మధ్యప్రదేశ్ మహిళా మంత్రిని ఐటమ్ గా అభివర్ణించిన కమల్ నాథ్... బీజేపీ ఆగ్రహం

18-10-2020 Sun 21:52
Kamal Nath describes Madhya Pradesh minister Imarti Devi an Item
  • దబ్రా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు
  • బీజేపీ తరఫున బరిలో ఉన్న కేబినెట్ మంత్రి ఇమార్తి దేవి
  • తాను ఆమె పేరును కూడా పలకనని చెప్పిన కమల్

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా దబ్రా అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల వాతావరణం వాడీవేడిగా మారింది. అధికార బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. కేబినెట్ మంత్రి, దబ్రా అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఇమార్తి దేవిని ఆయన ఐటమ్ గా అభివర్ణించారు.

ఎన్నికల సభలో మాట్లాడుతూ "మన అభ్యర్థి ఎంతో నిరాడంబరమైన వ్యక్తి. ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెతో పోల్చితే మన అభ్యర్థి ఎంతో మేలు. ఇంతకీ ఆమె పేరేంటి...? అయినా నేను ఆమె పేరు ఎందుకు పలకాలి? ఏం ఐటమ్ అబ్బా... ఏం ఐటమ్!" అంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై సీరియస్ అయిన బీజేపీ వర్గాలు కమల్ నాథ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఓ దళిత అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కమల్ నాథ్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.