అలా గణపతికి మూషికం వాహనమైంది !

సాధారణంగా లోకంలో ఎవరైనా సరే తాము అధిరోహించడానికి తగిన వాహనాన్ని ఎంచుకుంటూ వుంటారు. అప్పుడే ప్రయాణం సుఖవంతంగా ... సౌకర్యవంతంగా వుంటుంది. అలాంటిది వినాయకుడి విషయానికి వచ్చేసరికి ఆయన వాహనంగా 'ఎలుక' కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంటుంది.

వినాయకుడిది అసలే భారీ ఆకారం ... అలాంటిది దానిపై ఆయన ఎలా ఆశీనుడవుతాడు ? ఆయన భారాన్ని అంత చిన్నఎలుక ఎలా మోస్తుందనే సందేహం చాలామందికి కలుగుతూ వుంటుంది. అయితే వినాయకుడు తన వాహనాన్ని ఎలుకగా చేసుకోవడం వెనుక ఆసక్తికరమైన పురాణ కథనం వినిపిస్తూ వుంటుంది.

పూర్వం 'గజముఖుడు' అనే రాక్షసుడు పరమశివుడిని తపస్సుచేత మెప్పించి అనేక వరాలను పొందుతాడు. ఇక తనకి ఎదురులేదనే గర్వంతో, అటు దేవతలను ... ఇటు సాధు సత్పురుషులను అనేక విధాలుగా హింసించసాగాడు. దాంతో అందరూ కలిసి ఈ విషయాన్ని వినాయకుడి దృష్టికి తీసుకు వెళతారు. గజముఖుడి బారి నుంచి తమని కాపాడమని కోరతారు. దాంతో వినాయకుడు రంగంలోకి దిగుతాడు .. ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది.

వినాయకుడు అనేక రకాల ఆయుధాలను గజముఖుడిపై ప్రయోగించినా ప్రయోజనం లేకపోతుంది. దాంతో తన దంతాన్ని విరిచి ఆ రాక్షసుడి పైకి విసురుతాడు. అది అత్యంత శక్తిమంతమైనదని గ్రహించిన రాక్షాసుడు, వెంటనే 'ఎలుక' రూపాన్ని ధరించి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది గమనించిన వినాయకుడు అందుకు అవకాశం ఇవ్వకుండా, ఆ ఎలుకనెక్కి కూర్చుంటాడు.

తనపై అధిష్ఠించిన వినాయకుడి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో గజముఖుడికి అర్థమైపోతుంది. దాంతో ఆయన తన మనసు మార్చుకుని వినాయకుడి గొప్పతనాన్ని అంగీకరిస్తాడు. వినాయకుడి సన్నిధిలో తనకి ప్రత్యేకస్థానం లభించేలా చేయమని కోరతాడు. దాంతో మూషిక రూపంలోనే తన వాహనంగా వుండమంటూ ఆయనకి వరాన్ని ప్రసాదిస్తాడు. అలా ఎలుకను వినాయకుడు తన వాహనంగా చేసుకోవడం జరిగింది.


More Bhakti News