టాలీవుడ్ బుల్లితెర నటుడు రాజేష్ దత్తాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య సాధన!

03-05-2021 Mon 10:10
  • పలు హిట్ సీరియల్స్ లో నటించిన రాజేష్
  • భార్యను కట్టుబట్టలతో గెంటేసిన వైనం
  • రాజేష్ ఇంటి ముందు బైఠాయించిన సాధన
Police Complaint on TV Actor Rajesh by Wife

తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ సీరియల్స్ గా నిలిచిన మొగలిరేకులు, చక్రవాకం, రాధాకల్యాణం, తూర్పు వెళ్లే రైలు, వదినమ్మ తదితర 28 సీరియల్స్ లో నటించిన రాజేష్ దత్తా, నిజ జీవితంలో తనలోని విలనిజాన్ని భార్య ముందు ప్రదర్శించి, పోలీసు కేసులో చిక్కుకున్నాడు. రాజేశ్ భార్య సాధన అలియాస్ అరుణ వెల్లడించిన వివరాల ప్రకారం, 2015లో వీరిద్దరి వివాహం జరిగింది. ఆ సమయంలో కట్న కానుకలను భారీగానే ఇచ్చారు. మూడు నెలల కాపురం తరువాత పరిస్థితి మారిపోయింది.

చెన్నైలో కాపురం పెట్టిన రాజేష్, తరచూ షూటింగ్స్ పేరిట భార్యను వదిలేసి హైదరాబాద్ కు వచ్చేవాడు. ఇతర అమ్మాయిలతో తనకు వివాహం కాలేదని చెబుతూ, సంబంధాలు నడిపేవాడు. అతని వైఖరిని ప్రశ్నిస్తే, సాధనను తీవ్రంగా హింసించేవాడు. పరాయి స్త్రీలను ఇంటికి ఎందుకు తెస్తున్నావని ప్రశ్నించగా, తనను కట్టుబట్టలతో ఇంటి నుంచి గెంటేశారని సాధన వాపోయింది. ఆపై జగద్గిరి గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, తనకు న్యాయం చేయాలని కోరింది. ఆపై రాజేష్ ఇంటి వద్ద బైటాయించి నిరసన తెలిపింది.