మీ అవినీతి కరపత్రిక పేరుతో ఐదున్నర కోట్లు కొట్టేస్తున్నారు: నారా లోకేశ్

18-10-2020 Sun 20:22
Nara Lokesh slams CM Jagan over paper issue
  • గుంటూరు నగరకపాలక సంస్థ వర్క్ ఆర్డర్ ను పంచుకున్న లోకేశ్
  • దొంగపేపర్ కోసం ప్రజల సొమ్ము మింగుతున్నారంటూ ఆగ్రహం
  • అడ్డదారుల్లో సర్క్యులేషన్ పెంచుకుంటున్నారని విమర్శలు

గుంటూరులోని ఓ వార్డు సచివాలయానికి ఓ తెలుగు దినపత్రిక సరఫరా చేయడం కోసం గుంటూరు నగరపాలక సంస్థ జారీ చేసిన వర్క్ ఆర్డర్ ను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్లు ప్రభుత్వానికి అదనపు భారం అంటూ పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్న మీరు దొంగ పేపర్ అమ్ముకోవడానికి ప్రజల సొమ్ము మింగడం ఏంటి? అంటూ సీఎం జగన్ ని నిలదీశారు.

ఓ పక్క ప్రకటనల పేరుతో వందల కోట్ల దోపిడీ చేస్తున్నారని, ఇప్పుడు ఏకంగా గ్రామ, వార్డు సచివాలయల్లోకి మీ అవినీతి కరపత్రిక పేరుతో ఐదున్నర కోట్లు కొట్టేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ప్రజలు ఛీ కొట్టడంతో అడ్డదారుల్లో సర్క్యులేషన్ పెంచడానికి నానా తంటాలు పడుతున్నారని, ఎంత పెంచినా మీ దొంగ పత్రిక జన్మరహస్యమైన అవినీతి కంపు పోతుందా? అని ప్రశ్నించారు.