శ్రీరామనవమికి వడపప్పు పానకం ?

శ్రీరామనవమికి ప్రతి మనసు వేదికగా మారుతుంది ... ప్రతి ఊరు వేడుక జరుపుతుంది. నూతన సంవత్సరంలో తొలి కల్యాణం సీతారాములదే అవుతుంది. రాములవారి కల్యాణం లోక కల్యాణం కోసం నిర్దేశించబడినది. అందుకే ముందుగా సీతారాముల కల్యాణం జరిపించిన తరువాతే, జన వ్యవహారంలో వివాహ సంబంధమైన ప్రయత్నాలు మొదలవుతుంటాయి.

శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.

ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం ... పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం ... పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని... పోషకాలను అందిస్తూ ఉంటాయి.

జీర్ణ సంబంధమైన ... మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త ... కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.


More Bhakti News