'శివన్' మూవీ రివ్యూ

Shivan

Movie Name: Shivan

Release Date: 2020-03-13
Cast: Sai Teja, Tharuni Singh, Ashritha Vemuganti, CVL
Director:Shivan
Producer: Santhosh Reddy
Music: Siddharth Sadasivuni
Banner: S.R. Cine Enterprises 
Rating: 1.75 out of 5
శివన్ .. సునంద గాఢంగా ప్రేమించుకుంటారు .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే హఠాత్తుగా సునందపై శివన్ దాడి చేసి, ఆమెను హత్య చేస్తాడు. అందుకు కారణమేమిటి? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ. రొమాన్స్  .. కామెడీ పాళ్లు ఏ మాత్రం లేని ఈ సినిమా, యాక్షన్ .. ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుంది. బలహీనమైన కథాకథనాల కారణంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పొచ్చు. 

ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన కథలు తెలుగు తెరను ఎక్కువగా పలకరిస్తున్నాయి. తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో కథను ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ తిప్పుతూ, ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. సస్పెన్స్ తో సాగే ఈ తరహా కథలను చూడటానికి ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి కంటెంట్ తో వచ్చిన చిత్రమే 'శివన్'. దర్శకుడు శివన్ తెరకెక్కించిన ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూడటం కోసం కథలోకి అడుగుపెడదాం.

శివన్ (సాయితేజ) సునంద (తరుణి సింగ్) ఇద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుతుంటారు. యుక్తవయసులోకి అడుగుపెట్టగానే వాళ్ల స్నేహం .. ప్రేమగా మారుతుంది. తల్లిదండ్రులను కోల్పోయిన శివన్ కి, సునందనే అండగా నిలుస్తుంది. ఒకానొక సమయంలో ఆమె తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా మిగిలిపోయిన సునందకు తోడుగా నిలబడటం కోసం, ఆమెను పెళ్లి చేసుకోవాలని శివన్ నిర్ణయించుకుంటాడు. స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి బైక్ పై బయల్దేరతారు. అయితే మార్గమధ్యంలో ఏదో ఆవహించిన వ్యక్తిలా శివన్ క్రూరంగా మారిపోతాడు. నడి రోడ్డుపైనే సునందను కిరాతకంగా హత్య చేస్తాడు.

హత్యానేరంపై శివన్ ను పోలీసులు అరెస్టు చేస్తారు .. కోర్టు అతనికి యావజ్జీవ శిక్షను విధిస్తుంది. అయితే శివన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి లంచం ఎరగా వేసి, జైలు నుంచి తప్పించుకుంటాడు. తన స్నేహితుడైన చిన్నా సాయంతో ఒక సైకియాట్రిస్టును కలుసుకుంటాడు. హత్య జరిగిన సమయంలో తను హఠాత్తుగా మారిపోయాననీ, తన చేతులతో హత్య జరిగినప్పటికీ ఈ సంఘటన వెనుక ఎవరో ఉన్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ కేసును పరిశీలించిన ఆ సైకియాట్రిస్ట్ .. శివన్ కి ఏం చెప్తాడు? అప్పుడు శివన్ ఏం చేస్తాడు? అనే మలుపులతో ఈ కథ సాగుతుంది.

దర్శకుడు శివన్ అల్లుకున్న కథ బలంగా లేదు .. కథనం కూడా ఆసక్తికరంగా లేదు. కొన్ని సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పటికీ, కొత్త పాత్రధారులు ఎక్స్ ప్రెషన్స్ లేకుండా చెప్పిన డైలాగ్స్ వలన సహజత్వాన్ని కోల్పోయాయి. దర్శకత్వ లోపం కారణంగా కొన్ని సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. హీరోహీరోయిన్ల బాల్యానికి .. టీనేజ్ కి సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు రక్తి కట్టించలేకపోయాడు.  

