యభరితమైన పాత్రల్లోను బాగా నటించడానికి ప్రయత్నించాడు. ఫైట్స్ ... డాన్స్ విషయంలో గతంలో కంటే పర్ఫెక్షన్ చూపించాడు. తన తండ్రిని విలన్ గ్యాంగ్ నుంచి కాపాడుకునే యాక్షన్ సీన్ లోను .. 'అభి' కారణంగా తాను జీవితంలో అనుకున్నవి సాధించలేకపోయానని తల్లిదండ్రుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసే సన్నివేశంలోను ఇన్వాల్వై చేశాడు. కథానాయికగా మిస్తీ చక్రవర్తి చాలా అందంగా కనిపించింది. ఆమె కాంబినేషన్లో కొన్ని సీన్స్ ఉన్నప్పటికీ అవి అంతగా బలమైనవేం కాదు. పాత్ర పరిథిలో ఆమె ఓకే అనిపించింది. ఇక రాజేంద్రప్రసాద్ .. పోసాని పాత్రల పరంగా తమదైన మార్కు చూపించే ప్రయత్నం చేశారు. 'జబర్దస్త్' మహేశ్ .. చమ్మక్ చంద్ర తమ పాత్రల ద్వారా నవ్వించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. అసలు పృథ్వీ పాత్ర ప్రయోజనమేమిటన్నది ఎవరికీ అర్థం కాదు.

సంగీతం పరంగా చూసుకుంటే సాయి కార్తీక్ బాణీలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. గుర్తుపెట్టుకోదగిన ట్యూన్లు లేవు. ముఖ్యంగా వేశ్య గృహంలోని 'లైటు తీయనా'అనే పాట ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం ఫరవాలేదు. బీచ్ ఒడ్డున పాటను అందంగా ఆవిష్కరించాడు .. మిస్తీ చక్రవర్తిని గ్లామరస్ గా చూపించాడు. ఎడిటర్ వర్మ తన కత్తెరకి మరింత పని చెబితే బాగుండేది. ముఖ్యంగా విలన్ కాంబినేషన్లోని సీన్స్ ను .. పృథ్వీ సీన్స్ ను ట్రిమ్ చేయాల్సింది. ఫైట్స్ .. కొరియోగ్రఫీ ఫరవాలేదనిపిస్తాయి. కథాకథనాల్లో కావాల్సినంత పట్టులేకపోవడం .. పాటలు హత్తుకునేలా లేకపోవడం .. కామెడీ పండకపోవడం .. కొన్ని పాత్రల విషయంలో క్లారిటీ లోపించడం కారణంగా ఈ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే చెప్పాలి.

More Reviews