Wuhan: కరోనాపై చైనా విజయం... నేడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారిక ప్రకటన!

  • వూహాన్ లో కొత్త కేసులు లేవు
  • పాజిటివ్ వచ్చిన వారు చికిత్స తరువాత ఇళ్లకు
  • మృతుల సంఖ్య 3,245
  • వూహాన్, హుబేయ్ ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు
No New Corona Cases in China registerd today

కరోనాపై పోరాటంలో చైనా విజయం సాధించింది. దాదాపు మూడున్నర నెలల క్రితం వూహాన్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత, ఇన్నాళ్లకు, నేడు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ఏ పౌరుడికీ కరోనా పాజిటివ్ రాలేదని వెల్లడించింది. వూహాన్ లో కొత్త కేసులు లేవని, పాజిటివ్ వచ్చిన వారు కూడా చికిత్స తరువాత ఇళ్లకు వెళుతున్నారని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది.

కాగా, వూహాన్ లో దాదాపు కోటి మందికి పైగా ప్రజలను, అత్యంత కఠినమైన నిర్ణయాలతో జనవరి 23 నుంచి ఇళ్లకు మాత్రమే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. హుబేయ్ ప్రావిన్స్ ను మూసివేసి, దాదాపు 4 కోట్ల మందిని లాక్ డౌన్ చేసిన చైనా, వారి అవసరాలు తీరుస్తూ, వైరస్ పూర్తిగా చచ్చిపోయేంత వరకూ ఆంక్షలను కొనసాగించింది.

ఇదే సమయంలో చైనాలో నేడు ఎనిమిది మంది వైరస్ కారణంగా మరణించారని, దీంతో మృతుల సంఖ్య 3,245కు చేరిందని కమిషన్ పేర్కొంది. మొత్తం 81 వేల మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకగా, ప్రస్తుతం 7,263 మందికి చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. చైనాలో కరోనా చికిత్సలు అందించిన ఆసుపత్రులను సైతం మూసివేశారు. ఈ నెల 10న వూహాన్ లో స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు జిన్ పింగ్, వైరస్ ను తాము జయించినట్టేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆపై హుబేయ్, వూహాన్ ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు ప్రారంభం అయింది. సరిహద్దులను తిరిగి తెరిచి, ఆరోగ్య వంతుల రాకపోకలకు అనుమతించారు. ప్రావిన్స్ పరిధిలోని లోరిస్క్ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునేందుకు, పనులకు వెళ్లేందుకు, ప్రజలు బయట తిరిగేందుకూ అనుమతించారు.

ఇదే సమయంలో చైనాను మరో భయం కూడా వెన్నాడుతోంది. రెండో సారి కరోనా వ్యాపించే అవకాశాలు కూడా ఉండటమే ఇందుకు కారణం. చైనాకు సరాసరిన రోజుకు 20 వేల మంది వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇదే చైనా పాలకులకు ఆందోళన కలిగిస్తోంది. బీజింగ్ సహా అన్ని విమానాశ్రయాలకు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులంతా తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలన్న ఆదేశాలు జారీ చేసి, అందుకోసం కొన్ని హోటల్స్ ను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చింది.

ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షలను దాటగా, మృతుల సంఖ్య 8,943కు చేరుకుంది. 171 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించగా, చైనా తరువాత ఇటలీ, ఇరాన్ దేశాలపై పెను ప్రభావాన్ని చూపింది. చైనా గట్టున పడిపోగా, మిగతా దేశాలు, ఆ స్థాయిలో ఆంక్షలను అమలు చేయలేకపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News