శ్రీ అంబికా మాత క్షేత్రం

శ్రీ అంబికా మాత క్షేత్రం
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు దుష్టశిక్షణ చేయడం కోసం అనేక రూపాలను ధరించింది. లోక కల్యాణం కోసం అమ్మవారు అసుర సంహారం చేసినందుకు కృతజ్ఞతగా అమ్మవారిని ఆయా రూపాల్లో భక్తులు పూజించుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో అమ్మవారు వెలసిన క్షేత్రాలు కొన్నయితే, ఆ తల్లి తమకి నిత్యం కనిపిస్తూ ఉండాలనే ఉద్దేశంతో భక్తులు నిర్మించుకున్నవి మరొకొన్ని.

ఇక అమ్మవారు ఆవిర్భవించిన క్షేత్రాలైనా ... భక్తులు ఏర్పాటు చేసుకున్న కోవెలలైనా నిత్యం భక్తులతో సందడిగా కనిపిస్తూనే వుంటాయి. నవరాత్రులలో వివిధ ఉత్సవాలతో కళకళలాడుతూనే వుంటాయి. అలా కొలువైన అమ్మవారి ఆలయం మనకి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారిని 'అంబికామాత' గా కొలుస్తుంటారు. ద్వాపరయుగంలో అంబికాదేవిని శ్రీ కృష్ణుడు ఆరాధించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా కోరిన వరాలను ప్రసాదించే కల్పవృక్షంగా భక్తులు అమ్మవారిని పూజిస్తూ వుంటారు.

చక్కగా తీర్చిదిద్దినట్టుగా కనిపించే ఈ ఆలయం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అమ్మవారు అష్టాదశ (18) శక్తి పీఠాల్లో ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఈ సంఖ్యకి గల విశిష్టతను గుర్తుకు తెస్తూ ఇక్కడి అమ్మవారి మూలమూర్తిని మలచడానికి 18 నెలలు పట్టడం విశేషంగా చెబుతారు. గర్భాలయంలో అమ్మవారి ప్రతిమ అత్యంత మనోహరంగా దర్శనమిస్తూ వుంటుంది. అష్టభుజాలతో ... చక్కని కనుముక్కుతీరుతో ... విశాల నేత్రాలతో ... తళుక్కుమంటూ మెరిసే ముక్కెరతో అమ్మవారి రూపం సమ్మోహనకరంగా వుంటుంది.

ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషంగా జరిగే కుంకుమ పూజలలో భక్తులు విరివిగా పాల్గొంటారు. ఇక నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ... విశేష పూజలు జరుగుతూ వుంటాయి. సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని, కృతజ్ఞతా పూర్వకంగా ఆ తల్లికి కానుకలు సమర్పించుకుంటూ వుంటారు.

More Bhakti Articles