'మిస్టర్. K K' మూవీ రివ్యూ

19-07-2019 Fri 18:51
Movie Name: Mister. K K
Release Date: 2019-07-19
Cast: Vikram, Akshara Haasan, Abhi Haasan, Lena, Vikas, Cherry
Director: Rajesh Selva
Producer: Kamal Haasan
Music: Ghibran
Banner: Rajkamal Films International

మలేసియా నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడి పారిశ్రామికవేత్త హత్య కేసులో, నేరచరిత్ర కలిగిన K.K.ను ఇరికించడానికి పోలీస్ ఆఫీసర్ విన్సెంట్ ప్రయత్నిస్తాడు. అందుకోసం ఆయన పన్నిన వ్యూహంలో అమాయకులైన యువ దంపతులు చిక్కుకుంటారు. K.K.తో పాటు ఆ దంపతులు ఈ వలలో నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ. యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కి ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా విక్రమ్ కనిపిస్తాడు. పాత్రకి తగినట్టుగా లుక్ ను మార్చుకోవడం విక్రమ్ లో కనిపించే విశేషం. విక్రమ్ చేసిన విలక్షణమైన పాత్రలే అగ్రహీరోల జాబితాలో ఆయనకి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాయి. జయాపజయాల సంగతి అటుంచి, కొత్తదనం పేరుతో ఆయన సాహసాలే చేస్తుంటాడు. తాజాగా ఆయన చేసిన మరో సాహసమే 'మిస్టర్.K K'. తమిళంలో 'కదరం కొందాన్' పేరుతో రూపొందిన ఈ సినిమా, తెలుగులో 'మిస్టర్.K K' గా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త కాన్సెప్టుతో .. కొత్త లుక్ తో విక్రమ్ చేసిన ప్రయోగం ఏ మేరకు ఫలించిందో ఇప్పుడు చూద్దాం.

మలేసియాలోని ఒక హాస్పిటల్లో వాసు(అభిహాసన్) జూనియర్ డాక్టర్ గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య 'అథిర'(అక్షర హాసన్) గర్భవతి. ఒక ప్రమాదంలో గాయపడిన K.K.(విక్రమ్)ను వాసు పనిచేసే హాస్పిటల్లో చేరుస్తారు. పారిశ్రామిక వేత్త హత్య కేసుతో K.K.కు సంబంధం ఉందనీ, ఆయన స్పృహలోకి రాగానే అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ ఆఫీసర్ విన్సెంట్ (వికాస్) ఎదురుచూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాసు భార్యను కిడ్నాప్ చేసిన K.K. తమ్ముడు నందా, మూడు గంటల్లో K.K.ను తనకి అప్పగించకపోతే అథిరను చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో K.K.ను హాస్పిటల్ నుంచి తప్పించి నందాకు అప్పగించడానికి తీసుకెళతాడు వాసు. అక్కడ జరిగే అనూహ్యమైన సంఘటనతో కథ అనేక మలుపులు తీసుకుంటుంది. అవేమిటనేది తెరపై చూస్తేనే ఆసక్తికరంగా ఉంటుంది.

కమలహాసన్ తన సొంత బ్యానర్లో తను చేయాలనుకున్న సినిమా ఇది. రాజకీయాలలో తను బిజీగా ఉండటం వలన, విక్రమ్ తో ఆయన ఈ సినిమాను నిర్మించాడు. రాజేశ్ సెల్వ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు.కథను మలేసియాలో మొదలుపెట్టి అక్కడే ముగించాడు. తను ఎంచుకున్న కథను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. డ్యూయెట్స్ లేకపోయినా, కామెడీకి చోటు ఇవ్వకపోయినా ఎక్కడా ఆ వెలితి కనిపించనీయకుండా కథనాన్ని వేగంగా నడిపించాడు. కాకపోతే ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు లేకపోవడమే లోపంగా కనిపిస్తుంది. కథని నడిపించే ముఖ్యమైన పాత్రలను మాత్రం పూర్తి క్లారిటీతో ఆయన తీర్చిదిద్దాడు. ముఖ్యంగా విక్రమ్ పాత్రను ఆయన చాలా కొత్తగా .. స్టైలీష్ గా డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. క్రిమినల్ యాక్టివిటీస్ చేసే పోలీస్ గ్యాంగ్ వేసే ఎత్తులను, వాళ్ల ఉచ్చులో నుంచి తప్పించుకునే విక్రమ్ పాత్రను యాక్షన్ పరంగా హైలైట్ చేస్తూ, యువ దంపతులైన అభిహాసన్ - అక్షరహాసన్ పాత్రల ద్వారా ఎమోషన్ ను రాబడుతూ దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు.

