Vijay Sethupathi: మురళీధరన్ ప్రకటన తర్వాత.. బయోపిక్ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి!

  • '800' చిత్రంలో విజయ్ నటిస్తుండటంపై పలువురి అభ్యంతరం
  • విజయ్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న మురళీధరన్
  • సినిమా నుంచి తప్పుకోవాలని సూచన
Vijay Sethupathi out of Muralitharan biopic 800

ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి '800' సినిమా నుంచి బయటకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా '800' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మురళి పాత్రకు విజయ్ ని ఎంపిక చేశారు. అయితే శ్రీలంకలో తమిళులను ఊచకోత కోసిన అక్కడి ప్రభుత్వానికి మురళి మద్దతుగా ఉన్నాడని... అలాంటి వ్యక్తి పాత్రను పోషించకూడదంటూ తమిళనాడులో పలువురు ప్రముఖులు విజయ్ కు సూచించారు. ఈ నేపథ్యంలో, సినిమా నుంచి తప్పుకోవాలని మురళీధరన్ కూడా సూచించారు. దీంతో, సినిమా నుంచి విజయ్ తప్పుకున్నాడు.  

ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న మురళీధరన్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ సినిమా వల్ల విజయ్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని... అందువల్ల సినిమా నుంచి విజయ్ తప్పుకోవాలని కోరుతున్నానని చెప్పాడు. ఈ సినిమాలోని పాత్రధారులను మార్చే పనిలో నిర్మాతలు ఉన్నారని... త్వరలోనే తన బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. మరోవైపు మురళి స్టేట్మెంటును విజయ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. 'థాంక్యూ అండ్ గుడ్ బై' అని ట్వీట్ చేశాడు.

మురళీధరన్ స్టేట్మెంట్ లో ఏముందంటే.. "నా బయోపిక్ '800' చుట్టూ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఒక దురభిప్రాయంతో ఈ చిత్రం నుంచి తప్పుకోవాలని పలువురు విజయ్ సేతుపతిపై ఒత్తిడి తెచ్చారు. తమిళనాడులోని ప్రతిభావంతులైన నటుల్లో ఒకడైన విజయ్ ఇబ్బందుల్లో పడటం నాకు ఇష్టం లేదు. అందువల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాలని విజయ్ కు సూచిస్తున్నా. ఈ సినిమా వల్ల విజయ్ సినీ కెరీర్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు.  

ఇబ్బందుల వల్ల నేనెప్పుడూ అలసిపోలేదు. ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులను ఎదుర్కోవడం వల్ల మాత్రమే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఎంతోమంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిప్రదాయంగా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ బయోపిక్ కు అంగీకారం తెలిపాను. ప్రస్తుత ఇబ్బందుల నుంచి నిర్మాతలు బయటపడతారని భావిస్తున్నాను. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తామని నిర్మాతలు నాకు చెప్పారు. వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను.

ఈ ఇబ్బందికర సమయంలో నాకు అండగా నిలిచిన మీడియాకు, రాజకీయ నాయకులకు, విజయ్ అభిమానులకు, ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు చెపుతున్నాను" అని మురళీధరన్ తెలిపాడు.

More Telugu News