Rail: నాలుగేళ్ల నాటి ఫ్లాప్ చిత్రం మాటీవీలో వస్తే... అత్యధిక టీఆర్పీ రేటింగ్!

  • ఇటీవల స్టార్ మాలో ప్రసారమైన 'రైల్'
  • ధనుష్, కీర్తి సురేశ్ నటించగా అప్పట్లో ఫ్లాప్
  • ఇప్పుడు ఏకంగా 4.71 టీఆర్పీ రేటింగ్
Rail Movie Gets Highest TRP Rating in Star MAA

'రైల్'... ఈ సినిమా పేరు ఎప్పుడైనా విన్నారా? నాలుగేళ్ల క్రితం తమిళ హీరో ధనుష్, కీర్తి సురేశ్ కలిసి నటించిన ఓ సినిమా. ఇది అప్పట్లో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో తెలియకుండానే ఓ ఫ్లాప్ గా నిలిచింది. రెండు భాషల్లోనూ ఇది ఓ డిజాస్టర్. ఈ సినిమాను అందరూ మరచిపోయారు కూడా. ఇప్పుడు అదే చిత్రం మా టీవీలో ప్రసారమై, ఓ రికార్డును క్రియేట్ చేసింది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను తీసుకున్న స్టార్ మా, యూ ట్యూబ్ లో కూడా సినిమా వచ్చేసిన తరువాత, రూ. 60 లక్షలు వెచ్చించింది. ఈ చిత్రాన్ని లాక్ డౌన్ సమయంలో టీవీలో ప్రసారం చేయగా, ఏకంగా 4.71 టీఆర్పీ రేటింగ్ వచ్చిందట. ఆ తరువాత సమయంలో కార్తీ నటించిన 'ఖైదీ', సూర్య నటించిన 'ఎన్జీకే' చిత్రాలు కూడా టీవీలో ప్రసారమైనా, వాటికి ఇంతమాత్రం రేటింగ్ కూడా దక్కలేదని స్టార్ మా వర్గాలు వెల్లడించాయి.

రెండు భాషల్లోనూ ఫ్లాప్ అయి, యూ ట్యూబ్ లో కూడా అందుబాటులోకి వచ్చిన ఓ సినిమాకు ఇంత టీఆర్పీ రేటింగ్ రావడం ఓ రికార్డు. ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను మొదటిసారే ఆకట్టుకోవడంతో మరిన్ని సార్లు దీన్ని ప్రసారం చేయనున్న మా టీవీ, శాటిలైట్ హక్కులకు పెట్టిన మొత్తాన్ని తిరిగి వెనక్కు తెచ్చుకోవడంతో పాటు మరింత డబ్బును పొందుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, ఓ రైలులో ప్యాంట్రీ బాయ్ గా పనిచేసే ధనుష్, అదే రైలులో సినిమా ఫీల్డ్ లో చాన్స్ కోసం ప్రయత్నించే అమ్మాయి పాత్రలో కీర్తి సురేశ్ నటించారు. రైల్లో జరిగే సంఘటనలతో నడిపే డ్రైవర్ లేకుండా వేగంతో రైలు వెళుతుండటం, కీర్తి సురేశ్ ను పోలీసులు ఉగ్రవాదిగా భావించడం, వంటి ఘటనలతో సినిమా సస్పెన్స్ తో సాగుతుంది. రైలును ఎలాగైనా ఆపేందుకు ధనుష్ చేసే సాహసాలతో కథ ఉత్కంఠతతో నడుస్తుంది.

More Telugu News