శ్రీవారి బ్రహ్మోత్సవాలు

దేవుడు అంటే శ్రీనివాసుడే ... వైభవం అంటే ఆయనదే అనే అశేష భక్త జన కోటిచే ఆ ఏడుకొండలవాడు నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. వైకుంఠం నుంచి కొండలు ... కోనేర్లతో పాటు దిగివచ్చిన ఆ దేవుడంటే ప్రతి ఒక్కరికీ ప్రాణమే. లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి వచ్చిన స్వామి, పద్మావతీ దేవిని పరిణయమాడటానికి అంతకన్నా ఎక్కువ కష్టాలు పడ్డాడు. చివరికి తన కష్టాలను పక్కన పెట్టి ... భక్తుల కష్టాలను తీర్చడమే పనిగా పెట్టుకున్నాడు.

తన దర్శనానికి రావాలని భక్తులు అనుకున్న మరుక్షణమే స్వామి అందుకు అవసరమైన ఏర్పాట్లు చకచకా పూర్తిచేస్తుంటాడు. ఆయనని దర్శించడానికి భక్తులు ఎంతగా తపించిపోతారో, వారిని చూడటానికి స్వామి కూడా అంతకన్నా ఎక్కువ ఆరాటపడతాడు. ''గోవిందా'' అంటే చాలు స్వామి పులకించిపోతాడు ... పరుగు పరుగునా పర్వతాలు దాటుకుని మరీ వస్తాడు. తన కొండకి రాలేని నిస్సహాయుల చెంతకి రావడానికి కూడా స్వామి ఎంత మాత్రం ఆలస్యం చేయడు.

చక్రవర్తులను సైతం తలదన్నే వైభవం స్వామి సొంతమైనప్పటికీ, ఆయన మనసంతా తన చెంతకి రావడానికి ఇబ్బందులు పడుతున్న నిరుపేదలపైనే వుంటుంది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి చూడటం కోసం వెయ్యిజన్మలెత్తాలనిపిస్తుంది ... కష్టాలే ఆయన దగ్గరికి రావడానికి కారణమైతే ఆ కష్టాలు కలాకాలం వున్నా ఫరవాలేదనిపిస్తుంది. అలాంటి స్వామి సౌందర్యం బ్రహ్మోత్సవాలే వేదికగా ... వేడుకగా ఆవిష్కృతమవుతుంది.

అందుకే 'శ్రీవారి బ్రహ్మోత్సవాలు' అంటే ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆయన భక్తులు పెద్ద పండుగలా భావిస్తుంటారు. ఇక ఈ సందర్భంగా స్వామివారికి జరిగే విశేష అలంకరణలు చూస్తే ఆయనని జగన్మోహనుడని ఎందుకన్నారనేది అర్థమవుతుంది. ఇక బ్రహ్మదేవుడే వచ్చి స్వామివారి ఉత్సవాలను ప్రారంభిస్తాడు కనుక, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది. ఆరంభంలో ఈ బ్రహ్మోత్సవాలు నెలకోసారి జరిగేవి. ఆ తరువాత ఏడాదికి ఒకసారి చొప్పున జరుగుతూ వస్తున్నాయి.

తొలి రోజుల్లో గ్రామతిరునాళ్ల మాదిరిగా జరుగుతూ వచ్చిన ఈ బ్రహ్మోత్సవాలు, కాలక్రమంలో వైభవాన్ని పెంచుకుంటూ వచ్చాయి. ఈ బ్రహ్మోత్సవాల ఆరంభం రోజున ప్రధాన అర్చకులు ... విష్వక్సేనుల వారితో కలిసి, కార్యనిర్వాహక సభ్యులు వెంటరాగా,తిరుమల మాడవీధుల్లో తిరుగుతూ ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తారు. అలా 'అంకురార్పణ' తో మొదలైన బ్రహ్మోత్సవాలు, 13 రోజులపాటు జరిగి 'చక్రస్నానం'తో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు వివిధ రూపాలతో ... వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తాడు.

ఈ నేపథ్యంలో పెద్ద శేష వాహనం .. చిన్న శేష వాహనం .. హంసవాహనం .. సింహవాహనం .. ముత్యపు పందిరి వాహనం .. కల్పవృక్ష వాహనం .. సర్వభూపాల వాహనం .. గరుడ వాహనం .. హనుమంత వాహనం .. సూర్యప్రభ వాహనం .. చంద్రప్రభ వాహనం .. గజవాహనం .. అశ్వవాహనం దర్శనమిస్తుంటాయి. ఇక ప్రతి వాహనం కూడా బ్రహ్మదేవుడు సారధ్యం వహిస్తున్నట్టుగా ముందుకు కదులుతూ వుండటం విశేషం.

తొలినాళ్లలో ... అంటే క్రీ.శ.614 వ సంవత్సరంలో పల్లవ రాణి 'పేరిందేవి' 'మనవాళ పెరుమాళ్' అనే 'భోగ శ్రీనివాసమూర్తి' వెండి విగ్రహాన్ని ఆలయానికి సమర్పించింది. ఆనాటి బ్రహ్మోత్సవాల్లో ఈ ప్రతిమను ఊరేగిస్తూ వుండేవారు. ఆ తరువాత క్రీ.శ.966 వ సంవత్సరంలో పది రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఇక ఆ తరువాత వచ్చిన పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు .. తిరువేంకటనాథ యాదవరాయలు .. వీర ప్రతాపరాయలు .. హరిహరరాయలు .. అచ్యుతరాయలు ... బ్రహ్మోత్సవ వైభవాన్ని పెంచుతూ వచ్చారు.

ఈ నేపథ్యంలో 1583 సంవత్సరం నాటికి నెలకి ఒకసారి చొప్పున బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉండేవి. ఇక శ్రీవారి తొలివాహనంగా 'బంగారు తిరుచ్చి' ఉపయోగించినట్టుగా చరిత్ర చెబుతోంది. క్రీ.శ. 1520 లో స్వామివారికి 'రథోత్సవం' నిర్వహించిన దాఖలాలు వున్నాయి. ఇక 1530 లో 'గరుడ వాహనం'. 1538లో 'సూర్య ప్రభవాహనం' ... 'వెండి గజవాహనం' ఏర్పాటు చేయబడ్డాయి. ఇక 1614 లో 'వెండి శేష వాహనం' ... 'సింహ వాహనం' స్వామివారి సేవకు సమకూర్చబడ్డాయి.

1625లో స్వామివారి సేవలో 'బంగారు అశ్వ వాహనం' ... 'వెండి గజవాహనం' ... 'సర్వభూపాల వాహనం' ప్రవేశపెట్టారు. ఈ వాహనాలపై ఆశీనుడై ఊరేగే స్వామివారిని దర్శించడం వలన మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా స్వామివారిని దర్శించుకోవడానికి ప్రపంచం నలువైపుల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుంటారు. స్వామివారి వైభవాన్ని తనివితీరా తిలకిస్తూ, అలసటనే కాదు ... తమని తాము మరిచిపోయి ఆనంద బాష్పాలను వర్షిస్తారు.


More Bhakti News