క్రిమినల్ గా మారిన ఇంటెలిజెంట్ అండర్ కవర్ కాప్ గా K.K.పాత్రలో విక్రమ్ జీవించాడు. డిఫరెంట్ లుక్ తో చాలా స్టైలీష్ గా ఆయన ఈ సినిమాలో కనిపించాడు. ఈ వయసులోను ఎంతమాత్రం తగ్గని ఆయన ఫిట్ నెస్ ఈ పాత్రకి మరింత ప్లస్ అయింది. యాక్షన్ సీన్స్ కి మరింత బలాన్ని తెచ్చిపెట్టింది. తక్కువ మాటలు .. ఎక్కువ హావభావాలు కలిగిన ఈ పాత్రపై ఆయన తనదైన ముద్రవేశాడు. తెరపై తను కనిపించే ప్రతి సన్నివేశానికి సహజత్వాన్ని తీసుకొచ్చాడు. ఇక గర్భవతి అయిన తన భార్యను కాపాడుకునే జూనియర్ డాక్టర్ పాత్రలో అభిహాసన్ ఎమోషన్స్ ను బాగా పండించాడు. గర్భవతి అయిన నిస్సహాయురాలిగా అక్షర హాసన్ కూడా ఎమోషన్ సీన్స్ లో మెప్పించింది. క్రిమినల్ యాక్టివిటీస్ చేసే పోలీస్ ఆఫీసర్ వికాస్ నే ఈ సినిమాకి విలన్. డబ్బుకోసం ఎంతకైనా తెగించే తన పాత్రలో చాలా సహజంగా నటించాడు. ఇక సిన్సియర్ గా పనిచేసే పోలీస్ గ్యాంగ్ లో యంగ్ లేడీ ఆఫీసర్ గా కనిపించిన చెర్రీ, పాత్ర పరంగా .. లుక్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో రెండే పాటలు వున్నాయి. ఒక పాట భార్యాభర్తల అనురాగం నేపథ్యంలో అభిహాసన్ - అక్షర హాసన్ కాంబినేషన్లో వస్తే, మరో పాట విలన్ అంతు చూడటం కోసం యాక్షన్ లోకి దిగిన హీరో నేపథ్యంలో వస్తుంది. సందర్భానికి తగినట్టుగా రెండు పాటలు ఫరవాలేదనిపిస్తాయి. జిబ్రాన్ చేసిన రీ రికార్డింగ్ ఈ సినిమాకి ప్రాణంగా నిలిచిందనే చెప్పాలి. చేజింగ్స్ .. యాక్షన్ నేపథ్యంలోని సన్నివేశాలను ఆర్ ఆర్ తో ఆయన పైకి లేపేశాడు. ఈ సినిమాకి శ్రీనివాస్ ఆర్ గుత్తా సినిమాటోగ్రఫీకి కూడా ప్రధానమైన ఆకర్షణ అనే చెప్పాలి. కౌలాలంపూర్ లోని లొకేషన్స్ ను తెరపై ఆయన గొప్పగా ఆవిష్కరించాడు. ఆడియన్స్ ను అబ్బురపరిచే స్థాయిలో ఛేజింగ్ సీన్స్ ను .. యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించాడు. ఇక ప్రవీణ్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఎక్కడా కన్ఫ్యూజన్ అనేది లేకుండా .. అనవసరమైన సీన్ అనేది లేకుండా చాలా నీట్ గా ఆయన తన పనితనం చూపించాడు.

యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కుతుంది. డ్యూయెట్లను .. హీరోయిన్ నుంచి గ్లామర్ ను .. కామెడీని ఆశించే ప్రేక్షకులకు మాత్రం కొంత నిరాశనే కలిగిస్తుంది. పూర్తిగా విదేశీ నేపథ్యంలో .. హాలీవుడ్ తరహా కథాకథనాలతో.. తెలుగు నేటివిటీకి దూరంగా సాగే ఈ సినిమా, సాధారణ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోవచ్చు. ఈ సినిమాను విక్రమ్ చేసిన మరో ప్రయోగంగానే చూస్తే మాత్రం ఓకే అనిపిస్తుంది.            


More Articles