పటిష్టంగా సఖీ కేంద్రాలు: మంత్రి సత్యవతి రాథోడ్

Related image

  • కౌన్సిలర్లుగా సీనియర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు
  • సఖీ కేంద్రాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు
  • రెసిడెన్షియల్, కేజీబీవిలలోకి ప్రైవేట్ ఎన్జీవోలలోని బాలికల ప్రవేశం
  • కొత్తగా రాష్ట్రానికి పది బాయ్స్ షెల్టర్ హోమ్స్ మంజూరు
  • గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి
(హైదరాబాద్, అక్టోబర్ 19): మహిళల సమస్యలన్నింటికి ఒకే కేంద్రంగా పరిష్కారం చేస్తున్న సఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశామని, ఈ నెలాఖరు నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సఖీ కేంద్రాలను పటిష్టం చేయడం, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ అడ్మిషన్లు, ప్రైవేట్ ఎన్జీవోలలోని బాలికలకు భద్రత, భవిష్యత్ కల్పించడం వంటి అంశాలపై నేడు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి దివ్య, జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ, ఇతర అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేశారు.

ఎన్జీవోల ఆధ్వర్యంలో నడుస్తున్న సఖీ కేంద్రాలను మరింత బాధ్యతాయుతంగా, పటిష్టంగా చేసేందుకు సఖీ కేంద్రాలలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిని నియమించాలని నిర్ణయించామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అదేవిధంగా అక్కడకు వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైరైన అధికారులను, నిపుణులైన న్యాయవాదులను నియమించనున్నట్లు వెల్లడించారు. సఖీ కేంద్రాలకు పోలీస్ శాఖ నుంచి ఒక అధికారిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ నెలాఖరున సఖీ కేంద్రాలపై పోలీసు ఉన్నతాధికారులతో కలిసి మహిళా భద్రత అంశంపై  రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రైవేట్ ఎన్జీవోలలోని బాలికలకు ఇటీవల జరుగుతున్న ఇబ్బందుల నేపథ్యంలో వారికి మంచి విద్య, వసతి కల్పించే లక్ష్యంతో ఈ ఎన్జీవోలలోని బాలికలను రెసిడెన్షియల్ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చేర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అనాథ బాలుర, షెల్టర్ కావల్సిన బాలుర కోసం ఇప్పటి వరకు రాష్ట్రంలో షెల్టర్ హోమ్స్ లేవని త్వరలో పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పది బాలుర షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తి అయ్యాయని, ఈ నెలాఖరున అడ్మిషన్లు పొందిన వారికి ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గల తల్లిదండ్రులు లేనివారు, తల్లిదండ్రుల్లో ఒకరే ఉన్నవారు, అన్యాయానికి గురైన బాలికలకు ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్స్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇచ్చామని తెలిపారు.

More Press Releases