కథ ఆరంభంలోనే హీరోయిన్ ను హత్య చేయించడం దర్శకుడు చేసిన ప్రధానమైన పొరపాటుగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఇద్దరి మధ్య రొమాన్స్ చూసే అవకాశం ప్రేక్షకులకు లేకుండా పోయింది. హీరోయిన్ హత్య జరిగిన దగ్గర నుంచి తెరపై హీరోను మాసిపోయిన బట్టలతో .. వంటినిండా గాయాలతో చూపిస్తూ ప్రేక్షకులను మరింత నిరుత్సాహ పరిచాడు. తన చేతులతో హత్య చేసిన కథానాయకుడు, తనకి తెలియకుండా ఇలా ఎలా జరిగిందా అని ఆశ్చర్యపోవాలి. కానీ ఇలా జరగడం వెనుక ఎవరో వున్నారని అతనే చెప్పడం కథలోని లోపంగా అనిపిస్తుంది.

కథ ఆరంభంలోనే కథానాయికను చంపేసిన దర్శకుడు, కథ చివరిలో విలన్ ను ఫ్రేమ్ లోకి తీసుకొస్తాడు. అతనితో పిట్టకథ లాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పించి పంపించారు. అది కూడా అంతంత మాత్రం ఎపిసోడ్. ప్రీ క్లైమాక్స్ లో నైజీరియన్లతో కాస్త హడావిడి చేయించినా ప్రయోజనం శూన్యం. కాకపోతే చివర్లో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ మాత్రం బాగానే వుంది.

సిద్ధార్థ్ సంగీతం .. రీ రికార్డింగ్ ఆకట్టుకోలేకపోయాయి. సన్నివేశాలకి తగిన రీ రికార్డింగ్ పడలేదు. మీరన్ కెమెరా పనితనం ఫరవాలేదు. కొన్ని దృశ్యాలను ఆకట్టుకునేలా చిత్రీకరించాడు. శివ ఎడిటింగ్ విషయానికొస్తే, తక్కువ మార్కులే పడతాయి. శివన్ జైలులోనుంచి తప్పించుకోవడం .. నైజీరియన్ లేడీని ఎక్కువ సేపు ఛేజ్ చేయడం .. ట్రిమ్ చేస్తే బాగుండేది. హీరో హీరోయిన్ల రెస్టారెంట్ సీన్ కూడా అనవసరం అనిపిస్తుంది. 'ప్రేమంటే నమ్మడం .. పెళ్లంటే నమ్మకం' వంటి ఒకటి రెండు డైలాగ్స్ గుర్తుండిపోతాయి.

నటీనటుల విషయానికొస్తే హీరో సాయితేజ బాగా చేశాడు. యాక్షన్ .. ఎమోషనల్ సీన్స్ లో మెప్పించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. కొన్ని యాంగిల్స్ లో అతను .. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పటి ప్రభాస్ లా అనిపించాడు. కథానాయికగా తరుణి సింగ్ కాసేపు అందంగా మెరిసి అదృశ్యమైంది అంతే. ఇక హీరో తల్లిగా ఆశ్రిత వేముగంటి .. సీవీఎల్ పాత్ర పరిధిలో నటించారు.

దర్శకుడు శివన్ .. హీరోయిన్ లేకుండా కథ మొత్తాన్ని నడిపించే సాహసం చేశాడు. అలాగే కామెడీకి ఎంతమాత్రం అవకాశం లేని ప్రయోగం చేశాడు. ఉన్న యాక్షన్ .. ఎమోషన్స్ లో జీవం లేదు. సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యే కాన్సెప్ట్ కాదు. కథలో గందరగోళం .. పసలేని ట్విస్టులు .. సన్నివేశాలకి సహజత్వాన్ని చేకూర్చలేకపోయిన కొత్త ఆర్టిస్టులు. హీరోపాత్రని సపోర్ట్ చేసే హీరోయిన్ లేకపోవడం .. హీరోతో తలపడే విలన్ చివరి వరకూ ఫ్రేమ్ లోకి రాకపోవడం ప్రధానమైన లోపాలుగా కనిపిస్తాయి. ఈ కారణాల వలన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు.  

More Reviews