New Delhi: ఢిల్లీ హింస ప్రణాళిక ప్రకారం చేసిన మారణహోమం: మమతా బెనర్జీ

  • అల్లర్లకు బీజేపీనే కారణమని బెంగాల్ సీఎం ఆరోపణ
  • బెంగాల్‌లో ‘గోలీ మారో’ నినాదాలు చేసిన ముగ్గురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశాం
  • ఢిల్లీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేసిన బీజేపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని డిమాండ్
Mamata Banerjee calls Delhi violence planned genocide

దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన మత హింసపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింసకు కారణం భారతీయ జనతా పార్టీనే అని ఆరోపించారు. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఇది ఒక ప్రణాళిక ప్రకారం సృష్టించిన మారణహోమం. అయినప్పటికీ బీజేపీ ఇంకా క్షమాపణలు చెప్పడం లేదు. పైగా, ఇక్కడికి వచ్చి తమకు బెంగాల్‌ కావాలని అంటున్నారు. కాబట్టి ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని కూల్చాలని మనమందరం ఈ రోజే ప్రతిజ్ఞ చేద్దాం. లేకపోతే ఇలాంటి అల్లర్లను ఆపలేము’ అని సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం  పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు మమత ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే, షా ర్యాలీలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు ‘గోలీ మారో (కాల్పి చంపండి) అనే నినాదాలు చేశారు. దాంతో అమిత్ షా ఆరోపణలకు మమత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

‘నిన్న బెంగాల్‌లో ర్యాలీకి వచ్చిన కొంత మంది గోలీమారో నినాదాలు చేశారని నాకు తెలుసు. అది చట్ట విరుద్ధం. ఈ నినాదాలు చేసిన వాళ్లకు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తాం. ఢిల్లీలో ఇలాంటి రెచ్చగొట్టే నినాదాలు చేసిన బీజేపీ నాయకులను ఇప్పటిదాకా అరెస్టు చేయలేదు. కానీ, నిన్న గోలీమారో అన్న ముగ్గురు బీజేపీ కార్యకర్తలను మేం అరెస్టు చేశాం’ అని మమత చెప్పుకొచ్చారు. అలాగే, ఢిల్లీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎంతో మంది మరణానికి కారణమైన నేతలను ఎందుకు అరెస్ట్‌ చేయలేదో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News